టెస్లా వ్యవస్థాపకులు ఎలొన్‌మస్క్ ఇన్‌సైడ్ ట్రేడింగ్ ద్వారా సంపాదించిన దాదాపు 3 బిలియన్ డాలర్లను(సుమారు రూ.24వేలకోట్లు) తిరిగి వాటాదారులకు ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలైంది. మైకేల్ పెర్రీ అనే టెస్లా షేర్ హోల్డర్ ఈమేరకు అమెరికాలోని డెలావేర్ ఛాన్సరీ కోర్టులో పిటిషన్ వేశారు.
అందులోని వివరాల ప్రకారం.. 2022లో టెస్లా కార్లకు భారీగానే డిమాండ్ ఉంది. కానీ నవంబర్ నెలలో కంపెనీ అంచనాల కంటే అమ్మకాలు తగ్గిపోయాయి. జనవరి 2023లో వెలువడిన నాలుగో త్రైమాసిక ఫలితాలకంటే ముందే మస్క్ చాకచక్యంగా షేర్లు విక్రయించి లాభాలు పొందారు. కంపెనీ సేల్స్ సహా ఇతర విషయాలు తెలుసుకునేందుకు మస్క్‌కు యాక్సెస్ ఉంటుంది. అందుకే ఇన్‌సైడ్ ట్రేడింగ్ ద్వారా ఫలితాల ముందే షేర్లు విక్రయించారు. 2022లో మస్క్‌మొత్తం 7.5 బిలియన్ డాలర్లు(సుమారు రూ.62వేలకోట్లు) విలువ చేసే షేర్లను అమ్మారు. నవంబర్-డిసెంబర్‌లో ఇన్‌సైడ్ ట్రేడింగ్ ద్వారా మస్క్ 3 బిలియన్ డాలర్లు(రూ.24వేలకోట్లు) లాభం పొందారు.
టెస్లా సీఈఓ పదవిలో ఉన్న ఎలొన్‌మస్క్ నిబంధనలకు విరుద్ధంగా సంపాదించిన లాభాలను వెంటనే వాటాదారులకు తిరిగిచ్చేలా ఆదేశించాలని మైకేల్ పెర్రీ కోర్టును కోరారు. మస్క్ షేర్లను విక్రయించేలా టెస్లా డైరెక్టర్లు కూడా కార్పొరేట్ నియమాలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. అయితే ఈ విషయంపై రాయిటర్స్ టెస్లాను వివరణ కోరగా ఎలాంటి స్పందన రాలేదని మీడియా కథనాల ద్వారా తెలిసింది.
ఇదీ చదవండి: తగ్గిన చమురు ధరలు.. ఒపెక్‌ప్లస్ కూటమి ప్రభావం
ఇన్‌సైడ్ ట్రేడింగ్ అంటే..
కంపెనీలో పనిచేస్తున్నవారికి రియల్‌టైమ్‌లో సంస్థ ఉత్పత్తులకు డిమాండ్ ఎలా ఉంది..ఉత్పత్తి ఎలా జరుగుతుంది..రాబోయే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి.. భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి అనే అంశాలపై అవగాహన ఉంటుంది. దాన్ని అసరాగా చేసుకుని అప్పటికే తమకు కంపెనీలో ఉన్న పెట్టుబడులపై నిర్ణయం తీసుకుని అక్రమంగా లాభాలు పొందుతారు.
Comments
Please login to add a commentAdd a comment