Sakshi News home page

ఓటర్లు డబ్బుకు అమ్ముడుపోతారనడం బాధాకరం 

Published Thu, Mar 28 2024 4:31 AM

 Vanga Geeta and Sunil met Mudragada in Kirlampudi - Sakshi

పిఠాపురంలో ఓటరు రూ.లక్షకు అమ్ముడుపోయారనేలా పవన్‌ చిత్రించడం బాధగా ఉంది 

మీలాగే ఓటర్లు అమ్ముడుపోతారనడం సరికాదు 

కాకినాడ ఎంపీగా సునీల్‌ను, పిఠాపురం ఎమ్మెల్యేగా వంగా గీతను గెలిపించాలి.. జగన్‌ను మళ్లీ సీఎం చేయాలి 

పిఠాపురంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి.. స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలి 

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం 

కిర్లంపూడిలో ముద్రగడను కలిసిన సునీల్, వంగా గీత  

కిర్లంపూడి: ఓటర్లు డబ్బులకు అమ్ముడుపోతారనేలా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ వ్యాఖ్యానించడం బాధాకరంగా ఉందని కాపు ఉద్యమ నేత, వైఎస్సార్‌సీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం అన్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓసీ, మైనార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బుధవారం పెద్దఎత్తున కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ముద్రగడ స్వగృహానికి తరలివచ్చి ఆయనను, యువ నాయకుడు ముద్రగడ గిరిబాబును మర్యాదపూర్వకంగా కలిశారు.

కాకినాడ వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత ముద్రగడను కలిశారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయానికి తీసుకోవలసిన జాగ్రత్తలపై ఆయన వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముద్రగడ మీడియాతో మాట్లాడుతూ.. పిఠాపురం నియోజక­­వర్గంలోని ఒక్కో ఓటరుకు సీఎం జగన్‌ లక్ష  ఇస్తున్నారంటూ ప్రజలను అవమానించేలా మాట్లాడడం పవన్‌కు తగదన్నారు.

పవన్‌కు డబ్బు తీసుకునే జబ్బు ఉందని, ఆ జబ్బు అందరికీ ఉంటుందను­కోవ­డం బాధాకరమన్నారు. నియోజకవర్గ ఓ­ట­­ర్లు డబ్బు తీసుకునేవారా? అమ్ము­డుపోయేవారమా? అని ముద్రగడ ప్రశ్నించారు. పిఠాపురం ప్రజలంతా డబ్బుకు అమ్ముడుపోతారనుకోవడం సరికాదన్నారు.  

రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి.. 
ఇక రాష్ట్రంలో అమలవుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలతోపాటు రాష్ట్రాభివృద్ధి సీఎం జగన్‌తోనే సాధ్యమన్నారు. రానున్న ఎన్నికల్లో సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో అధికారంలోకి తీసుకురావడానికి రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని  పార్టీ శ్రేణులు, అభిమానులకు ముద్రగడ విజ్ఞప్తి చేశారు.

ఆరునెలలకోసారి వచ్చి రాజకీయాలుచేసే పవన్‌ కన్నా నిత్యం నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉండే కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌ను, పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పార్టీ విజయానికి శ్రమించిన ప్రతి కార్యకర్తను గుర్తుపెట్టుకోవాలని సునీల్, గీతకు సూచించారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నియోజకవర్గంలో పరిశ్రమలు నెలకొల్పి ప్రజలంతా ఆర్థికంగా బలపడేలా కృషిచేయాలని ముద్రగడ చెప్పారు. తద్వారా స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్నా­రు. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, కొద్దిమంది కాపులవల్లే గతంలో తాను అధికారంలోకి వచ్చానన్నారు. నాకు రాజకీయ భిక్ష పెట్టిన ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రజలను ఎప్పుడూ మరచిపోనన్నారు.   

Advertisement
Advertisement