హార్దిక్‌, రాహుల్‌, బుమ్రా కాదు.. భారత ఫ్యూచ‌ర్ కెప్టెన్ అత‌డే | Sakshi
Sakshi News home page

హార్దిక్‌, రాహుల్‌, బుమ్రా కాదు.. టీమిండియా ఫ్యూచ‌ర్ కెప్టెన్ అత‌డే

Published Mon, Apr 8 2024 4:57 PM

England Legends Huge Praise For Shubman Gill - Sakshi

గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్‌గా టీమిండియా స్టార్ ఓపెన‌ర్ శుబ్‌మ‌న్ గిల్‌కు మంచి మార్కులు ప‌డుతున్నాయి. ఐపీఎల్‌-2024లో హార్దిక్ పాండ్యా నుంచి గుజ‌రాత్ జ‌ట్టు ప‌గ్గాలు చేప‌ట్టిన గిల్‌.. త‌న వ్యూహాత్మ‌క నిర్ణ‌యాల‌తో జ‌ట్టును ముందుకు న‌డిపిస్తున్నాడు. ఈ ఏడాది సీజ‌న్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో మూడింట‌ గుజ‌రాత్ ఓట‌మి పాలైన‌ప్ప‌టికి.. గిల్ మాత్రం త‌న కెప్టెన్సీతో అంద‌ర‌ని అక‌ట్టుకున్నాడు.

అత‌డు బౌల‌ర్లను మార్చే విధానం గానీ ఫీల్డ్ సెట్ కానీ అద్బుతంగా ఉన్నాయి. ఆటు వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న ప‌రంగా కూడా గిల్ అద‌ర‌గొడుతున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు 5 మ్యాచ్‌లు ఆడిన గిల్ 45.75 స‌గ‌టుతో 183 ప‌రుగులు చేశాడు. ఈ నేప‌థ్యంలో గిల్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్  మైఖేల్ వాన్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు.

గిల్‌కు అద్బుత‌మైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయ‌ని వాన్ కొనియాడాడు. కాగా ఆదివారం ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో గుజ‌రాత్ ఓట‌మి పాలైన‌ప్ప‌టికి గిల్ మాత్రం కెప్టెన్‌గా విజ‌య‌వంత‌మ‌య్యాడు. తొలుత బౌలింగ్‌లో త‌న కెప్టెన్సీ మార్క్‌తో ల‌క్నోను నామ‌మాత్ర‌పు స్కోరుకే ప‌రిమితం చేశాడు.

కానీ ఆ త‌ర్వాత బ్యాట‌ర్లు విఫ‌ల‌మ‌వ‌కావ‌డంతో గుజరాత్ ఓట‌మి పాలైంది. ఈ మ్యాచ్‌లో గిల్ కెప్టెన్సీకి వాన్ ఫిదా అయిపోయాడు. "శుబ్‌మ‌న్ గిల్ సార‌థిగా రోజుకు రోజుకు మ‌రింత ప‌రిణితి చెందుతున్నాడు. అత‌డు భవిష్య‌త్తులో క‌చ్చితంగా భార‌త జ‌ట్టు కెప్టెన్ అవుతాడు. అందులో ఎటువంటి సందేహం లేద‌ని" గుజ‌రాత్-ల‌క్నో మ్యాచ్ అనంత‌రం వాన్ ట్విట్ చేశాడు.

హార్దిక్ పాండ్యా,రాహుల్‌, బుమ్రా వంటి వారు రోహిత్ శ‌ర్మ త‌ర్వాత భార‌త కెప్టెన్సీ రేసులో ఉన్న‌ప్ప‌టికి వాన్ మాత్రం గిల్‌ను ఫ్యూచర్ కెప్టెన్‌గా ఎంచుకోవ‌డం గ‌మ‌నార్హం.

Advertisement
Advertisement