ప్రైడో ప్రారంభ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, సంస్థ ఎండీ నరేంద్రకుమార్ తదితరులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భాగ్యనగరవాసులకు నూతనంగా మరో క్యాబ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ వెంకట ప్రణీత్ టెక్నాలజీస్.. ప్రైడో బ్రాండ్ పేరిట క్యాబ్స్ రంగంలోకి ప్రవేశించింది. ఆదివారం మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో జరిగిన కార్యక్రమంలో ప్రైడో యాప్, లోగోలను తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ కేంద్రంగా 2007లో రియల్టీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రణీత్ గ్రూప్.. ఆ తర్వాత ఎడ్యుకేషన్, ఫార్మా, కో–వర్కింగ్ రంగాల్లో కూడా సత్తా చూపిందని, తాజాగా ప్రైడో పేరిట క్యాబ్స్ సేవల్లోకి రావటం ఆనందంగా ఉందని తెలిపారు.
అసంఘటిత రంగమైన క్యాబ్స్ పరిశ్రమలో డ్రైవర్లకు, రైడర్లకు విశ్వసనీయత కల్పించినప్పుడే నిలదొక్కుకుంటాం. డ్రైవర్లు బాగుంటేనే కస్టమర్లు బాగుంటారు. అప్పుడే కంపెనీ ముందుకెళుతుంది’’ అని పేర్కొన్నారు. కేవలం జంట నగరాలకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా విస్తరించాలని ఆయన ఆశించారు. అనంతరం ప్రైడో ఫౌండర్ అండ్ ఎండీ నరేంద్రకుమార్ కామరాజు మాట్లాడుతూ.. క్యాబ్స్ పరిశ్రమలో డ్రైవర్లను కేవలం లాభార్జన కోసం వినియోగించుకుంటున్న ఈ రోజుల్లో వారిని లాభాల్లో కూడా వారిని భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో ప్రైడోను ప్రారంభించామని చెప్పారు. ఇప్పటివరకు డ్రైవర్ల నమోదు, టెక్నాలజీ అభివృద్ధి మీద దృష్టి సారించామని, ఇక నుంచి రైడర్లను ఆకర్షించడం మీద ఫోకస్ చేస్తామని పేర్కొన్నారు. సరికొత్త ఫీచర్లు, రాయితీలు, ఆఫర్లతో ఆకర్షిస్తామన్నారు. తొలి రెండు రైడ్లకు ఒక్కో రైడ్ మీద రూ.50 రాయితీ ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, కూర్మయ్యగారి నవీన్ రావు, ప్రణీత్ గ్రూప్ డైరెక్టర్లు నర్సింగరావు, ఆంజనేయ రాజు, నర్సిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఆదిత్య కామరాజు, దినేష్ రెడ్డి, సందీప్ రావు, ప్రైడో డైరెక్టర్ శ్రీకాంత్ చింతలపాటి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment