Sakshi News home page

IPL 2024: మహిళా ఛాంపియన్లకు "గార్డ్‌ ఆఫ్‌ హానర్‌" ఇచ్చిన ఆర్సీబీ

Published Tue, Mar 19 2024 7:02 PM

IPL 2024: RCB Team Giving Guard Of Honour To Women Team At Chinnaswamy Stadium - Sakshi

ఐపీఎల్‌ 2024 సీజన్‌ ప్రారంభానికి ముందు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు హోం గ్రౌండ్‌ అయిన చిన్నస్వామి స్టేడియంలో అన్‌బాక్స్‌ పేరిట ఓ ఈవెంట్‌ జరిగింది. ఈ ఈవెంట్‌ సందర్భంగా ఆర్సీబీ టీమ్‌.. మహిళా ఐపీఎల్‌ ఛాంపియన్లను (ఆర్సీబీ) గౌరవించుకుంది. ఆర్సీబీ బృందం తమ మహిళా జట్టుకు గార్డ్‌ ఆఫ్‌ హానర్‌ ఇచ్చింది. ఆర్సీబీ పురుష జట్టు సభ్యులు ఇరు వైపులా నిలబడి తమ మహిళా బృందాన్ని చప్పట్లతో సాదరంగా మైదానంలోకి ఆహ్వానించారు.

మహిళా ఆర్సీబీ జట్టు కెప్టెన్‌ స్మృతి మంధన ముందు నడుస్తుండగా జట్టు సభ్యులు ఆమెను ఫాలో అయ్యారు. గార్డ్‌ ఆఫ్‌ హానర్‌ అందుకున్న అనంతరం ఆర్సీబీ మహిళా జట్టు ప్రేక్షకులకు అభివాదం చేస్తూ స్టేడియం చుట్టూ తిరిగింది. అన్‌బాక్స్‌ ఈవెంట్‌ సందర్భంగా మెన్స్‌ ఆర్సీబీ టీమ్‌ కీలక సభ్యులు విరాట్‌ కోహ్లి, ఫాఫ్‌ డెప్లెసిస్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ మహిళల ఆర్సీబీ జట్టు సభ్యులను అభినందించారు. ఫోటోలకు పోజులిచ్చారు.

విరాట్‌ కోహ్లి కొందరు మహిళా జట్టు సభ్యులతో కలిసి సెల్ఫీలు దిగారు. చాలాకాలం తర్వాత విరాట్‌ కోహ్లిని చూసేందుకు భారీ సంఖ్యలు అభిమానులు స్టేడియానికి తరలివచ్చారు. కోహ్లి నామస్మరణతో స్టేడియం మార్మోగిపోయింది. 

కాగా, కొద్ది రోజుల కిందట జరిగిన మహిళల ఐపీఎల్‌ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిచి ఆర్సీబీ టీమ్‌ తొలిసారి ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. 16 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో ఆర్సీబీకి ఇదే తొలి టైటిల్‌. పురుషుల జట్టు మూడుసార్లు ఫైనల్‌కు చేరినప్పటికీ ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవలేకపోయింది. మహిళల టీమ్‌ ఇచ్చిన జోష్‌తో ఆర్సీబీ మెన్స్‌ టీమ్‌ కూడా ఆసారి ఎలాగైనా టైటిల్‌ సాధిస్తామని ధీమాగా ఉంది.

ఈసారి టైటిల్‌ సాధించేందుకు ఆర్సీబీ మెన్స్‌ టీమ్‌ కఠోరంగా శ్రమిస్తుంది. ఐపీఎల్‌ 2024 సీజన్‌ మార్చి 22 నుంచి ప్రారంభంకానుంది. ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌లోనే ఆర్సీబీ..  డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సీఎస్‌కేతో తలపడనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌ జరుగనుంది. 

Advertisement

What’s your opinion

Advertisement