టీమిండియా స్టార్ విరాట్ కోహ్లితో తనకు ఎలాంటి విభేదాలు లేవని భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ స్పష్టం చేశాడు. మీడియా అత్యుత్సాహం వల్లే తమ గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చెందిందని పేర్కొన్నాడు.
అదే విధంగా ఐపీఎల్-2024లో ఆర్సీబీ ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న కోహ్లి స్ట్రైక్‌రేటు గురించి కూడా గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కాగా గతేడాది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా కోహ్లి- అప్పటి లక్నో మెంటార్ గంభీర్ మధ్య వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో వీరిద్దరి ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, తాజా సీజన్‌లో కేకేఆర్ మెంటార్‌గా అవతారమెత్తిన గంభీర్.. ఇటీవలి మ్యాచ్ సందర్భంగా కోహ్లిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు. ఇద్దరూ సరదాగా మాట్లాడుకున్నారు.
గొడవ పడితే చూడాలని
ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో ఓ షోలో విరాట్ కోహ్లి మాట్లాడుతూ.. ‘‘మేము ఇద్దరం గొడవ పడితే చూడాలని అనుకునే వాళ్లే ఎక్కువగా ఉంటారు. వాళ్లను ఈ వీడియోలు నిరాశపరిచి ఉంటాయి’’ అని చమత్కరించాడు.
ఈ విషయంపై తాజాగా స్పందించిన గౌతం గంభీర్ కోహ్లి వ్యాఖ్యలతో ఏకీభవించాడు. టీఆర్‌పీ రేటింగ్‌ల కోసమే మీడియా ఇలాంటివి ఎక్కువగా ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను, విరాట్ కోహ్లి ఎలాంటి వాళ్లమో, తమ మధ్య అనుబంధం ఎలా ఉంటుందో వారికి తెలియదన్న గౌతీ.. వీలైతే పాజిటివిటీని పెంచే అంశాలను చూపించాలన్నాడు.
ఎవరికి వారే ప్రత్యేకం
తాను, కోహ్లి పరిణతి చెందిన వ్యక్తులం కాబట్టి ఇలాంటి వాటి గురించి ఎక్కువగా పట్టించుకోమని గంభీర్ చెప్పుకొచ్చాడు. ఇక కోహ్లి స్ట్రైక్‌రేటు గురించి జరుగుతున్న చర్చలపై స్పందిస్తూ.. ‘‘ప్రతి ఒక్క ఆటగాడు భిన్నంగా ఉంటాడు.
మాక్స్‌వెల్ ఆడినట్లు కోహ్లి ఆడకపోవచ్చు. కోహ్లి తీరుగా మాక్స్‌వెల్ షాట్లు బాదలేకపోవచ్చు. పదకొండు మంది సభ్యులున్న జట్టులో ఎవరికి వారే ప్రత్యేకం. బ్యాటింగ్ ఆర్డర్‌లో 1- 8 వరకు విధ్వంసకర బ్యాటర్లు అందుబాటులో ఉంటే స్కోరు 300 కావొచ్చు లేదంటే 30 పరుగులకే ఆలౌట్ కావచ్చు.
జట్టును గెలిపించినపుడు స్ట్రైక్‌రేటు 100 ఉన్నా బాగానే అనిపిస్తుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం 180 స్ట్రైక్‌రేటు కూడా మన కంటికి కనిపించదు. మ్యాచ్ జరిగే వేదిక, పిచ్ పరిస్థితి, ప్రత్యర్థి జట్టు.. ఇలా భిన్న అంశాలపై స్ట్రైక్‌రేటు ఆధారపడి ఉంటుందన్న విషయం మర్చిపోకూడదు’’ అంటూ విరాట్ కోహ్లికి గంభీర్ మద్దుతుగా నిలిచాడు. కాగా ఈ సీజన్‌లో కోహ్లి ఆడిన 9 మ్యాచ్‌లలో కలిపి 145.76 స్ట్రైక్‌రేటుతో 430 పరుగులు సాధించి టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment