Sakshi News home page

IPL 2024 RR VS DC: పిచ్చకొట్టుడు కొట్టిన అశ్విన్‌.. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకు వచ్చి మరీ..!

Published Fri, Mar 29 2024 9:42 AM

IPL 2024 RR VS DC: Ravichandran Ashwin Gets Into Beast Mode, Smashed 3 Sixes - Sakshi

ఐపీఎల్‌ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ వెటరన్‌ ప్లేయర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ బ్యాటింగ్‌లో చెలరేగిపోయాడు. ఆర్డర్‌లో ముందుకు వచ్చి మరీ సిక్సర్ల వర్షం​ కురిపించాడు. కేవలం 19 బంతుల్లో 3 భారీ సిక్సర్ల సాయంతో 29 పరుగులు చేశాడు. 

అశ్విన్‌ ఈ మూడు సిక్సర్లు బాదింది సాదాసీదా బౌలర్ల బౌలింగ్‌లో అనుకుంటే పొరబడ్డట్టే. తొలుత స్టార్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌కు దిమ్మతిరిగిపోయేలా చేసిన అశ్విన్‌.. ఆ తర్వాత ప్రపంచ అత్యుత్తమ ఫాస్ట్‌ బౌలర్‌ అన్రిచ్‌ నోర్జేకు మతి పోగొట్టాడు. కుల్దీప్‌ బౌలింగ్‌లో ఓ సిక్సర్‌తో సరిపెట్టుకున్న అశ్విన్‌.. నోర్జే బౌలింగ్‌లో ఏకంగా రెండు భారీ సిక్సర్లు బాదాడు.

తరుచూ బంతితో మ్యాజిక్‌ చేసే అశ్విన్‌.. కొత్తగా బ్యాట్‌కు పని చెప్పడంతో అతని అభిమానులు తెగ సంబుర పడిపోతున్నారు. యాష్‌లోని ఈ కోణాన్ని చూసి ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. 

కాగా, అశ్విన్‌కు టెస్ట్‌ క్రికెట్‌లో బ్యాటర్‌గా మంచి ట్రాక్‌ రికార్డే ఉంది. సుదీర్ఘ ఫార్మాట్‌లో అతను ఏకంగా ఐదు సెంచరీలు బాదాడు. అయితే యాష్‌ శతక్కొట్టుడు టెస్ట్‌ క్రికెట్‌కు మాత్రమే పరిమితమైంది. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో అతను రాణించడం చాలా అరుదు.

ఈ నేపథ్యంలో అశ్విన్‌ శైలికి భిన్నంగా విజృంభించడంతో అభిమానులు కొత్తగా ఫీలవుతున్నారు. అశ్విన్‌ చితక్కొట్టుడుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. 

ఇదిలా ఉంటే, అశ్విన్‌తో పాటు రియాన్‌ పరాగ్‌ (45 బంతుల్లో 84 నాటౌట్‌; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగడంతో డీసీపై రాజస్థాన్‌ రాయల్స్‌ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన ఢిల్లీ 173 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. రాజస్థాన్‌ బౌలర్లు బర్గర్‌ (3-0-29-2), చహల్‌ (3-0-19-2), ఆవేశ్‌ ఖాన్‌ (4-0-29-1) రాణించారు. 
 

Advertisement

What’s your opinion

Advertisement