దేశం కోసం శ్రేయస్‌ అయ్యర్‌ త్యాగం.. బీసీసీఐ తప్పు చేసిందా? | Shreyas Iyer Priortized World Cup Over IPL: Reports - Sakshi
Sakshi News home page

#Shreyas Iyer: దేశం కోసం శ్రేయస్‌ అయ్యర్‌ త్యాగం.. బీసీసీఐ తప్పు చేసిందా?

Published Sun, Mar 3 2024 10:04 AM

Shreyas Iyer priortized World Cup over IPL: Reports - Sakshi

శ్రేయస్‌ అయ్యర్‌.. గత కొన్ని రోజులగా భారత  క్రికెట్‌ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. అందుకు కారణం అతడిని బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ నుంచి తప్పించడమే. తాజాగా 2024-25 ఏడాదికి గాను బీసీసీఐ ప్రకటించిన ఆటగాళ్ల జాబితాలో అయ్యర్‌కు చోటు దక్కలేదు. అయ్యర్‌తో పాటు మరో యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ను కూడా బీసీసీఐ కాంట్రక్ట్‌ నుంచి తప్పించింది.

దేశీవాళీ క్రికెట్‌లో ఆడేందుకు వీరిద్దరూ నిరాకరించడంతో బీసీసీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై బిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  ఇషాన్ కిషన్ విషయంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరైందేనని.. కానీ అయ్యర్ విషయంలో కాస్త ఆలోచించాల్సిందని  క్రికెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

అసలేం జరిగిందంటే?
ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు ఎంపికైన అయ్యర్‌.. దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలో ఇంగ్లీష్‌ జట్టుతో ఆఖరి మూడు టెస్టులకు సెలక్టర్లు శ్రేయస్‌ను పక్కన పెట్టారు. తొలుత అందరూ అయ్యర్‌ వెన్ను గాయం తిరగబెట్టిందని, అందుకే అతడికి విశ్రాంతి ఇచ్చారని భావించారు. కానీ ఫామ్‌ లేమి కారణంగానే సెలక్టర్లు ఎంపిక చేయలేదని తర్వాత బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

ఈ క్రమంలో రంజీ ట్రోఫీ క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆడాలని ముంబై క్రికెట్‌ ఆసోషియేషన్‌ అయ్యర్‌ను కోరింది. కానీ అయ్యర్‌ తను ఫిట్‌నెస్‌గా లేనని, అందుబాటులో ఉండనని చెప్పుకొచ్చాడు. కానీ జాతీయ క్రికెట్ అకాడమీ మాత్రం.. అయ్యర్‌ ఫిట్‌గానే ఉన్నాడని తేల్చిచెప్పడంతో వివాదం ముదిరింది. అంతకంటే ముందు సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఉన్న ఆటగాళ్లు కచ్చితంగా దేశీవాళీ టోర్నీల్లో ఆడాలని బీసీసీఐ సైతం ఆదేశాలు జారీ చేసింది.

అయితే రంజీ మ్యాచ్ ఆడమని బీసీసీఐ సూచనలను పెడచెవిన పెట్టిన అయ్యర్.. ఐపీఎల్‌లో తాను కెప్టెన్‌గా ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నిర్వహించిన ప్రీ ట్రైనింగ్‌ క్యాంప్‌లో పాల్గోన్నడట. ఈ విషయం తెలుసుకున్న బీసీసీఐ ఛీప్‌ సెలక్టర్‌ అజిత్ అగార్కర్ అయ్యర్‌పై సీరియస్‌ అయినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.

అగార్కర్‌ సూచన మేరకే బీసీసీఐ అయ్యర్‌పై వేటు వేసినట్లు సమాచారం. అయితే బీసీసీఐ చర్యలతో దిగొచ్చిన అయ్యర్‌.. తమిళనాడుతో జరుగుతున్న సెమీఫైనల్‌ మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు. అయితే అయ్యర్‌కు సంబంధించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

అయ్యర్‌ అంత త్యాగం చేశాడా?
కాగా గతేడాది ఐపీఎల్‌ సీజన్‌కు అయ్యర్‌ వెన్ను గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. అయితే వరల్డ్‌కప్‌లో దేశం తరఫున ఆడాలనే ఉద్దేశంతోనే ఐపీఎల్‌కు అయ్యర్‌ దూరమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్లు తీసుకుంటూనే టోర్నీ మొత్తం అయ్యర్‌ ఆడినట్లు ఓ ప్రముఖ క్రీడా వెబ్‌సైట్‌ రాసుకొచ్చింది. అదే విధంగా అయ్యర్‌ ఇప్పటికి వెన్ను నొప్పితో బాధపడుతున్నాడని, వరల్డ్‌కప్‌ తర్వాత విశ్రాంతి ఏకైక బ్యాటర్ శ్రేయస్ అని  ఆ వెబ్‌సైట్‌ పేర్కొంది.

శ్రేయస్‌ అయ్యర్‌ వరల్డ్‌ కప్‌ కోసం ఐపీఎల్‌ నుంచి తప్పుకున్నాడు. శస్త్రచికిత్స తర్వాత ప్రపంచకప్‌ సమయానికి సిద్దంగా ఉండేందుకు ప్రతీరోజు మూడు పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్లు తీసుకున్నాడు. సెమీ-ఫైనల్ ,ఫైనల్ సమయంలో అతడికి వెన్ను నొప్పి తిరగబెట్టింది. అతడు నొప్పిని భరిస్తూనే ఆడాడు. కనీసం వరల్డ్‌కప్‌ తర్వాత అయ్యర్‌ విశ్రాంతి కూడా తీసుకోలేదు.

అతడు స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌, దక్షిణాఫ్రికా పర్యటనకు కూడా వెళ్లాడు. దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత, ఇంగ్లండ్‌తో మొదటి రెండు టెస్టులకు ముందు జనవరిలో అయ్యర్‌ను రంజీల్లో  ఆడమని అడిగారు. కానీ అతడు వెన్ను నొప్పితో బాధపడుతుండడంతో అందుకు అంగీకరించలేదు. అయితే అతడు తన ఫిట్‌నెస్‌ పెంచుకునేందుకు  కేకేఆర్ అకాడమీలో చేరాడు.

ఎప్పటికప్పుడు ముంబై టీమ్ హెడ్ కోచ్ ఓంకార్ సాల్వి సైతం కేకేఆర్‌ ప్రాక్టీస్‌ శిబరాన్ని సందర్శించేవాడు. మొదట్లో ప్రాక్టీస్ సెషన్‌లో 60 బంతులు ఆడితేనే వెన్ను నొప్పితో బాధపడేవాడు. ఇప్పుడు ఒక సెషన్‌లో అతను 200 బంతులను ఎదుర్కొంటున్నాడు. పరిస్థితి ఇప్పుడు మెరుగుపడింది. కాబట్టి తమిళనాడుతో జరిగే రంజీ ట్రోఫీ సెమీ-ఫైనల్‌కు అందుబాటులోకి వచ్చాడని సదరు వెబ్‌సైట్‌ శ్రేయస్ పరిస్థితిని వివరిస్తూ రాసుకొచ్చింది.

Advertisement
Advertisement