ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజల సెంటిమెంట్‌తో ఆడుకుంటున్నారు. ప్రత్యేకించి రైతుల మనోబావాలతో చెలగాటమాడుతున్నారు. ఎవరికైనా భూమితో ఉండే సంబంధం చెప్పనవసరం లేదు. అందులోను రైతులకు మరింతగా ఉంటుంది. వారు భూమిని దైవంగా పరిగణిస్తారు. ఎంతో పవిత్రంగా చూసుకుంటారు. ఆ భూముల డాక్యుమంట్లను చాలా జాగ్రత్తగా భద్రపరచుకుంటారు. వాటిని తమ కుటుంబ భవిష్యత్తుకు చిహ్నాలుగా చూసుకుంటారు. అలాంటి డాక్యుమెంట్లను చంద్రబాబు నాయుడు దగ్దం చేసే సాహసం చేశారు. ఆయన చేసింది చాలా పెద్ద తప్పు. వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఆయనకు ఎంత ద్వేషమైనా ఉండవచ్చు. ఎంత అక్కసు అయినా ఉండవచ్చు.
కాని జగన్‌ను దూషించడానికి రైతుల డాక్యుమెంట్లను తగులబెట్టి దారుణమైన చర్యకు ఉపక్రమించారు. పైగా అదేదో గొప్ప పని మాదిరి ఏమి తమ్ముళ్లూ తగులబెట్టానా? అంటూ ఒకటికి రెండుసార్లు సభలో వికటాట్టహాసం చేయడం. ఈ మధ్యకాలంలో చంద్రబాబుకు ఎవరు ఇలాంటి దిక్కుమాలిన ఐడియాలు ఇస్తున్నారో కాని, ఆయన చేష్టలన్నీ రోత పుట్టిస్తున్నాయి. జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని అర్ధం చేసుకోవచ్చు. బూతులు తిట్టడం, డాక్యుమెంట్లు కాల్చడం ఏమిటి? 2014-2019 టరమ్‌లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులను పీడించి 33 వేల ఎకరాలను సమీకరించారు. కొందరు ఇష్టంతోనే ఇచ్చినా, చాలామంది అందుకు సిద్దపడలేదు. వారిపై రకరకాల కేసులు పెట్టి, చివరికి వారి పంటలను కూడా దహనం చేయించారన్న విమర్శలకు అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం గురి అయింది. దాని ప్రభావంతో ఏపీలో ఆయన ఏకంగా అధికారాన్ని కోల్పోయి, కేవలం 23 సీట్లకే పరిమితం అయ్యారు. వైఎస్సార్‌సీపీకు 151సీట్లతో స్వీప్ వచ్చింది.
అమరావతి రాజధాని గ్రామాలు ఉన్న తాడికొండ, మంగళగిరిలలో కూడా టీడీపీ ఓటమిపాలైంది. మంగళగిరిలో స్వయంగా చంద్రబాబు కుమారుడు లోకేష్ పోటీచేసినా ఫలితం దక్కలేదు. దానిని తట్టుకోలేక చంద్రబాబు నాయుడు మొదటి నుంచి ఏదో ఒక వివాదం సృష్టిస్తూ జగన్ ప్రభుత్వాన్ని సజావుగా నడవకుండా అడ్డుపడుతూ వచ్చారు. అలాగే మళ్లీ 2024 ఎన్నికల సమయంలో కూడా అనేక గొడవలు సృష్టించడానికి, అబద్దపు ప్రచారాలు చేయడానికి చంద్రబాబు బృందం పూనుకుంది. నిప్పుకు గాలి తోడైనట్లు పవన్ కల్యాణ్, రామోజీరావు, రాధాకృష్ణ వంటి మరికొందరు ఆ బాచ్‌లో చేరి అడ్డగోలు ప్రచారాలకు దిగుతున్నారు. చంద్రబాబు నాయుడు నిజానికి తానేమి చేస్తున్నాననో అర్ధం చేసుకోలేని మానసిక స్థితిలో ఉన్నట్లు అనిపిస్తుంది.
ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని నీ అమ్మమొగుడు, అమ్మమ్మ మొగుడు, నానామ్మ మొగుడు.. ఇలా పిచ్చి మాటలు మాట్లాడతారా? మైండ్ ఉన్నవాళ్లెవరైనా ఇలాంటి బూతులు మాట్లాడతారా? రెండు రోజుల క్రితమే మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఒక సమావేశంలో మాట్లాడుతూ బూతులు తిట్టే రాజకీయ నేతలను ఓడించాలని పిలుపు ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబును ఓడించాలని వెంకయ్య నాయుడు పిలుపు ఇస్తే బాగుంటుంది. ఎన్నికల సంఘం కూడా చంద్రబాబు పట్ల చాలా ఔదార్యంతో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తుంది. తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రెండు రోజుల నిషేధం పెట్టిన ఎన్నికల సంఘం చంద్రబాబుపై మాత్రం ఆ స్థాయిలో చర్య తీసుకోవడం లేదు. జగన్‌ను చంపితే ఏమి అవుతుందని చంద్రబాబు ప్రశ్నించినా, ఎన్నికల సంఘం మాత్రం చూస్తూ ఊరుకుంటోంది. అదే సమయంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు వైఎస్సార్‌సీపీ పైన, సీనియర్ అధికారులపై ఫిర్యాదు చేస్తే చాలు.. ఆఘమేగాల మీద చర్యలు చేపట్టి వారిని బదిలీ చేస్తోంది. తద్వారా చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్న లక్ష్యాన్ని ఎన్నికల సంఘం కూడా నెరవేర్చుతున్నట్లు అనిపిస్తుంది.
కేంద్ర హోం మంత్రి అమిత్-షా వచ్చిన రోజున డీజీపీని బదిలీ చేసి, ప్రధాని మోదీ ఏపీకి వచ్చిన రోజున మరికొందరు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేసి కూటమి నేతలను సంతోషపెట్టినట్లు అనిపిస్తుంది. ఎన్నికల సంఘం ఏపీలో ఎప్పటి నుంచో అమలు అవుతున్న ఆయా స్కీములకు గాను ప్రజలకు వెళ్లవలసిన డబ్బు వెళ్లకుండా అడ్డుపడుతోంది. కూటమి నేతలు చంద్రబాబు, దగ్గుబాటి పురందేశ్వరి, పవన్ కల్యాణ్ వంటివారు చేసే ఫిర్యాదుల ఆధారంగా ఈసి పనిచేస్తున్నదన్న విమర్శలు వస్తున్నాయి. ఆ క్రమంలోనే ముఖ్యమంత్రి జగన్ కూడా ఎన్నికల సంఘంపై విమర్శలు చేశారు. ఎన్నికలనైనా సజావుగా జరగనిస్తారా? అన్న సందేహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పక్కనబెడితే, రైతు భూమి డాక్యుమెంట్ను చంద్రబాబు దగ్దం చేయడానికి కారణం ఏమిటని పరిశీలిస్తే అందులోను చంద్రబాబు డబుల్ గేమ్ బయటపడుతుంది. రామోజీ జర్నలిజాన్ని ఎంతగా దిగజార్చింది అర్దం అవుతుంది.
2019 జూలైలో శాసనసభలో లాండ్ టైటిలింగ్ యాక్ట్ బిల్లును జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అది చాలా గొప్ప చట్టమని, కేంద్రం దీనిపై ఎప్పటినుంచో కసరత్తు చేస్తోందని, పలు దేశాలలో ఇప్పటికే ఈ తరహా చట్టాలు ఉన్నాయని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మెచ్చుకున్నారు. అప్పుడు చంద్రబాబు ఎక్కడా వద్దనలేదు. కాని శాసనసభ ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో దానిని కాంట్రవర్శీ చేసి రాజకీయ లబ్ది పొందడానికి యత్నిస్తున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి. తదితర ఎల్లో మీడియా అడ్డగోలు కధనాలు రాసి ప్రజలలో భయాందోళనలు సృష్టించాలని తలపెట్టాయి.
మొదట వైఎస్సార్‌సీపీ అంత సీరియస్‌గా తీసుకోలేదు. కాని ప్రజల్ని నమ్మించడానికి చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణ, పవన్ కల్యాణ్‌లు కుయుక్తులు పన్నారన్న విషయం అర్దం చేసుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు మేల్కొని అసలు విషయాలు చెప్పడం ఆరంభించారు. ఆ క్రమంలో అసెంబ్లీలో టీడీపీ ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన వీడియోని, రామోజీకి చెందిన టీవీలలో ఈ బిల్లు గొప్పదని చెప్పిన సంగతులను బయటపెట్టారు. దాంతో వారికి నోట మాటరాని పరిస్థితి ఏర్పడింది. వెంటనే ఈనాడు, ఆంద్రజ్యోతి వంటివి ప్లేట్ పిరాయించాయి. ఇంత తొందరేముంది అంటూ మరో చెత్త కధనాన్ని వండి యత్నం చేశాయి. చంద్రబాబు అయితే నిర్లజ్జగా ఆ టైటిలింగ్ యాక్ట్ పై ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసం మరింత వికృతంగా వ్యవహరించారు. అందులో భాగంగానే రైతుల సెంటిమెంట్ దెబ్బతినే విదంగా వారి భూ డాక్యుమెంట్ను దగ్దం చేశారు. ఆ పనేదో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్-షాల సభలలో వారి సమక్షంలోనే తగులబెడితే వారు ఏమి చెప్పేవారో తెలిసేది కదా? కాని ఆ పని చేయరు.
కేవలం ప్రజలను మోసం చేయడానికి, తాను ఆత్మరక్షణలో పడిన విషయాన్ని కప్పిపుచ్చడానికి డాక్యుమెంట్లను దగ్దం చేసి రైతుల మనోభావాలను దారుణంగా దెబ్బతీశారని చెప్పాలి. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా డబుల్ గేమ్ ఆడారు. ఒకటికి రెండుసార్లు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలం అంటూ కేంద్రానికి చంద్రబాబు లేఖలు రాశారు. తీరా కేంద్రం తెలంగాణ ఏర్పాటుకు రెడీకాగానే సోనియాగాంధీని దెయ్యం, బూతం అంటూ బండబూతులు తిట్టారు. ఆంధ్రుల పొట్టకొట్టిందని అన్నారే తప్ప తాను సమైక్యవాదినని, తాను ఇచ్చిన లేఖను ఉపసంహరించుకుంటున్నానని మాత్రం చెప్పలేదు. తెలంగాణలో జరిగిన సభలలో తనవల్లే రాష్ట్రం వచ్చిందని గొప్పగా చెప్పుకున్నారు. ఇలా ఎన్నిసార్లు డబుల్ గేమ్ ఆడారో లెక్కలేదు. రెండు నాలుకల దోరణిలో బహుశా దేశంలోనే చంద్రబాబుకు అగ్రస్థానం ఉండవచ్చు. వలంటీర్ల వ్యవస్థను రకరకాలుగా దూషించారు. ఆ తర్వాత తాను అదే వ్యవస్థను కొనసాగిస్తానని, ఇంకా ఎక్కువ వేతనం ఇస్తానని అంటారు.
జగన్ సంక్షేమ స్కీములు అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని అన్న చంద్రబాబు అంతకు రెట్టింపు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానని హామీ ఇస్తుంటారు. ఈ డబుల్ టాక్‌తో రాజకీయ ప్రయోజనం కోసం ఆయన ఎంతకైనా దిగజారుతారు. అలాగే ఇప్పుడు లాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన డబుల్ టాక్ చేసి అప్రతిష్టపాలయ్యారు. అమలులోకి రాని చట్టంతో ఏదో ప్రమాదం జరిగినట్లు పచ్చి అబద్దాలను ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రచారం చేయడం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ పిచ్చి ప్రసంగాలు చేయడం నిత్యకృత్యం అయింది. అందులో బాగంగా చంద్రబాబు రైతుల బూమి డాక్యుమెంట్ ను దగ్దం చేసి రైతుల సెంటిమెంట్‌ను దెబ్బతీశారు. గతంలో అమరావతిలో పంటపొలాలు దహనం చేయించిన తర్వాత ఘోర పరాజయం చెందారు. అలాగే ఈసారి రైతుల భూమి డాక్యుమెంట్ను బుగ్గిపాలు చేయడం ద్వారా కూటమి అదికారంలోకి వస్తే రాష్ట్రాన్ని కూడా అలాగే తగులబెడతామని ప్రజలకు వారికి తెలియకుండానే సంకేతం పంపించారు. కనుక భూ డాక్యుమెంట్ తగులబెట్టిన చంద్రబాబుకు మరోసారి ఓటమి తప్పదన్న భావన వ్యక్తం అవుతోంది.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment