IPL 2024: తిరుగులేని సన్‌రైజర్స్‌.. అ​న్ని జట్లు ఓడినా..! | Sakshi
Sakshi News home page

IPL 2024: అన్ని జట్లు ఓడాయి.. ఒక్క సన్‌రైజర్స్‌ మాత్రమే..!

Published Thu, Apr 25 2024 3:36 PM

𝐒unrisers Hyderabad Is The Only Team Undefeated At Their Home Ground In IPL 2024 So Far

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో సగానికి పైగా మ్యాచ్‌లు పూర్తయిన తర్వాత రాజస్థాన్‌ రాయల్స్‌ (14 పాయింట్లు), కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (10), సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (10), లక్నో సూపర్‌ జెయింట్స్‌ (10) జట్లు పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచి ప్లే ఆఫ్స్‌ రేసులో ముందున్నాయి. సీఎస్‌కే (8), గుజరాత్‌ (8), ముంబై ఇండియన్స్‌ (6), ఢిల్లీ క్యాపిటల్స్‌ (6) జట్లు ఐదు నుంచి ఎనిమిది స్థానాల్లో నిలిచి ప్లే ఆఫ్స్‌ బెర్తుల కోసం పోటీ పడుతున్నాయి. పంజాబ్‌ కింగ్స్‌ (4), రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (2) చివరి రెండు స్థానాల్లో ఉంటూ ప్లే ఆఫ్స్‌ అశలను దాదాపుగా వదులుకున్నాయి.

ప్రస్తుత సీజన్‌లో 39 మ్యాచ్‌ల అనంతరం ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్‌ మినహా మిగతా తొ​మ్మిది జట్లు తమతమ సొంత మైదానాల్లో పరాజయాలు ఎదుర్కొన్నాయి. ఒక్క సన్‌రైజర్స్‌ మాత్రమే హోం గ్రౌండ్‌లో తిరుగులేని శక్తిగా ఉంది. భారీ ఫ్యాన్‌ బేస్‌ ఉన్న చెన్నై, ఆర్సీబీ, ముంబై జట్లు సైతం సొంత మైదానాల్లో ఓటములు ఎదుర్కొంటే, కమిన్స్‌ సేన మాత్రం సొంత అభిమానుల మధ్యలో దర్జాగా తలెత్తుకు నిలబడింది.

ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ కమిన్స్‌ నేతృత్వంలో మునుపెన్నడూ లేనంత పటిష్టంగా ఉంది. పటిష్టం అంటే అట్లాంటి ఇట్లాంటి పటిష్టం కాదు. ఐపీఎల్‌ పునాదులు దద్దరిల్లేంత పటిష్టంగా కమిన్స్‌ సేన ఉంది. సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ వీరులు విధ్వంసం ధాటి​కి పొట్టి క్రికెట్‌ బ్యాటింగ్‌ రికార్డులన్నీ బద్దలవుతున్నాయి. వీరి దెబ్బకు ఆరెంజ్‌ ఆర్మీ ఈ సీజన్‌లో ఇప్పటికే మూడు సార్లు 260 ప్లస్‌ స్కోర్లు నమోదు చేసింది.

మరోవైపు బౌలింగ్‌లోనూ సన్‌రైజర్స్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కమిన్స్‌ నేతృత్వంలో సన్‌రైజర్స్‌ బౌలింగ్‌ విభాగంలో కూడా అదరగొడుతుంది. మొత్తంగా ఈ సీజన్‌లో ఆరెంజ్‌ ఆర్మీ పట్టపగ్లాల్లేకుండా టైటిల్‌ దిశగా దూసుకెళ్తుంది. రేపు  (ఏప్రిల్‌ 25) జరుగబోయే మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ సొంత మైదానంలో ఆర్సీబీతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనూ పరుగుల వరద పారి ఆల్‌టైమ్‌ రికార్డు బద్దలు కావడం ఖాయమని సన్‌రైజర్స్‌ అభిమానులు నమ్మకంగా ఉన్నారు.

ఇదే సీజన్‌లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఏం జరిగిందో అందరం చూశాం. ఆర్సీబీ హోం గ్రౌండ్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ బ్యాటర్లు పరుగుల ప్రళయం సృష్టించారు. హెడ్‌ (102), అభిషేక్‌ శర్మ (34), క్లాసెన్‌ (67), మార్క్రమ్‌ (32 నాటౌట్‌), అబ్దుల్‌ సమద్‌ (37 నాటౌట్‌) సునామీ ఇ‍న్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో సన్‌రైజర్స్‌ ఐపీఎల్‌ చరిత్రలో అత్యం​త భారీ స్కోర్‌ (287) నమోదు చేసింది. ప్రత్యర్ది హోం గ్రౌండ్‌లోనే సన్‌రైజర్స్‌ బ్యాటర్లు ఈ తరహాలో రెచ్చిపోతే.. రేపు సొంత మైదానంలో వీరిని కంట్రోల్‌ చేయడం ఎవరి వల్ల కాదు.

Advertisement
Advertisement