ఎండగంట పడకుండా.. | Sakshi
Sakshi News home page

ఎండగంట పడకుండా..

Published Mon, May 6 2024 10:55 AM

-

పోలింగ్‌ సమయం గంట పొడిగింపు

రాయవరం: ఎన్నికల ప్రచారంలో తలమునకలవు తున్న అభ్యర్థులపై సూరీడు కొద్ది రోజులుగా కన్నెర్ర చేస్తున్నాడు. మార్తాండుడి ప్రతాపానికి తాళలేక చాలా మంది అభ్యర్థులు ఉదయం, సాయంత్రం వేళల్లోనే ప్రచారం నిర్వహిస్తున్నారు. మరికొన్ని రోజుల పాటు ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇది పోలింగ్‌పై ప్రభావం చూపుతుందన్న రాజకీయ పార్టీల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఊరటనిచ్చే మాట చెప్పింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం పోలింగ్‌ ఈ నెల 13వ తేదీ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జరగాల్సి ఉంది. తాజాగా దీనిని సాయంత్రం 6 గంటల వరకూ పొడిగించారు. సాయంత్రం 5 తర్వాత వేడి కొంత తగ్గుతుంది. దీంతో కొంత వెసులుబాటు ఏర్పడి ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది.

సౌకర్యాల కల్పనకు చర్యలు

మండు వేసవిలో ఎన్నికలు జరుగుతుండడంతో పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లకు సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద షామియానాలు, తాగునీరు, కుర్చీలు తదితరాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. పోలింగ్‌కు ముందు రోజు వచ్చే సిబ్బంది సేద తీరేందుకు కూలర్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వృద్ధులు కేంద్రాలకు వచ్చి ఓటు వేసేందుకు రవాణా సౌకర్యం సైతం కల్పించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇందుకు కొంత బడ్జెట్‌ను గ్రామ పంచాయతీ కార్యదర్శులకు కేటాయించే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement