బిల్డర్ కుప్పల మధు హత్య కేసుపై ముమ్మర దర్యాప్తు
రంగంలోకి బీదర్ పోలీసులు
మధు మరో ముగ్గురితో కలిసి బీదర్ వెళ్లినట్లు గుర్తింపు
రూ. 5 లక్షల నగదు, రూ. 20 లక్షల విలువైన ఆభరణాలు మాయం
కుత్బుల్లాపూర్: కాపు సంఘం నేత, బిల్డర్ కుప్పల మధు హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ మేరకు బీదర్ జిల్లాకు చెందిన మానే కేలి పోలీసులు నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. మధు ఈ నెల 24న ఉదయం తన కారులో డ్రైవర్ రేణుక అనే వ్యక్తి తో కలిసి బీదర్ వెళ్లాడు. చింతల్ ప్రాంతంలో మరో ఇద్దరు కారులో ఎక్కినట్లు తెలిసింది. నలుగురు కలిసి బీదర్ ప్రాంతంలో ఓ క్లబ్బులో గడిపారు. అదే రోజు రాత్రి మధు భార్య లక్ష్మి అతడికి ఫోన్ చేయగా అప్పటికే బయలుదేరినట్లు చెప్పాడు. మరో గంట తర్వాత ఫోన్ చేయగా అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చార్జింగ్ అయిపోయి ఉంటుందని భావించారు.
అయితే శనివారం ఉదయం బీదర్ జిల్లా పరిసర ప్రాంతాల్లో ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి బండరాళ్లు వేసి దారుణంగా హత్య చేసినట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలంలో ఉన్న కారు నెంబరు ఆధారంగా కర్ణాటక పోలీసులు జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందించారు. శనివారం ఉదయం జీడిమెట్ల పోలీసులు కుత్బుల్లాపూర్ కల్పన సొసైటీలో ఉన్న మధు ఇంటికి వెళ్లి ఆయన భార్య లక్ష్మీకి మధుకు కారు యాక్సిడెంట్ అయిందని చెప్పి ఘటనా స్థలానికి తీసుకువెళ్లారు.
అక్కడికి వెళ్లి చూడగా మధు హత్యకు గురైనట్లు తెలిసి వారు షాక్ అయ్యారు . అతడి శరీరంపై 30కి పైగా కత్తిపోట్లు ఉన్నాయి. తలపై బండరాయి మోది హత్య చేసినట్లు గుర్తించారు. ఇంటి నుంచి వెళ్లే సమయంలో రూ . 5 లక్షల నగదు, ఒంటిపై రూ. 20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు తీసుకెళ్లినట్లు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం ఆదివారం మృతదేహాన్ని తీసుకువచ్చి పద్మా నగర్ స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
పథకం ప్రకారమే హత్య చేశారా..!
రియల్ వ్యాపారిగా, కాపు సంఘం నేతగా కుత్బుల్లాపూర్ ప్రాంతంలో సుపరిచయస్తుడిగా ఉన్న మధు కొద్ది కాలంలోనే రూ. కోట్లకు పడగలెత్తాడు. దీంతో ఎక్కడికి వెళ్లినా మంది మార్బలం.. ఒంటినిండా నగలతో కనిపించాడు.. ఇటీవల అతడి పెద్ద కుమార్తెకు వివాహ నిశ్చితార్థం కూడా జరిగింది.
ఆగస్టులో పెళ్లి ఉండగా ఇంతలోనే హత్యకు గురి కావడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. హత్య పథకం ప్రకారమే చేశారా..! ఎవరైనా పాత ఆరి్థక లావాదేవీలతో సుపారి ఇచ్చి హత్య చేయించారా..? డబ్బు, ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాల కోసమే డ్రైవర్ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడా..! వెంట వెళ్లిన వారి సెల్‌ఫోన్లు ఎందుకు స్విచ్ఛాఫ్ చేశారు ప్రశ్నలు అనుమానాలకు తావిస్తున్నాయి. కర్ణాటక పోలీసులు హత్య కేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిసింది. స్థానికంగా అందరితో ఆప్యాయంగా మాట్లాడే మధు అత్యంత దారుణంగా హత్యకు గురి కావడం చర్చనీయాంశంగా మారింది. అతడి వద్ద ఎన్నో ఏళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తున్న రేణుక దొరికితే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment