SRH: మా జట్టు సూపర్‌.. దూకుడుగా ముందుకొస్తాం: కమిన్స్‌ | Wanna See Really Aggressive Start, Says SRH Pat Cummins Ahead Of IPL 2024 - Sakshi
Sakshi News home page

IPL 2024: మాకు మంచి జట్టు ఉంది.. దూకుడుగా ముందుకొస్తాం: కమిన్స్‌

Published Thu, Mar 21 2024 4:20 PM

Wanna See Really Aggressive Start: SRH Pat Cummins Ahead Of IPL 2024 - Sakshi

ఐపీఎల్‌-2024లో దూకుడైన ఆటతో ముందుకు వస్తామంటున్నాడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కొత్త కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌. తాజా ఎడిషన్‌ను గెలుపుతో మొదలుపెట్టి శుభారంభంతో ఆరెంజ్‌ ఆర్మీని ఖుషీ చేస్తామని పేర్కొన్నాడు.

గత మూడేళ్లుగా పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటున్న ఎస్‌ఆర్‌హెచ్‌ ఈసారి పలు మార్పులతో బరిలోకి దిగనుంది. వెస్టిండీస్‌ లెజెండ్‌ బ్రియన్‌ లారా స్థానంలో న్యూజిలాండ్‌ దిగ్గజ స్పిన్నర్‌ డానియెల్‌ వెటోరిని హెడ్‌కోచ్‌గా నియమించింది. అదే విధంగా సౌతాఫ్రికా స్టార్‌ ఐడెన్‌ మార్క్రమ్‌ స్థానంలో డబ్ల్యూటీసీ 2021-23, వన్డే వరల్డ్‌కప్‌-2023 విజేత, ఆసీస్‌ సారథి కమిన్స్‌కు పగ్గాలు అప్పగించింది.

మినీ వేలంలో ఏకంగా రూ. 20. 50 కోట్లు ఖర్చు చేసి మరీ ఈ పేస్‌ బౌలర్‌ను కొనుగోలు చేసింది. ఇక మార్చి 22న ఐపీఎల్‌ పదిహేడో ఎడిషన్‌ ఆరంభం కానుండగా.. మార్చి 23న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో సన్‌రైజర్స్‌ తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది.

ఈ నేపథ్యంలో కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ మాట్లాడుతూ.. ‘‘శుభారంభం కోసం ఎదురు చూస్తున్నాం. ఏదేమైనా టీ20 ఫార్మాట్‌ ఆడటం కాస్త కష్టంగానే ఉంటుంది. కేకేఆర్‌కు మంచి జట్టు ఉంది. 

అయితే, మేము కూడా తక్కువేమీ కాదు. దూకుడైన ఆటతో తాజా సీజన్‌ను ఆరంభించాలని చూస్తున్నాం. మా జట్టు అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్ల సమ్మేళనం. భువీ ఉన్నాడు. గతేడాది మార్క్రమ్‌ కెప్టెన్‌గానూ వ్యవహరించాడు.

వీరితో పాటు అభిషేక్‌, ఉమ్రాన్‌ మాలిక్‌ వంటి యంగ్‌ టాలెంట్‌కు కూడా కొదువలేదు. కొత్త సభ్యులతో కలిసి ఐపీఎల్‌ ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని పేర్కొన్నాడు. కొత్త సీజన్‌ కోసం అభిమానులు సిద్ధంగా ఉండాలంటూ ఆరెంజ్‌ ఆర్మీకి కమిన్స్‌ పిలుపునిచ్చాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement