
ఐరోపా పర్యటనకు వెళ్లాలనుకునే వారికి ప్రయాణ ఖర్చుపై మరింత భారం పడనుంది. నేటి నుంచి (జూన్11)షెంజెన్ వీసా దరఖాస్తు ఫీజు 12 శాతం పెరిగింది.
గతనెలలో వీసా ధరఖాస్తు ఫీజును పెంచుతూ యూరోపియన్ కమిషన్ ఆమోదించడంతో వీసా ధరఖాస్తు ఫీజు పెరగడం అనివార్యమైంది. ఈ పెంపు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల పౌరులకు వర్తిస్తుందని స్లొవేనియా విదేశీ, ఐరోపా వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇప్పటివరకు పెద్దలకు షెంజెన్ వీసా దరఖాస్తు ధర 80 యూరోలు ఉండగా.. ఇప్పుడు దాన్ని 90 యూరోల (భారత కరెన్సీలో దాదాపు రూ.8వేలకు పైనే)కు పెంచారు. ఇక, 6-12 ఏళ్ల పిల్లల దరఖాస్తు ఫీజును 40 యూరోల నుంచి 45 యూరోలకు పెరిగింది. ద్రవ్యోల్బణం, సివిల్ సర్వెంట్ల వేతనాలకు పెరిగిన ఖర్చులు తదితర కారణాలతో ఈ వీసా ఫీజును పెంచినట్లు యూరోపియన్ కమిషన్ తెలిపింది. చివరిసారిగా 2020 ఫిబ్రవరిలో ఈ వీసా ధరలను పెంచారు.