మాజీ ఎమ్మెల్యే ఇంట్లో డీవీఏసీ సోదాలు | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే ఇంట్లో డీవీఏసీ సోదాలు

Published Thu, Sep 14 2023 7:04 AM

మాజీ ఎమ్మెల్యే సత్య, నివాసం  - Sakshi

సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే నేత, టీనగర్‌ మాజీ ఎమ్మెల్యే సత్యను డీవీఏసీ బుధవారం టార్గెట్‌ చేసింది. చైన్నె, కోయంబత్తూరు తదితర 16కు పైగా ఆయనకు సంబంధించిన ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. ఈ తనిఖీలకు వ్యతిరేకంగా పలు చోట్ల అన్నాడీఎంకే వర్గాలు ఆందోళనకు దిగడంతో పోలీసులు అడ్డుకున్నారు. వివారాలు.. డీఎంకే అధికారంలోకి వచ్చినానంతరం అన్నాడీఎంకే మాజీ మంత్రులను, పలువురు మాజీ ఎమ్మెల్యేలను టార్గెట్‌ చేసిన విషయం తెలిసిందే.

తమకు గతంలో అందిన సమాచారం, ఆధారాలు, ఫిర్యాదుల మేరకు డైరెక్టరేట్‌ ఆఫ్‌ విజిలెన్స్‌ అండ్‌ యాంటీ కరెప్షన్‌ (డీవీఏసీ – అవినీతి నిరోధక శాఖ) వర్గాలు దూకుడుగా ముందుకెళ్తున్నాయి. మాజీ మంత్రులు ఎస్పీ వేలుమణి, తంగమణి, వీరమణి, విజయ భాస్కర్‌, ఎంఆర్‌ విజయ భాస్కర్‌ , కేపీ అన్భళగన్‌ల తదితరులతో పాటు మాజీ సీఎం పళని స్వామి సన్నిహితులు, కాంట్రాక్టర్లు తదితరుల ఇళ్లు, వారికి సంబంధించిన సంస్థలు, కార్యాలయాలు, సన్నిహితులను గురిపెట్టి ఇప్పటికే సోదాలు ముగిశాయి. ఈ కేసులన్నీ ప్రస్తుతం విచారణలో ఉన్నాయి. అదే సమయంలో తాజాగా టీ నగర్‌ సత్యను ఏసీబీ టార్గెట్‌ చేసింది.

కోర్టు ఆదేశాలతో దూకుడు..

అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆస్తుల వివరాలను సత్య దాచి పెట్టి తప్పుడు సమాచారం నామినేషన్‌లో పేర్కొన్నట్లు ఇప్పటికే ఫిర్యాదులు హోరెత్తాయి. అలాగే ఆదాయానికి మించి ఆయన ఆస్తులు గడించినట్లు వచ్చిన ఫిర్యాదులను డీవీఏసీ విచారించింది. అదే సమయంలో హైకోర్టులో న్యాయమూర్తి ఆనంద వెంకటేషన్‌ బెంచ్‌ సైతం ఈ ఫిర్యాదులపై దృష్టి పెట్టింది. రెండు నెలల్లో కేసును ముగించాలని, విచారణ వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇదే అదనుగా అస్సలే అన్నాడీఎంకే వర్గాల మీద తీవ్ర ఆక్రోశంతో ఉన్న పాలకులు తాజాగా కోర్టు ఆదేశాలతో సత్యను టార్గెట్‌ చేసి దూకుడు పెంచారు.

భారీగా అక్రమాస్తులు..
తమ విచారణలో వెలుగు చూసిన అంశాల మేరకు మాజీ ఎమ్మెల్యే సత్య అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు ఏసీబీ గుర్తించింది. 2016–21లో ఆయన ఆదాయానికి మించి రూ. 2.64 కోట్లు ఆస్తులు గడించినట్టు గుర్తించిన డీవీఏసీ కేసు నమోదు చేసింది. సత్యతో కలిసి పలు వ్యాపారాలు చేస్తున్నట్టుగా పేర్కొంటున్న, అన్నాడీఎంకే ఉత్తర చైన్నె తూర్పు జిల్లా కార్యదర్శి రాజేష్‌ను కూడా టార్గెట్‌ చేశారు.

తండయార్‌ పేటలోని రాజేష్‌ నివాసంలో ఐదుగురు అధికారులతో కూడిన బృందం సోదాలు చేపట్టింది. వడపళణిలోని సత్య నివాసంతో పాటు చైన్నె, కోయంబత్తూరు, తిరువళ్లూరు తదితర 16 ప్రాంతాలలో పలు బృందాలుగా ఏసీబీ అధికారులు సోదాల్లో నిమగ్నమయ్యారు. గుమ్మిడి పూండి సమీపంలోని ఆరపాక్కంలోని సత్య మిత్రుడు దిలీప్‌కుమార్‌కు చెందిన కల్యాణ మండపం, రియల్‌ ఎస్టేట్‌ సంస్థలలోనూ సోదాలు చేపట్టారు. ఈ సోదాల సమాచారంతో సత్య మద్దతు అన్నాడీఎంకే వర్గాలు రంగంలోకి దిగాయి.

అధికారపక్షం కక్ష సాధింపు చర్యలలో భాగంగా ఏసీబీని ఉసిగొల్పి దాడులు చేయిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి. ఆందోళన కారులను అడ్డుకున్నారు. ఆయా ప్రాంతాలలో తిష్ట వేసిన అన్నాడీఎంకే వర్గాలు ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం భోజనంను సత్య మద్దతుదారులు సరఫరా చేయడం గమనార్హం. గట్టి భద్రత నడుమ అనేక చోట్ల పొద్దుపోయే వరకు సోదాలు జరిగాయి. ఇందులో పలు రికార్డులు, ఆస్తులకు సంబంధించిన దస్తావేజులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

జిల్లా కార్యదర్శి రాజేష్‌, ఆయన నివాసం వద్ద మద్దతుదారుల ఆందోళన
1/1

జిల్లా కార్యదర్శి రాజేష్‌, ఆయన నివాసం వద్ద మద్దతుదారుల ఆందోళన

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement