పంటలకు రుణ పరిమితి...'వరి, పత్తికి ఎకరాకు రూ. 45 వేలు' | Sakshi
Sakshi News home page

పంటలకు రుణ పరిమితి...'వరి, పత్తికి ఎకరాకు రూ. 45 వేలు'

Published Wed, Mar 22 2023 3:24 AM

Telangana Cooperative Apex Bank On Credit limit for crops - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, మిర్చి తదితర పంటలకు స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ (రుణ పరిమితి) పెరిగింది. కొన్ని కొత్త రకాల పంటలకు కూడా స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ను ఖరారు చేశారు. రానున్న వ్యవసాయ సీజన్‌కు సంబంధించిన రుణ పరిమితిని తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంక్‌ (టెస్కాబ్‌) ఖరారు చేసింది.

రాష్ట్రంలో పండించే దాదాపు 123 రకాల పంటలకు 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఎంతెంత రుణాలు ఇవ్వాలన్న దానిపై టెస్కాబ్‌ భారీ కసరత్తు చేసింది. సాగు ఖర్చు, ఉత్పాదకత, నీటి వసతి ఆధారంగా రుణ నిర్ధారణ చేసింది. సంబంధిత రుణ పరిమితి నివేదికను రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ)కి పంపించింది. తాము ఖరారు చేసినట్లుగా రైతులకు పంట రుణాలు ఇవ్వాలని సూచించింది.

రాష్ట్రంలో అత్యధికంగా సాగు చేసే పత్తి, వరి పంటలకు ఎకరానికి రూ.45 వేలు ఖరారు చేసింది. సాగునీటి ప్రాజెక్టులు ఉన్నచోట వరికి 2022–23లో రూ.36 వేల నుంచి రూ.40 వేల పంట రుణాలను ఇవ్వగా ఈసారి రూ. 42 వేల నుంచి రూ. 45 వేలకు పెంచింది. అలాగే శ్రీ పద్ధతిలో సాగు చేసే వరికి రూ. 36 వేల నుంచి రూ. 38 వేలుగా ఖరారు చేసింది.

ఇక వరి విత్తనోత్పత్తికి కూడా రూ.5 వేలు అదనంగా పెంచింది. 2022–23లో రూ. 45 వేలుండగా, ఇప్పుడు రూ. 50 వేలుగా ఖరారు చేసింది. ఇక పత్తికి గతేడాది రుణ పరిమితి రూ. 38 వేల నుంచి రూ. 40 వేలు ఉండగా, ఇప్పుడు దాన్ని రూ. 42 వేల నుంచి రూ. 45 వేల వరకు పెంచింది.  

ఆయిల్‌పాంకు ఎకరానికి రూ. 42 వేల రుణం... 
ఆయిల్‌పాం సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. గతేడాది మాదిరిగానే ఆయిల్‌పాం పంటలు సాగు చేసే రైతులకు రుణ పరిమితి ఖరారు చేసింది. ఎకరానికి రూ. 40 వేల నుంచి రూ. 42 వేల వరకు రుణ పరిమితి ఉండగా, ఈసారి కూడా అంతే ఖరారు చేసింది. ఇక కీలకమైన మిర్చికి రూ. 75 వేల నుంచి రూ. 80 వేల వరకు పెంచింది.

సాగునీటి వసతి ఉన్నచోట మినుము పంటకు ఎకరాకు రూ. 18–21 వేలు, సాగునీటి వసతి లేని చోట రూ. 15–17 వేలు ఖరారు చేశారు. సేంద్రీయ పద్ధతిలో పండించే మినుముకు రూ. 18–21 వేలు ఖరారు చేశారు. శనగకు రూ. 24 నుంచి రూ. 26 వేలు చేశారు. సాగునీటి వసతి కలిగిన ఏరియాలో మొక్కజొన్నకు రూ. 30–34 వేలుగా, నీటి వసతి లేనిచోట రూ. 26–28 వేలు ఖరారైంది.

కందికి సాగునీటి వసతి ప్రాంతాల్లో రూ. 21–24 వేలు, సాగునీటి వసతి లేని ప్రాంతాల్లో రూ. 18–21 వేలు ఖరారు చేశారు. సోయాబీన్‌కు రూ. 26 వేల నుంచి రూ. 28 వేలు ఇస్తారు. సోయా విత్తనోత్పత్తి రైతులకు రూ. 34 వేల నుంచి రూ. 36 వేల వరకు ఇస్తారు.  

ఉల్లి సాగుకు రూ.45 వేలు 
ఉల్లిగడ్డ సాగుకు గతంలో ఎకరానికి రూ.37 వేల నుంచి రూ.42 వేలు ఇవ్వగా, ఇప్పుడు రూ. 40 వేల నుంచి రూ. 45 వేలకు పెంచారు. పట్టుకు రూ. 35 వేల నుంచి రూ. 40 వేలుగా ఖరారు చేశారు. ఇక పత్తి విత్తనాన్ని సాగు చేసే రైతులకు గణనీయంగా పెంచారు.

గతంలో రూ. 1.10 లక్షల నుంచి రూ.1.40 లక్షల వరకు ఉండగా, ఇప్పుడు రూ. 1.30 లక్షల నుంచి రూ. లక్షన్నరకు ఖరారు చేశారు. పసుపు సాగుకు రూ. 80 వేల నుంచి రూ. 85 వేల వరకు ఇస్తారు. టస్సర్‌ కల్చర్‌ (ఒకరకమైన పట్టు) సాగుకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు ఇస్తారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement