విరాట్ కోహ్లి (PC: ICC Instagram)
టీ20 ప్రపంచకప్-2024లో సత్తా చాటేందుకు సిద్ధమైపోయాడు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి. మొదటి బ్యాచ్‌తో కాకుండా కాస్త ఆలస్యంగా అమెరికా చేరుకున్న ఈ రన్‌మెషీన్.. ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉన్నాడు.
ఈ నేపథ్యంలో తను గెలుచుకున్న ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును తాజాగా అందుకున్నాడు కోహ్లి. అదే విధంగా.. ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023 క్యాప్‌ను కూడా స్వీకరించాడు.
ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా 2023లో విరాట్ కోహ్లి అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. 35 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ గతేడాది 27 వన్డేలు ఆడి 1377 పరుగులు సాధించాడు.
ఇందులో ఆరు సెంచరీలు, ఎనిమిది అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక గతేడాది కోహ్లి అత్యుత్తమ స్కోరు 166*. అదే విధంగా ఆసియా కప్-2023లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై సూపర్ స్టేజ్‌లో సాధించిన 122(నాటౌట్) కూడా హైలైట్‌గా నిలిచిపోయింది.
ఇక వన్డే వరల్డ్‌కప్-2023లోనూ ఈ రికార్డుల రారాజు దుమ్ములేపిన విషయం తెలిసిందే. సొంతగడ్డపై జరిగిన ఈ ఐసీసీ ఈవెంట్లో 11 మ్యాచ్‌లలో కలిపి 765 పరుగులు సాధించాడు కోహ్లి. టాప్ స్కోరర్‌గా నిలవడమే గాకుండా.. వరల్డ్‌కప్ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు.
ఈ క్రమంలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు. అంతేగాక వన్డేల్లో 50వ సెంచరీ కూడా పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లి.. ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాటర్‌గా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. అదే విధంగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా కూడా నిలిచాడు.
ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024 సన్నాహకాల్లో భాగంగా జూన్ 1న బంగ్లాదేశ్‌తో జరిగిన టీమిండియా వార్మప్ మ్యాచ్‌కు కోహ్లి(విశ్రాంతి) దూరంగా ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన బంగ్లాను 60 పరుగులతో చిత్తు చేసింది. ఇక జూన్ 5న ఐర్లాండ్‌తో టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment