పొలిటికల్‌ వార్‌! | Sakshi
Sakshi News home page

పొలిటికల్‌ వార్‌!

Published Tue, Jan 23 2024 6:36 AM

- - Sakshi

వికారాబాద్‌: చేవెళ్ల బీఆర్‌ఎస్‌ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, బీజేపీ మాజీ ఎంపీ కొండా విశ్వశ్వర్‌రెడ్డి మధ్య నెలకొన్న వివాదం చినికిచినికి గాలివానలా మారుతోంది. ఇన్నాళ్ల పాటు నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ వ్యవహారం ఇటీవల పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకునే వరకూ వెళ్లింది. ఇది కాస్తా కార్యకర్తల మధ్య చిచ్చు రాజేస్తోంది. సోషల్‌ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. త్వరలో పార్లమెంట్‌ ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో ఈ నేతల మధ్య వివాదం మరింత ముదిరేలా ఉందనే చర్చ సాగుతోంది.

అసలేం జరిగిందంటే.. ఎంపీ వర్సెస్‌ మాజీ ఎంపీ
ఎంపీ రంజిత్‌రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఇద్దరూ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున ఎంపీలుగా గెలిచిన వారే. 2014 ఎన్నికల్లో కొండా టీఆర్‌ఎస్‌ నుంచి గెలుపొంది ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి కాంగ్రెస్‌ తరఫున కొండా, టీఆర్‌ఎస్‌ నుంచి రంజిత్‌రెడ్డి పోటీ చేయగా రంజిత్‌రెడ్డి గెలుపొందారు. అనంతరం విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. నాటి నుంచి వీరి మధ్య కోల్డ్‌ వార్‌ నడుస్తోంది. త్వరలో జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో ఈ ఇద్దరు నేతలూ పోటీ పడే అవకాశం ఎక్కువగా ఉంది.

దీంతో ఎవరి గ్రూపులను వారు బలోపేతం చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. ప్రత్యర్థి పార్టీ నాయకులపైనా గురిపెట్టారు. ఇందులో భాగంగానే ఇటీవల కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. రంజిత్‌రెడ్డి అనుచరులైన కొందరు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలతో మాట్లాడినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ రంజిత్‌రెడ్డి నేరుగా విశ్వేశ్వర్‌రెడ్డికే ఫోన్‌ చేసి ‘నా అనుచరులతో నువ్వెలా మాట్లాడతావు’ అని నిలదీసినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రంజిత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విశ్వేశ్వర్‌రెడ్డి బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement