ఒక్క హామీ నెరవేర్చలేదు..! | Sakshi
Sakshi News home page

ఒక్క హామీ నెరవేర్చలేదు..!

Published Wed, May 1 2024 11:18 AM

chandrababu fails promises

చంద్రబాబును వెక్కిరిస్తున్న శిలాఫలకాలు

మళ్లీ అబద్ధపు హామీలతో వస్తున్న టీడీపీ అధినేత

‘నిన్ను నమ్మం బాబు’ అంటున్న జనం 

కదిరి: టీడీపీ అధినేత చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు కదిరి ప్రాంతానికి చేసిన ద్రోహం అంతా ఇంతా కాదు. ఈ ప్రాంతానికి ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చిన పాపాన పోలేదు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కదిరి ప్రజలకు ఎన్నో హామీలిచ్చారు. కొన్నింటికి శిలాఫలకాలు కూడా వేశారు. కానీ అమలుకు నోచుకోలేదు. ఆ శిలాఫలాకలు ఇప్పటికీ చంద్రన్నను వెక్కిరిస్తూనే ఉన్నాయి. చంద్రబాబు కదిరికి చేసిన మోసాలు, ద్రోహాలు కదిరి ప్రజలు గుర్తు చేస్తున్న వాటిలో మచ్చుకు కొన్ని..

 👉  2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో కదిరికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన  పట్టణంలోని వేమారెడ్డి కూడలిలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ..‘కదిరి నియోజకవర్గ ప్రజలు టీడీపీ అభ్యరి్థని ఓడించారు. అయినా సరే కదిరి పట్టణ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కదిరికి రింగ్‌రోడ్‌ మంజూరు చేస్తున్నా’ అని చెప్పారు. కానీ అమలు చేయలేదు.

👉కానీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం 2019లో అధికారంలోకి రాగానే రింగ్‌రోడ్‌ తరహాలో కదిరికి రూ.234 కోట్లతో బైపాస్‌రోడ్డు మంజూరు చేసింది. ఈ పనులు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. ఎన్నికల తర్వాత ఆ మిగిలిన పనులు పూర్తి చేసి దాన్ని ప్రారంభోత్సవం చేయనున్నారు.

👉తలుపుల మండల పరిధిలోని దాంపల్లి వద్ద చేపట్టిన హంద్రీనీవా మెయిన్‌ కెనాల్‌ సొరంగ మార్గం పనులు నా చేత కాదంటూ చంద్రబాబు చేతులెత్తేశారు. కానీ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పనులను తిరిగి ప్రారంభించి దిగి్వజయంగా పూర్తి చేసింది. ఇప్పుడు ఆ కాలువ ద్వారా నీరు పరవళ్లు తొక్కుతున్నాయి.

👉 రాయలసీమను కరువు రక్కసి నుంచి కాపాడి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్న ముఖ్య ఉద్దేశ్యంతో ఆనాడు వైఎస్సార్‌ హంద్రీనీవా ప్రాజెక్టును తెచ్చారు. ఇందులో భాగంగా కదిరి మండలంలోని చెర్లోపల్లి వద్ద రిజర్వాయర్‌ను ఏర్పాటు చేయించారు. వైఎస్‌ హయాంలోనే ఈ రిజర్వాయర్‌ పనులు 80 శాతం పూర్తయ్యాయి. ఆ మిగిలిన 20 శాతం పనులు పూర్తి చేయడానికి మరో పదేళ్లు పట్టింది. అయితే చంద్రబాబు తన స్వార్థం కోసం 2019 ఎన్నికలకు మునుపు సీఎం హోదాలోనే చెర్లోపల్లి రిజర్వాయర్‌ గేట్లు ఎత్తి కదిరి ప్రాంత రైతులకు అన్యాయం చేసి కృష్ణాజలాలను తన సొంత నియోజకవర్గం కుప్పానికి తరలించుకెళ్లారు.

కదిరి ప్రాంత గిరిజనుల కోసం ‘బంజారా కమ్యూనిటీ భవనం’ నిర్మిస్తున్నామని 2014 జూలై 24న చంద్రబాబు సీఎం హోదాలో శిలాఫలకం వేశారు. కానీ ఆ హామీ కార్యరూపం దాల్చలేదు.  అయితే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బంజారాల కమ్యూనిటీ భవనం నిర్మాణం కోసం అధికారికంగా అర ఎకరం స్థలం కేటాయించి నిర్మాణం కోసం నిధులు కూడా మంజూరు చేసింది.

కదిరి ప్రాంత పాత్రికేయుల కోసం రూ.5లక్షలతో ప్రెస్‌క్లబ్‌ భవనాన్ని నిర్మిస్తామని చంద్రబాబు గతంలో హామీ ఇచ్చారు. 2014 జూలై 25వ తేదీన శిలాఫలకాన్ని కూడా వేశారు. చివరకు ఆ హామీని కూడా నెరవేర్చలేక పోయారు. అప్పట్లో చంద్రబాబు వేసిన శిలాఫలకాలు ఇప్పటికీ బాబును వెక్కిరిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ ఓట్ల కోసం బాబు హామీలు గుప్పిస్తుంటే జనం ‘నిన్ను నమ్మం బాబు’ అని అంటున్నారు. 

Advertisement
Advertisement