నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హత్యకు వ్యూహం
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్‌బాబు ఇల్లు కేంద్రంగా కుట్ర
గోపిరెడ్డి దొరక్కపోవడంతో ఆయన మామపై హత్యాయత్నం
అనంతరం అరవింద్‌బాబు హౌస్ అరెస్ట్
పోలీసుల తనిఖీలో మారణాయుధాలు, పెట్రోల్ బాంబులు లభ్యం.. పోలింగ్‌కు ముందే పథకం ప్రకారం సమకూర్చుకున్న వైనం
మారణాయుధాలకు సంబంధించి కేసు నమోదు చేయని పోలీసులు.. పల్నాడులో హత్యా రాజకీయాలనే నమ్ముకున్న టీడీపీ
సాక్షి, నరసరావుపేట, నరసరావుపేట టౌన్ :నరసరావుపేటలో రాజకీయాలను ‘పచ్చ’ దండు వ్యక్తిగత కక్షగా మార్చి, ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఓటమి భయంతో టీడీపీ అరాచకం సృష్టిస్తోంది. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు.. చివరకు ఓటు వేసిన వారి ఇళ్లపై విధ్వంసానికి పూనుకుంది. పల్నాడు ప్రాంతంలో ఎన్నికలప్పుడు ప్రధాన పార్టీల మధ్య గొడవలు ఎన్నో ఏళ్లుగా రగులుతూనే ఉంటాయి. ఎన్నికల అనంతరం ఆ పగలు చల్లారి, అన్నదమ్ముల్లా కలసిమెలసి ఉంటారు. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకత్వం సరికొత్త ప్రతీకారానికి తెర తీసింది.
గత ఎన్నికల్లో ఓటమి మూటగట్టుకుని మరోసారి పోటీకి దిగిన నరసరావుపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబుకు మళ్లీ ఓటమి ఖాయమని పోలింగ్‌కు ముందే అన్ని సర్వేలు తేల్చాయి. దీంతో ఆయన వెన్నులో వణుకు పుట్టింది. ఈ క్రమంలో ప్రత్యర్థిని అడ్డు తొలగించుకుంటే తన గెలుపు ఖాయమని భావించి, నరసరావుపేటలో విధ్వంసానికి ప్రణాళిక రచించారని సమాచారం. ఇందులో భాగంగా పోలింగ్ రోజున నరసరావుపేట వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపైకి సుమారు 200 మంది టీడీపీ రౌడీలు మారణాయుధాలతో పట్టపగలు దాడికి వెళ్లారు.
ఆ సమయంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంట్లో లేకపోవడంతో ఆయన మామ కంజుల రామకోటిరెడ్డిపై దాడికి తెగబడ్డారు. ఈ సంఘటనపై అరవింద్‌బాబుతో పాటు మరో 30 మందిపై నరసరావుపేట టూటౌన్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కాగా, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని మట్టుబెట్టాలనే పథకంతోనే ఆయన ఇంటిపైకి దాడికి వచ్చినట్లు తెలిసింది. ఈ దాడికి ఇతర రాష్ట్రాల నుంచి బౌన్సర్లు, కిరాయి రౌడీలను అరవింద్ బాబు పోలింగ్ ముందు రోజు రాత్రికే రప్పించినట్టు సమాచారం.
అరవింద బాబు ఇంట్లో పెట్రోల్ బాంబులు, వేట కొడవళ్లు
గొడవల నేపథ్యంలో పోలింగ్ అనంతరం టీడీపీ అభ్యర్థి అరవింద బాబును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఆ సయమంలో ఆయన ఇంట్లో (ఇల్లు, ఆస్పత్రి ఒకచోటే) సోదాలు నిర్వహించగా.. పెట్రోల్ బాంబులు, ఇనుప రాడ్లు, వేట కొడÐ] ళ్లు, కంకర రాళ్లు, ఇతర మారణాయుధాలు దొరికాయి. పోలింగ్‌కు ముందుగానే వీటిని తీసుకొచ్చి ఉంచినట్లు సమాచారం.
ఈ ఎన్నికల్లోనూ ఓటమి ఖాయమని తేలడంతో గోపిరెడ్డిని అడ్డు తొలగించుకోవాలనే మారణాయుధాలు తెప్పించినట్లు తెలిసింది. మారణాయుధాలకు సంబంధించిన వీడియోలు రెండు రోజులుగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అయినా పోలీసులు ఇందుకు సంబంధించి ఎటువంటి కేసు నమోదు చేయకపోవడం గమనర్హం. పోలీసు పెద్దల అనుమతి రాకపోవడం వల్లే అరవింద్‌బాబుపై కేసు నమోదు కాలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఇదిలా ఉండగా నరసరావుపేటలో అల్లర్ల కారణంగా రెండు రోజుల పాటు దుకాణాలు బంద్ చేయాలని పోలీసులు ఆదేశించారు. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగేలా ఉంది. దీంతో ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టీడీపీ స్వార్థ రాజకీయాల కోసం తాము ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలాగైతే తామెలా బతకాలని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment