దిగ్గజ కంపెనీల మధ్య రూ.1.66లక్షల కోట్ల ఒప్పందం.. ఎందుకంటే.. | Sakshi
Sakshi News home page

దిగ్గజ కంపెనీల మధ్య రూ.1.66లక్షల కోట్ల ఒప్పందం.. ఎందుకంటే..

Published Thu, May 2 2024 12:00 PM

Alphabet Inc paid Apple Inc 20 billion USD in 2022 for Google to be the default search engine

ప్రపంచంలోని టాప్‌ టెక్‌ దిగ్గజ కంపెనీల మధ్య ఒప్పందం జరిగినట్లు కోర్టు పత్రాల ద్వారా బట్టబయలైంది. యాపిల్‌ సఫారి బ్రౌజర్‌లో గూగుల్‌ డిఫాల్ట్ సెర్చ్‌ ఇంజిన్‌గా ఉండటానికి 2022లో 20 బిలియన్‌ డాలర్లు(రూ.1.66లక్షల కోట్లు) చెల్లించినట్లు గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ ఇంక్‌. తెలిపింది. గూగుల్‌కు వ్యతిరేకంగా కోర్టులో దాఖలైన యాంటీట్రస్ట్ దావాలో ఈ విషయం వెలుగుచూసింది.

ఆన్‌లైన్ ప్రకటనల ఆదాయం కోసం గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ చట్టవిరుద్ధంగా గుత్తాధిపత్యాన్ని కలిగి ఉందని యూఎస్‌ కోర్టులో గతంలో యాంటీట్రస్ట్ వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ కేసులో రెండు టెక్ దిగ్గజాల మధ్య ఒప్పందం జరిగినట్లు ఇటీవల తేలింది. విచారణ జరుపుతున్న న్యాయ శాఖ ఏడాది చివర్లో ఈ అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.

ఇటీవల జరిగిన విచారణలో రెండు కంపెనీల మధ్య ఒప్పందం జరిగిందని ధ్రువీకరించాయి. ఇందుకోసం జరిగిన చెల్లింపుల మొత్తాన్ని బహిర్గతం చేయకుండా చూడాలని భావించినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. కోర్టు విచారణలో నంబర్లు వెల్లడించకుండా ఈ ఒప్పందానికి గూగుల్‌ ‘బిలియన్లు’ చెల్లించినట్లు యాపిల్‌ చెప్పింది. యాపిల్‌ డిఫాల్ట్‌ బ్రౌజర్‌గా ఉన్నందుకు సెర్చ్‌ ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంలో 36 శాతం గూగుల్ యాపిల్‌కు చెల్లిస్తున్నట్లు తెలిసింది.

కోర్టు పత్రాల వల్ల యాపిల్‌కు వస్తున్న ఆదాయమార్గాల గురించి కూడా స్పష్టత వచ్చినట్లయింది. 2020లో యాపిల్‌ నిర్వహణ ఆదాయంలో దాదాపు 17.5 శాతం గూగుల్‌ నుంచి సమకూరిందేనని అంచనా. గూగుల్‌ డిఫాల్ట్ ఒప్పందాల్లో యాపిల్‌ డీల్‌ అత్యంత ముఖ్యమైంది. యూఎస్‌లో అధికంగా ఉపయోగించే స్మార్ట్‌ఫోన్ సెర్చ్‌ ఇంజిన్‌ సఫారి బ్రౌజర్‌ కావడంతో గూగుల్‌కు ఈ ఒప్పందం ప్రధానంగా మారింది. 2002లో సఫారీ బ్రౌజర్‌లో గూగుల్‌ను ఉచితంగా ఉపయోగించేందుకు యాపిల్ మొదట అంగీకరించింది. కానీ సెర్చ్‌ ప్రకటనల ఆదాయం పెరుగుతున్న కొద్దీ దాన్ని ఇరు కంపెనీలు పంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. మే 2021 నాటికి సఫారి ‍బ్రౌజర్‌లో డిఫాల్ట్ సెర్చ్‌ఇంజిన్‌ కోసం యాపిల్‌కు నెలకు 1 బిలియన్ డాలర్లు(రూ.8300 కోట్లు) కంటే ఎక్కువే చెల్లించిందని ప్రాసిక్యూటర్లు తెలిపారు.

ఇదీ చదవండి: బేబీ పౌడర్‌తో అండాశయ క్యాన్సర్‌.. పరిష్కారానికి రూ.54వేలకోట్లు

సెర్చ్‌ ఇంజిన్‌లో గూగుల్‌తో పోటీపడుతున్న బింగ్‌ను యాపిల్‌ డిఫాల్ట్‌బ్రౌజర్‌గా ఉండేలా చూడాలని మైక్రోసాఫ్ట్‌ సంస్థ చాలానే ప్రయత్నించింది. కోర్టులో దాఖలైన పత్రాల ప్రకారం..సఫారీలో బింగ్‌ను డిఫాల్ట్‌గా ఉంచడానికి కంపెనీ తన ప్రకటనల ఆదాయంలో 90 శాతం యాపిల్‌కు ఇవ్వడానికి మైక్రోసాఫ్ట్‌ సిద్ధ పడింది.

Advertisement
Advertisement