బురారీ ఉదంతం : ఆత్మలు తిరుగుతున్నాయి | Sakshi
Sakshi News home page

వివాదాస్పదంగా మారిన బురారీ ఇల్లు

Published Wed, Jun 26 2019 3:59 PM

Rumors About Burari house But Ali Brothers Unfazed - Sakshi

న్యూఢిల్లీ : అహ్మద్‌ అలీ, అస్ఫర్‌ అలీల వృత్తి కార్పెంటర్‌ పని.. ప్రవృత్తి హాంటెడ్‌ హౌస్‌(దెయ్యాలు తిరుగుతున్నాయనే ప్రచారం జరిగే ఇళ్లు)ల్లో నివసించడం. సాధరణంగా ఇలాంటి వారి గురించి ఎక్కువగా సినిమాల్లోనే చూస్తూంటాం. దెయ్యాలు తిరుగుతున్నాయనే ప్రచారంతో విలువైన ఇంటిని ఎవరూ కొనడానికి ముందుకు రాకపోవడం.. ఈ క్రమంలో హీరో అక్కడ కొన్ని రోజుల పాటు గడిపి.. అవన్ని ఒట్టి పుకార్లే అని నిరూపిస్తుంటారు. సరిగా అలీ బ్రదర్స్‌ పని కూడా ఇదే అన్నమాట. ప్రస్తుతం వీరు ఇద్దరు బురారీ కుంటుంబ సభ్యుల ఇంట్లో ఉంటున్నారు. గత ఏడాది దేశ రాజధానిలో సంచలనం సృష్టించిన బురారీ కుటుంబ సభ్యుల ఆత్మహత్య ఉదంతాన్ని అంత తొందరగా మర్చిపోలేం. (చదవండి : తండ్రి కాపాడుతాడని...)

అతీత శక్తుల భ్రమలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి మరణాంతరం గత ఏడాది అక్టోబర్‌లో దినేష్‌ చుంద్వాత్‌ అనే వ్యక్తి ఈ ఇంటిని కోటిన్నర రూపాయలకు కొనుగోలు చేశాడు. ప్రస్తుతం డబ్బు అవసరం ఉండటంతో.. ఇంటిని అమ్మేందుకు ప్రయత్నించాడు. కానీ అప్పటికే ఈ ఇంటిలో ఆత్మలు తిరుగుతున్నాయనే పుకార్లు వ్యాపించాయి. దాంతో కోటిన్నర పెట్టి కొన్న ఇంటిని కొనడానకి ఎవరూ ముందుకు రావడం లేదు. ఒక వేళ వచ్చినా.. చాలా తక్కువ ధరకు అడుగుతున్నారు. ఈ క్రమంలో ఇంటి మీద వచ్చిన పుకార్లు నిజం కాదని నిరూపించి.. మంచి రేటుకు ఇంటిని అమ్మాలని భావించిన దినేష్‌, అలీ సోదరులకు కబురుపెట్టాడు.

కొన్ని రోజులు పాటు తన ఇంట్లో ఉండాల్సిందిగా దినేష్‌ వారిని కోరాడు. రెంట్‌ ఇవ్వాల్సిన పని లేదని చెప్పాడు. దినేష్‌ కోరిక మేరకు అలీ సోదరులు ప్రస్తుతం ఈ ఇంట్లో నివాసం ఉంటున్నారు. మూడంతస్థుల భవనంలో కింది ఫ్లోర్‌ను తమ కార్పెంటర్‌ విధుల కోసం వాడుకుంటుండగా.. మిగతా రెండంతస్థుల్లో వారు నివాసం ఉంటున్నారు. ఈ విషయం గురించి అలీ సోదరులు మాట్లాడుతూ.. ‘తొలి రోజు మేం నారాయణి దేవి రూంలో ఆమె మంచం మీద పడుకున్నాం. మాకేం తేడగా అన్పించలేదు. తరువాత మేం ఇంట్లో ఉన్న వేర్వేరు బెడ్రూంల్లో ఒంటరిగా పడుకుంటున్నాం’ అన్నారు. అయితే తాము బురారీ కుటుంబ సభ్యుల ఇంట్లో ఉండటం తమ ఇంట్లోవారికి కూడా ఇష్టం లేదని తెలిపారు. మమ్మల్ని ఇక్కడకు రాకుండా అడ్డుకోవాలని ప్రయత్నించారు. కానీ తాము అందుకు ఒప్పుకోలేదన్నారు.

గ్రామాల్లో ఇలాంటి మూఢనమ్మకాలు అధికంగా ఉంటాయని.. కానీ తాము వాటిని నమ్మమని తెలిపారు అలీ సోదరులు. అయితే అర్థరాత్రి సమయంలో ఆత్మలు తిరుగుతుంటాయని తాము బలంగా విశ్వసిస్తామన్నారు. ఈ విషయం గురించి ఓ ప్రాపర్టీ డీలర్‌ మాట్లాడుతూ.. ‘ఇలాంటి దారుణాలు జరిగిన ఇళ్లను కొనడానికి జనాలు ఆసక్తి చూపరు. ఒక వేళ ఎవరైనా కొందామని భావించిన చాలా తక్కువ రేటుకు కొందామనే భావిస్తారు. బురారీ ఇళ్లు రోడ్డుకు దగ్గర్లో ఉంది. పెయింట్‌ వేసి.. చిన్న చిన్న మార్పులు చేస్తే.. మంచి ధర పలుకుతుంది. కానీ ముందు ఆ ఇంటి గురించి ప్రచారం అవుతోన్న పుకార్లు అవాస్తవమని తెలాలి’ అన్నారు.

Advertisement
Advertisement