అల్లు అర్జున్ పర్యటనపై తీవ్ర ఆగ్రహం
నంద్యాల ఎస్పీ, డీఎస్పీ, సీఐలపై కఠిన చర్యలు
అదేరోజు పిఠాపురంలో పర్యటించిన రామ్‌చరణ్
సెక్షన్ 144 నిబంధనల ఉల్లంఘన
ఏమాత్రం పట్టించుకోని ఎన్నికల సంఘం
టీడీపీ కుట్ర రాజకీయాలకు తలొగ్గుతోందని సర్వత్రా తీవ్ర విమర్శలు
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కుట్రపూరితంగా ఎన్నికల కమిషన్‌ను ఏ స్థాయిలో ప్రభావితం చేస్తున్నారో మరోసారి రుజువైంది. అధికార పారీ్టపై ఫిర్యాదు చేయడమే ఆలస్యం తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటున్న ఈసీ, టీడీపీ కూటమి కార్యక్రమాలపై మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం.
శనివారం నంద్యాలలో స్టార్ హీరో అల్లు అర్జున్ పర్యటనలో భారీగా ప్రజలు పాల్గొన్నారంటూ జిల్లా ఎస్పీతోపాటు డీఎస్పీ, సీఐలకు చార్జ్ మెమోలు జారీ చేసిన ఎన్నికల కమిషన్ అదే రోజు పిఠాపురంలో హీరో రామ్ చరణ్ పర్యటనకు సంబంధించి మాత్రం నిర్లిప్తంగా వ్యవహరించడం ఈసీ ద్వంద్వ వైఖరికి నిదర్శనం. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు కుట్ర రాజకీయాలు, ఢిల్లీ స్థాయిలో వ్యవస్థల మేనేజ్‌మెంట్‌కు ఈసీ తలొగ్గుతున్నట్లు పలు సందర్భాల్లో స్పష్టంగా వెల్లడైంది. – సాక్షి, అమరావతి
ఇటు కఠిన చర్యలు..
వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నంద్యాల అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి చిరకాలంగా అల్లు అర్జున్‌కు స్నేహితుడు. శనివారం అల్లు అర్జున్ తన సతీమణితో కలసి నంద్యాలలోని శిల్పా రవిచంద్రారెడ్డి నివాసానికి వచ్చారు. ప్రజలకు సేవ చేస్తున్న తన స్నేహితుడు, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డిని భారీ మెజార్థితో గెలిపించాలని ప్రజలను కోరారు. ఆయన పిలవకపోయినా తనంతట తానే స్వయంగా వచ్చి మద్దతు తెలియచేస్తున్నట్లు అల్లు అర్జున్ చెప్పారు. నిజానికి ఇది స్నేహపూర్వక వ్యక్తిగత పర్యటనే.
ఎన్నికల ప్రచారం కాదు. అల్లు అర్జున్ పర్యటన సందర్భంగా ప్రచార సభ నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ భావించలేదు. అందువల్ల రిటరి్నంగ్ అధికారి నుంచి ముందస్తు అనుమతి తీసుకోలేదు. అయితే విశేష ప్రేక్షకాదరణ కలిగిన అల్లు అర్జున్ నంద్యాల వచ్చారనే సమాచారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భారీ సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. వారంతా స్వచ్చందంగా వచి్చన వారే. వైఎస్సార్‌సీపీ ఎలాంటి జన సమీకరణ చేయలేదు. దీంతో పోలీసులకు కూడా ఎలాంటి సమాచారం లేదు. శిల్పా రవిచంద్రారెడ్డి నివాసం బాల్కనీ నుంచి అల్లు అర్జున్ తన అభిమానులకు అభివాదం చేసి లోపలికి వెళ్లిపోయారు.
వారిని ఉద్దేశించి ఎలాంటి ప్రసంగాలు చేయలేదు. ఇందులో పోలీసులు చేయగలిగింది కూడా ఏమీ లేదు. కట్టడి చేయాల్సిన అవసరం ఏర్పడలేదు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అయితే అల్లు అర్జున్ రాకతో టీడీపీ బెంబేలెత్తింది. ఈ పర్యటనతో నంద్యాల నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అల్లు అర్జున్ అభిమానులకు ఒక సందేశం వెళ్లిందని ఆందోళన చెందింది. దీంతో అల్లు అర్జున్ పర్యటనపై ఫిర్యాదు చేసింది.
దీనిపై ఈసీ వెంటనే స్పందించింది. 144 సెక్షన్ ఉన్నా అల్లు అర్జున్ అభిమానులు అంత భారీగా ఎలా చేరుకోగలిగారంటూ నంద్యాల ఎస్పీ కె.రఘువీరారెడ్డి, డీఎస్పీ ఎన్.రవీంద్రనాథ్ రెడ్డి, టూ టౌన్ సీఐ కె.రాజరెడ్డిలకు చార్జ్ మెమో జారీ చేసింది. శనివారం రాత్రి 7 గంటల లోగా చార్జ్‌మెమో జారీ చేసి రాత్రి 8 గంటల లోపే ఈసీకి నివేదిక సమర్పించాలని డీజీపీని ఆదేశించింది. ఆ ముగ్గురు అధికారులపై 60 రోజుల్లోగా శాఖాపరమైన విచారణ పూర్తి చేయాలని పేర్కొంది
ఈసీ అనుమతి లేకుండా శాఖాపరమైన విచారణను ముగించకూడదని స్పష్టం చేసింది. అసలు అది ఎన్నికల ప్రచార సభే కాదు. అది పూర్తిగా అల్లు అర్జున్ వ్యక్తిగత పర్యటన. సమాచారం తెలుసుకుని ఆయన అభిమానులు స్వచ్ఛందంగా తరలివస్తే ఎస్పీ, డీఎస్పీ, సీఐలు మాత్రం ఏం చేయగలరు? అందులో వారి వైఫల్యం ఏముంది? ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకపోయినా సరే ముగ్గురు అధికారులపై ఈసీ అంత కఠిన చర్యలకు ఆదేశించడం ఏమిటని పోలీసు వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు కుట్రలకు ఈసీ తలొగ్గుతోందని పేర్కొంటున్నారు.
అటు ఉదాసీనత..
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. హీరో రామ్ చరణ్ కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో శనివారమే పర్యటించారు. తన తల్లి కొణిదెల సురేఖ, మేనమామ అల్లు అరవింద్‌తో కలిసి పిఠాపురంలో పాదగయ క్షేత్రానికి వెళ్లారు. అనంతరం పిఠాపురంలోని పవన్ కళ్యాణ్ నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీగా గుమిగూడారు.
పవన్ కల్యాణ్ నివాసం బాల్కనీ నుంచి ఆయనతోపాటు రామ్‌చరణ్ కూడా అభిమానులకు అభివాదం చేశారు. ఆ ప్రాంతంలో కూడా 144 సెక్షన్ అమలులో ఉంది. మరి ఈ విషయాన్ని ఈసీ ఏమాత్రం పట్టించుకోలేదు. కాకినాడ జిల్లా ఎస్పీ, పిఠాపురం డీఎస్పీ, సీఐలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వారికి చార్జ్‌మెమో జారీ చేయలేదు. ఈసీ ఇలాంటి ద్వంద్వ వైఖరి ఎందుకు ప్రదర్శిస్తోందని పరిశీలకులు ప్రశి్నస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment