11 మంది కన్సల్టెంట్లను నియమించిన కూటమి సర్కారు
8 నెలల కోసం రూ.3.28 కోట్లు కేటాయింపు
సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలన అంటే కన్సల్టెంట్లు, విదేశీ సంస్ధలకు రూ.వందల కోట్లు దోచిపెట్టడం అనేది అందరికీ తెలిసిందే. తాజాగా కన్సల్టెంట్ల రాజ్యం తిరిగి ప్రారంభమైంది. రాష్ట్ర ఆదాయం పెంచేందుకు 11మంది కన్సల్టెంట్లతో ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ యూనిట్‌ను రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ (ఏపీఎస్‌డీపీఎస్)లో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ యూనిట్‌కు కేపీఎంజీని ఏజెన్సీగా ఎంపిక చేశారు. ఇందులో ఒక టీం లీడర్‌తోపాటు 10 మంది కన్సల్టెంట్లను తీసుకోనున్నారు. ఇందుకోసం 8 నెలలకు రూ.3.28 కోట్లు చెల్లించనున్నారు. అవసరాన్ని బట్టి కన్సల్టెంట్ల కాల వ్యవధిని మరింత పెంచనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళికా శాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్ కుమార్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్థిక ప్రణాళిక, స్థూల ఆర్థిక వ్యవస్థ ద్వారా రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికకు ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ యూనిట్ అవసరమైన సహాయం అందిస్తుంది.
వనరుల సమీకరణతోపాటు కేటాయింపులు, సంస్థాగతంగా రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడంపై పర్యవేక్షణ, డేటా విశ్లేషణ, పరిశోధన వంటి పనులను కన్సల్టెంట్లు నిర్వహిస్తారు. అలాగే ఆదాయం పెంపుదల, వ్యయ నిర్వహణకు కన్సల్టెంట్లు అవసరమైన సహకారం అందిస్తారు. వ్యూహాత్మక పెట్టుబడులు, స్థూల ఆర్థిక పరిశోధన, ఆర్థిక విశ్లేషణకు చెందిన డేటాను రూపొందించనున్నారు. ఆదాయ మార్గాలను పెంచడంతోపాటు ఆర్థిక నిర్వహణను మెరుగుపరచడం, ఆర్థిక క్రమశిక్షణకు అవసరమైన విధానాలను ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ యూనిట్ రూపొందించనుంది.
Comments
Please login to add a commentAdd a comment