రాంచీ: జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) నేతృత్వంలోని హేమంత్ సోరెన్ ప్రభుత్వంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. జేఎంఎం నేతృత్వంలోని పార్టీలు ఆరిపోయిన టపాసులని, బీజేపీ.. రాష్ట్రాన్ని అభివృద్ధి శిఖరాలకు తీసుకెళ్లే శక్తివంతమైన రాకెట్ అని అభివర్ణించారు. ఆయన రాష్ట్ర రాజధాని రాంచీలోని హతియాలో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు.
‘‘రాష్ట్రంలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో స్పష్టంగా తెలుస్తోంది. దీపావళి పండుగ ఇప్పుడే ముగిసిపోయింది. జేఎంఎం, కాంగ్రెస్ , ఆర్జేడీ పార్టీలు ఇప్పుడు దీపావళి క్రాకర్స్‌తో కలిసిపోయాయి. కానీ, బీజేపీ మాత్రమే జార్ఖండ్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లే శక్తిమంతమైన రాకెట్. జేఎంఎం ఆదివాసీల రక్తాన్ని పీల్చుకుంది. వారి ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తోంది. జార్ఖండ్‌కు చొరబాటుదారులు ఎందుకు వస్తున్నారని నేను హేమంత్ సోరెన్‌ను అడుగుతున్నా. రాష్ట్రంలోని గిరిజన జనాభా 28 శాతానికి ఎందుకు తగ్గిపోయింది?. బీజేపీకి రెండు పర్యాయాలు అవకాశం ఇవ్వండి. అభివృద్ధి చెందిన రాష్ట్రాల వరుసలో జార్ఖండ్ నిలబెడతాం. మేం జార్ఖండ్‌లో ప్రభుత్వాన్ని మార్చడమే కాకుండా వ్యవస్థను కూడా మారుస్తాం’’అని అన్నారు.
మరోవైపు.. సోమవారం జార్ఖండ్‌లోని గర్వాలో ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ.. జేఎంఎం కూటమిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బంగ్లాదేశ్ చొరబాటుదారులకు మద్దతుగా ఉన్నందుకు జేఎంఎం నేతృత్వంలోని కూటమిని ‘చొరబాటుదారుల కూటమి’గా అభివర్ణించారు. ‘‘జార్ఖండ్‌లో బుజ్జగింపు రాజకీయాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం బంగ్లాదేశ్ చొరబాటుదారులకు మద్దతు ఇవ్వడంలో బిజీగా ఉంది. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో గిరిజనుల సంఖ్య తగ్గిపోతుంది. ఇది గిరిజన సమాజానికి, దేశానికి పెనుముప్పు. ఈ సంకీర్ణ కూటమి.. చొరబాటుదారుల కూటమి’’ అని మోదీ అన్నారు.
ఇక.. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. ఫలితాలు నవంబర్ 23న వెల్లడికానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment