రాంచి: తాము జార్ఖండ్‌లో అధికారంలోకి వస్తే.. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్‌ఆర్‌సీ)ను అమలు చేస్తామని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర ఇంచార్జీ శివరాజ్‌సింగ్ చౌహాన్ అన్నారు. ప్రస్తుతం జార్ఖండ్‌లో అధికారంలో ఉన్న సీఎం హేమంత్ సోరెన్ ప్రభుత్వం చొరబాటుదారులుకు అనుకూలంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.
‘‘బీజేపీ జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయబోతోంది. ఈ ఎన్నికలు ఒకరిని ముఖ్యమంత్రిగా చేయటం లేదా అధికారాన్ని అప్పగించటం మాత్రమే కాదు. ఇది జార్ఖండ్‌ను రక్షించడం గురించి జరిగే ఎన్నికలు. రోటీ, మతీ, భేటీ రక్షిండానికి బీజేపీ నిశ్చయించుకుంది. బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారుల కారణంగా ఈ ప్రాంతం జనాభా వేగంగా మారుతోంది. దీంతో సంతాల్ ప్రాంతంలోని గిరిజన జనాభా ఇప్పుడు 28 శాతానికి తగ్గింది.
..ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ చొరబాటుదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. హేమంత్ సోరెన్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చొరబాటుదారులకు అనుకూలంగా ఉంది. మేము అధికారంలోకి వస్తే.. జార్ఖండ్‌లో ఎన్‌ఆర్‌సీని అమలు చేస్తాం. దీనిలో స్థానిక నివాసితులను నమోదు చేస్తారు. చొరబాటుదారులను ఎంపిక చేసి బయటకు పంపుతారు’’ అని అన్నారు.
జార్ఖండ్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం.. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా అక్టోబరు 5న యువత, మహిళల కోసం ‘పాంచ్ ప్రాణ’ను విడుదల చేసిందని తెలిపారు. బీజేపీ.. యువ సతి, గోగో దీదీ యోజన, ఘర్ సాకార్, లక్ష్మీ జోహార్ , ఉపాధి కల్పిస్తామని హామీ వంటి ఐదు వాగ్దానాలు ప్రకటించిందని పేర్కొన్నారు.
ఇక.. ప్రస్తుత ఉన్న హేమంత్ సోరెన్ ప్రభుత్వ పదవీకాలం 2025 జనవరిలో ముగియనుంది. 81 సీట్లు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీకి డిసెంబర్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. గత 2020 అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా 30 సీట్లు, బీజేపీ 25 సీట్లు, కాంగ్రెస్ 16 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే.
ఎన్‌ఆర్‌సీ అంటే..
అక్రమ వలసదారులను గుర్తించి వెనక్కు పంపడం జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ) ప్రధానోద్దేశం. ఇందులో భాగంగా వలసదారుల నివాస తదితర ధ్రువీకరణ పత్రాలను నమోదు చేయడం తప్పనిసరి. తద్వారా పౌరసత్వానికి చట్టపరంగా అర్హులైన జాబితాను రూపొందిస్తారు. సరైన పత్రాలు లేనివారిని అక్రమ వలసదారులుగా నిర్ధారిస్తారు. 2020లో అసోంలో మాత్రమే అమలు చేసిన ఎన్‌ఆర్‌సీని దేశవ్యాప్తం చేస్తామని మోదీ సర్కారు ప్రకటించింది. అయితే.. దీనిపైనా వివాదం కొనసాగుతోంది.
చదవండి: సీఎం యోగి వార్నింగ్.. ‘ వివాదాస్పద వ్యాఖ్యలకు శిక్ష తప్పదు’
Comments
Please login to add a commentAdd a comment