
- అఘాయిత్యాలు జరుగుతుంటే పవన్ ఏం చేస్తున్నట్లు?
- ప్రశ్నిస్తే.. డైవర్షన్ పాలిటిక్సా?
- ఏ హక్కు ఉందని సరస్వతి పవర్ భూములకు వెళ్లారు?
- డిప్యూటీ సీఎం పవన్‌పై అంబటి ధ్వజం
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో ఆడపిల్లలు అదృశ్యమయ్యారని గతంలో ఆరోపించిన పవన్ కల్యాణ్, ఇప్పటిదాకా ఆ అదృశ్యమైన వాళ్లలో ఒక్కరినైనా కనిపెట్టగలిగారా? అని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నిలదీశారు. శాంతి భద్రతలపై డిప్యూటీ సీఎం హోదాలో పవన్ వ్యాఖ్యలు, సరస్వతి పవర్ భూముల్లో పర్యటన పరిణామాలపై అంబటి మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విఫలమైందని పవన్ కల్యాణ్ అన్నారు. మేం మొదటి నుంచి అదే కదా చెబుతోంది. ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా అదే చెప్తున్నారు. పాలన చేతకాక పవన్ ఇలా తప్పించుకుంటున్నారు. ఐదు నెలల తర్వాత పోలీసులు విఫలమయ్యారంటే మీకు పాలన చేతకాదని అర్థం. అసలు అఘాయిత్యాలు జరుగుతుంటే పవన్ ఏం చేస్తున్నారు.
పిఠాపురంలో కూటమి నేతలు అఘాయిత్యాలకు పాల్పడుతుంటే పవన్ ఏం చేశారు?. పిఠాపురం ఘటనలో ఎంత మందిని అరెస్ట్ చేశారు. పైగా ప్రశ్నిస్తే.. డైవర్షన్ పాలిటిక్సా? అని పవన్‌పై అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. మైక్ ముందే అనిత హోం మంత్రి, వెనకాల నారా లోకేష్ అన్ని ట్రాన్స్‌ఫర్లు చేస్తారు అని ఎద్దేవా చేశారాయన.
అలాగే.. గతంలో ఇదే పవన్ కల్యాణ్ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేసిన విషయాన్ని అంబటి ప్రస్తావించారు. ‘‘ఏపీలో ఆడపిల్లలు అదృశ్యమయ్యారని వైఎస్సార్‌సీపీ హయాంలో పవన్ అన్నారు. మరి మిస్సైన వాళ్లలో ఒక్కరి జాడ అయినా కూటమి ప్రభుత్వం కనిపెట్టిందా?’’ అని అంబటి ప్రశ్నించారు.
సరస్వతి పవర్ భూములు చట్టం ప్రకారం కొనుగోలు చేసినవి. అలాంటిది మీకు ఏ హక్కు ఉందని అక్కడికి వెళ్లారు. సరస్వతి భూముల వ్యవహారం ఇప్పుడు కొత్తదా? అని పవన్‌ను ప్రశ్నించారు అంబటి.
ఇదీ చదవండి: నేరస్తులే అప్‌డేట్ అయ్యి తప్పించుకుంటున్నారు: హోం మంత్రి అనిత