AP : డిసెంబర్‌ 18 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు | Sakshi
Sakshi News home page

AP : డిసెంబర్‌ 18 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు

Published Mon, Dec 4 2023 7:11 PM

New Aarogyasri Cards Form Dec 20 Says CM Jagan At Health Review - Sakshi

సాక్షి, గుంటూరు: రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన బృహత్తర కార్యక్రమం జగనన్న ఆరోగ్య సురక్షలో గుర్తించిన రోగుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని, సకాలంలో మందులు అందించడంతో పాటు సిబ్బంది.. మందుల కొరత లేకుండా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంబంధిత మంత్రిత్వ శాఖకు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.  

సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో వైద్య, ఆరోగ్యశాఖపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో పేదలకు మెరుగైన వైద్య ఆరోగ్య సేవలు అందించే విషయంలో ఎక్కడా తగ్గొద్దని సూచించారు.  ‘‘ఆరోగ్య శ్రీ వినియోగంపై విస్తృత ప్రచారం చేయాలి. డిసెంబర్‌ 18 నుంచి కొత్త ఆరోగ్య శ్రీ కార్డులు ఇవ్వాలి. ప్రతి ఒక్కరి ఫోన్లో ఆరోగ్య శ్రీ, దిశ యాప్‌లు ఉండాలి. అలాగే.. 

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులకు వైద్య చికిత్సలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి సకాలానికి మందులు అందించాలి. ఆస్పత్రుల్లో ఎక్కడా సిబ్బంది లేదనే మాట వినపడకూడదు.. ఖాళీలు ఉండకూడదు. 

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులకు చేయూత నిచ్చే కార్యక్రమం ఎలా జరుగుతుందన్న దానిపై నిరంతరం సమీక్ష చేయాలి. దిగువస్థాయి వైద్య సిబ్బంది నుంచి సకాలానికే ఇండెంట్‌ వస్తే వారికి తగిన సమయానికి మందులు ఇచ్చేందుకు వీలు అవుతుంది. ఫ్యామిలీ డాక్టర్‌ ప్రతి గ్రామానికీ వెళ్తున్నందున అదే సమయంలో వారికి మందులు అందాయా? లేవా? అనే దానిపై పరిశీలన చేయాలి. జనవరి1 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం–2 రెండో దశ కార్యక్రమాలు నిర్వహించాలి’’.. అని అధికారులకు ఆదేశించారాయన. 

అలాగే.. చైనాలో ప్రస్తుతం విస్తరిస్తున్న  H9N2 వైరస్‌ దృష్ట్యా ఇక్కడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికార యంత్రాగాన్ని అప్రమత్తం చేశారు. ఆస్పత్రుల వారీగా ఉన్నమౌలిక సదుపాయాలపై సమీక్షచేయాలన్న సీఎం.

Advertisement
 
Advertisement
 
Advertisement