నగరాలు అభివృద్ధి చెందుతున్నాయి, ట్రాఫిక్ అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. రోజువారీ ట్రాఫిక్ ఎలా ఉన్నా.. వర్షాకాలంలో మాత్రం ట్రాఫిక్‌లో చిక్కుకుంటే నరకం కనిపిస్తుంది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి కొన్ని కంపెనీలు గత కొంత కాలంగా ఎయిర్ టాక్సీలను ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఈ తరుణంలో కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా రోడ్‌మ్యాప్ సిద్ధం చేస్తోంది.
సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వెంటనే.. విమానయాన మంత్రిత్వ శాఖ కొత్త ప్రాజెక్ట్‌పై ప్రయత్నాలను ప్రారంభించింది. భారతదేశంలో ఎయిర్ ట్యాక్సీలను ప్రవేశపెట్టడానికి రోడ్‌మ్యాప్‌ను రూపొందించడానికి భారతదేశపు ఏవియేషన్ రెగ్యులేటర్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అనేక సాంకేతిక కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్ట్ 2026 నాటికి ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై, బెంగుళూరు వంటి ప్రధాన పట్టణ కేంద్రాలలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత చెన్నై, హైదరాబాద్ వంటి ఇతర నగరాలకు విస్తరించనున్నట్లు సమాచారం.
ఇండిగో పేరెంట్ ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్ (IGE) అమెరికన్ ఎయిర్ టాక్సీ తయారీదారు ఆర్చర్ ఏవియేషన్‌తో అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసే పనిని ప్రారంభించింది. ఎయిర్ టాక్సీ అందుబాటులో వచ్చిన తరువాత.. ఇందులో ప్రయాణించడానికి ప్రయాణికుడికి అయ్యే ఖర్చు ఉబర్ కంటే కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని సమాచారం.
2026 నాటికి భారతదేశంలో ఎయిర్ టాక్సీలు అందుబాటులోకి రానున్నాయని ఆర్చర్ సీసీఓ నిఖిల్ గోయెల్ వెల్లడించారు. దీని కోసమే ఆర్చర్‌కు చెందిన ఒక బృందం ఇటీవల భారతదేశంలోని విమానయాన అధికారులను కలిసింది.
భారతదేశంలోని ప్రధాన నగరాల్లో విపరీతమైన రద్దీ ఏర్పడుతోంది. దీంతో ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఎక్కువ సమయం వెచ్చించాల్సి ఉంటుంది. అయితే ఎయిర్ టాక్సీలు అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రయాణికులు వేగంగా గమ్యం చేరుకోవచ్చు.
ఎయిర్ టాక్సీ ధరలు..
ఢిల్లీ నుంచి గుర్గావ్ వెళ్ళడానికి ఉబర్ ఛార్జ్ రూ. 1500 నుంచి రూ. 2000. అయితే ఎయిర్ టాక్సీ అందుబాటులోకి వచ్చిన తరువాత.. ఢిల్లీ నుంచి గుర్గావ్ వెళ్ళడానికి సుమారు రూ. 2000 నుంచి రూ. 3000 వెచ్చించాల్సి ఉంటుందని ఐజీఈ చీఫ్ రాహుల్ భాటియా పేర్కొన్నారు. ఖచ్చితమైన ధరలు ఎయిర్ టాక్సీ అందుబాటులోకి వచ్చిన తరువాత వెల్లడవుతాయి.
ప్రయాణ సమయం తగ్గుతుంది..
ఒకసారి భారతదేశంలో ఎయిర్ టాక్సీ సర్వీస్ ప్రారంభమైతే.. ప్రయాణ సమయం చాలా వరకు తగ్గుతుంది. ముఖ్యంగా ట్రాఫిక్ నుంచి తప్పించుకోవచ్చు. రోడ్డు మార్గం ద్వారా ఢిల్లీలోని కన్నాట్ నుంచి గురుగ్రామ్ చేరుకోవడానికి 27 కిలోమీటర్లు 90 నిముషాలు ప్రయాణించాల్సి ఉంటుంది. అదే ఈ దూరాన్ని ఎయిర్ టాక్సీ ద్వారా 7 నిమిషాల్లో చేరుకోవచ్చని తెలుస్తోంది.
ఒకసారికి నలుగురు మాత్రమే..
ఎయిర్ టాక్సీలు పూర్తిగా ఎలక్ట్రిక్.. వీటిని ఫుల్ ఛార్జ్ చేయడానికి కేవలం 30 నుంచి 40 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. చూడటానికి ఇవి హెలికాప్టర్‌ల మాదిరిగా ఉన్నప్పటికీ చాలా నిశ్శబ్దంగా ప్రయాణిస్తాయి. ఎయిర్ టాక్సీలో ఒకసారికి నలుగురు మాత్రమే ప్రయాణించవచ్చు.
ఇదీ చదవండి: పాస్‌వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
ఎయిర్ టాక్సీల వల్ల ఉపయోగాలు
ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న నగరాల్లో ఎయిర్ టాక్సీ అవసరం ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అత్యవసర సమయాల్లో వైద్యశాలకు వెళ్లాలన్నా.. సరైన సమయానికి గమ్యస్థానానికి చేరుకోవాలన్నా.. ఎయిర్ టాక్సీలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
ఈ రోజు సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రముఖులు దగ్గర వద్దకు ట్రాఫిక్ సమస్యను ఎదుర్కుంటున్నారు. ట్రాఫిక్ కారణంగా చాలా మంది ప్రముఖులు మెట్రోలో ప్రయాణించిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. కాబట్టి ఎయిర్ టాక్సీ నేడు చాలా అవసరం.
Comments
Please login to add a commentAdd a comment