బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ 'సరళా ఏవియేషన్' భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో2025లో తన ప్రోటోటైప్ ఎయిర్ ట్యాక్సీ 'శూన్య'ను ఆవిష్కరించింది. కంపెనీ దీనిని 2028 నాటికి ప్రారంభించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
శూన్యా ఎయిర్ ట్యాక్సీ.. 20 కిమీ నుంచి 30 కిమీ దూరాల ప్రయాణాలు కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 250 కిమీ. 680 కేజీలు బరువు మోయగల ఈ ఎయిర్ టాక్సీలో ఆరుగురు ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. దీన్నిబట్టి చూస్తే.. మార్కెట్లో అత్యధిక పేలోడ్ మోయగల కెపాసిటీ ఉన్న ఎయిర్ టాక్సీగా రికార్డ్ క్రియేట్ చేయనుంది. అయితే కంపెనీ దీనికి సంబంధించిన ధరలను అధికారికంగా వెల్లడించలేదు.
శూన్య ఎయిర్ ట్యాక్సీ.. రద్దీగా ఉన్న ప్రాంతాల్లో కూడా గమ్యాన్ని వేగంగా చేరుకోవడానికి ఉపయోగపడుతుంది. ట్రాఫిక్ రద్దీ నుంచి ప్రయాణికులను వేగంగా గమ్యస్థానానికి చేర్చడానికి మాత్రమే కాకుండా.. కాలుష్యం వంటి సవాళ్లను పరిష్కరించడానికి కూడా సహరిస్తుందని సరళ ఏవియేషన్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ 'అడ్రియన్ ష్మిత్' పేర్కొన్నారు.
సరళ ఏవియేషన్‌ను.. అడ్రియన్ ష్మిత్, రాకేష్ గాంకర్, శివమ్ చౌహాన్ అనే ముగ్గురు అక్టోబర్ 2023లో స్థాపించారు. ఈ స్టార్టప్ ఇటీవలే ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్, జెరోధా కో ఫౌండర్ నిఖిల్ కామత్ భాగస్వామ్యంతో Accel నేతృత్వంలోని సిరీస్ A ఫండింగ్‌లో 10 మిలియన్లను సేకరించింది. కాబట్టి ఈ కంపెనీ త్వరలోనే తన సేవలను ప్రారంభించే అవకాశం ఉంది.
సరళ ఏవియేషన్‌ను కంపెనీ తన ఎయిర్ ట్యాక్సీ సర్వీసులను.. బెంగళూరులో ప్రారంభించిన తర్వాత ముంబై, ఢిల్లీ, పూణె సహా ఇతర నగరాలకు విస్తరించే అవకాశం ఉంది. ప్రయాణీకుల రవాణాతో పాటు, పట్టణ ప్రాంతాల్లో అత్యవసర వైద్య అవసరాలను తీర్చడానికి ఉచిత ఎయిర్ అంబులెన్స్ సేవను ప్రారంభించాలని సరళ ఏవియేషన్ యోచిస్తున్నట్లు సమాచారం.
ఎయిర్ ట్యాక్సీల అభివృద్ధికి కేంద్రం
నగరాలు అభివృద్ధి చెందుతున్నాయి, ట్రాఫిక్ పెద్ద సమస్యగా మారిపోయింది. రోజువారీ ట్రాఫిక్ ఎలా ఉన్నా.. వర్షాకాలంలో మాత్రం ట్రాఫిక్‌లో చిక్కుకుంటే నరకం కనిపిస్తుంది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి కొన్ని కంపెనీలు గత కొంత కాలంగా ఎయిర్ టాక్సీలను ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. దీనికి సంబంధించి కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా రోడ్‌మ్యాప్ సిద్ధం చేస్తోంది.
ఇదీ చదవండి: అంబానీని మించిన దానగుణం: ఒక్క రోజులో రూ. 46వేలకోట్ల నష్టం
భారతదేశంలో ఎయిర్ ట్యాక్సీలను ప్రవేశపెట్టడానికి, రోడ్‌మ్యాప్‌ను రూపొందించడానికి.. ఇండియా ఏవియేషన్ రెగ్యులేటర్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అనేక సాంకేతిక కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్ట్ 2026 నాటికి ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై, బెంగుళూరు వంటి ప్రధాన పట్టణ కేంద్రాలలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత చెన్నై, హైదరాబాద్ వంటి ఇతర నగరాలకు విస్తరించనున్నట్లు సమాచారం.
ప్రయాణ ఖర్చు తక్కువే..
ఇండిగో పేరెంట్ ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్ (IGE) అమెరికన్ ఎయిర్ టాక్సీ తయారీదారు 'ఆర్చర్ ఏవియేషన్'తో అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసే పనిని ప్రారంభించింది. ఎయిర్ టాక్సీ అందుబాటులో వచ్చిన తరువాత.. ఇందులో ప్రయాణించడానికి ప్రయాణికుడికి అయ్యే ఖర్చు ఉబర్ కంటే కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment