ముమ్మాటికీ ఆర్థిక నేరస్తుడే  | Sakshi
Sakshi News home page

ముమ్మాటికీ ఆర్థిక నేరస్తుడే 

Published Thu, Feb 22 2024 4:16 AM

Ramoji Rao illegal financial empire in name of Margadarsi Scam - Sakshi

ఈనాడు పత్రికాధిపతి చెరుకూరి రామోజీరావు ఆర్థిక నేరస్తుడే అన్నది నిగ్గు తేలింది. టీడీపీ అధినేత చంద్రబాబు రాజగురువు రామోజీ ఆర్థిక ఉగ్రవాదేనన్నది స్పష్టమైంది. ‘మార్గదర్శి’ ముసుగులో భారీగా నల్లధనం దందా నిర్వహిస్తున్నారన్నదీ రూఢీ అయ్యింది. అక్ర­మాలను కప్పిపుచ్చుకునేందుకు తొడుక్కున్న ‘పత్రికా స్వేచ్ఛ’ అనే ముసుగు తొలగిపోయింది. చట్టాలను ఉల్లంఘిస్తూ ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డ రామోజీ నిజ రూపంలో అవినీతి దిగంబరుడుగా నిలబడ్డారు. 

మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ అక్రమ డిపాజిట్లు వసూలు చేసిందని ఆర్‌బీఐ స్పష్టం చేయడంతో ఈ కేసులో తరువాత పరిణామాలు ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. అక్రమ డిపాజిట్ల కేసు నిరూపితమైతే ఏకంగా రెట్టింపు జరిమానా అంటే రూ.5,200 కోట్ల జరిమానాతోపాటు కనీసం రెండేళ్ల నుంచి యావజ్జీవ జైలు శిక్ష విధించే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు.   

సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ కార్యాలయాల్లో గుట్టుచప్పుడు కాకుండా ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్‌’ పేరిట ఏళ్ల తరబడి సాగించిన అక్రమ డిపాజిట్ల వసూళ్లు.. నల్లధనం దందాపై 2006లో అప్పటి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఎట్టకేలకు ఫలించాయి. మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ పేరిట రామోజీరావు అక్రమ డిపాజిట్లు వసూలు చేశారని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) సుప్రీంకోర్టుకు విస్పష్టంగా నివేదించింది. దాంతో రామోజీ అవినీతి ఆట కట్టిందని, ఇక శిక్ష పడటమే మిగిలిందని నిపుణులు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కనీసం రెండేళ్ల నుంచి గరిష్టంగా యావజ్జీవ జైలు శిక్ష పడే అవకాశం ఉందని కూడా చెబుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. దాంతో మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ పేరిట రామోజీరావు సాగించిన ఆర్థిక అక్రమాల కథ కమామీషు మరోసారి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 2006లో అప్పటి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ప్రశి్నంచే వరకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్‌’ అనే సంస్థ ఉన్నట్టు కూడా సామాన్యులకు తెలియదు. రాష్ట్రం అంతటా ‘మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌’ కార్యాలయాలే కనిపిస్తూ ఉండేవి. కానీ ఆ కార్యాలయాల్లోనే గుట్టు చప్పుడు కాకుండా ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్‌’ పేరిట మరో కంపెనీ ఆర్థిక కార్యకలాపాలు సాగించేదనే విషయం బయటి ప్రపంచానికి తెలీదు. అలా 1997 నుంచి 2006 వరకు మార్గదర్శి ఫైనాన్సియర్స్‌  యథేచ్ఛగా కార్యకలాపాలు సాగించింది.  

భారీగా అక్రమ డిపాజిట్లు సేకరణ  
ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధంగా రామోజీరావు మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ పేరిట భారీగా అక్రమ డిపాజిట్లు సేకరించారు. డిపాజిట్ల సేకరణ పేరిట ప్రజలను మోసం చేయకుండా కట్టడి చేసేందుకు ఆర్‌బీఐ స్పష్టమైన విధి విధానాలను నిర్దేశించింది. ఆర్‌బీఐ చట్టంలోని 45ఎస్‌ ప్రకారం కంపెనీల చట్టం ప్రకారం నమోదైన ఇన్‌కార్పొరేటెడ్‌ కంపెనీలు మాత్రమే ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించాలి. రామోజీరావు తన గ్రూపు సంస్థలను ‘హిందూ అవిభాజ్య కుటుంబం(హెచ్‌యూఎఫ్‌) కింద నమోదు చేసినట్టుగా పేర్కొన్నారు. హెచ్‌యూఎఫ్‌ కింద నమోదైన కంపెనీలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయకూడదు.


కానీ చట్టానికి తాను అతీతం అని భావించే రామోజీ ఈ నిబంధనను నిర్భీతిగా బేఖాతరు చేశారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ పేరిట యథేచ్ఛగా డిపాజిట్లు వసూలు చేశారు. 2006లో మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ అక్రమ డిపాజిట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చే నాటికి ఏకంగా రూ.2,600 కోట్ల అక్రమ డిపాజిట్లను సేకరించడం విభ్రాంతికర వాస్తవం. కాగా మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై కేసు న్యాయస్థానంలో విచారణలో ఉండగా మరో రూ.2 వేల కోట్ల వరకు అక్రమ డిపాజిట్లు సేకరించారని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది నిరంజన్‌ రెడ్డి సుప్రీంకోర్టుకు నివేదించడం ప్రాధాన్యం సంతరించుకుంది. 


తప్పు ఒప్పుకోక తప్పని రామోజీ 
మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ అక్రమ డిపాజిట్ల దందా బయటపడటంతో రామోజీరావు కంగుతిన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ అక్రమాలపై దర్యాప్తు చేసేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు రంగాచారిని విచారణ అధికారిగా నియమించింది. ఈ అక్రమాలపై సీఐడీ తరపున న్యాయ స్థానాల్లో కేసులు దాఖలు చేసేందుకు టి.కృష్ణంరాజును అధీకృత అధికారిగా నియమించింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ పేరిట ఏకంగా రూ.2,600 కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించినట్టు వీరు గుర్తించారు. కాగా తాము చట్టాన్ని ఉల్లంఘించలేదని బుకాయించేందుకు రామోజీ యత్నించారు.

హెచ్‌యూఎఫ్‌గా తాము ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించవచ్చని అడ్డగోలుగా వాదించారు. కానీ సెక్షన్‌ 45 ఎస్‌ ప్రకారం హెచ్‌యూఎఫ్‌లు డిపాజిట్లు సేకరించకూడదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. దాంతో తాము తప్పు చేసినట్టు రామోజీరావు అంగీకరించారు. నగదు రూపంలో డిపాజిట్లు వసూలు చేసినట్టు కూడా సమ్మతించారు. తమ తప్పును అంగీకరిస్తూ డిపాజిట్‌దారులకు వారి డిపాజిట్లను తిరిగి చెల్లించేస్తామని, మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ను మూసి వేస్తామని న్యాయస్థానానికి లిఖిత పూర్వకంగా తెలిపారు.  

వివరాలు చెప్పం అని వితండవాదం 
తాము అక్రమంగా వసూలు చేసిన డిపాజిట్లను సంబంధిత డిపాజిట్‌దారులకు తిరిగి చెల్లించేశామని రామోజీరావు న్యాయస్థానానికి తెలిపారు. కాగా అక్రమ డిపాజిట్లు ఎవరెవరి నుంచి సేకరించారు.. ఎవరెవరికి తిరిగి చెల్లించారో ఆ వివరాలు వెల్లడించాలని సీఐడీ, ఉండవల్లి అరుణ్‌కుమార్‌ కోరినప్పటికీ రామోజీరావు సమ్మతించ లేదు. ఆ వివరాలు తాము వెల్లడించాల్సిన అవసరం లేదని వితండవాదం చేశారు.

కాగా అక్రమంగా డిపాజిట్లు వసూలు చేసిన రామోజీరావును ప్రాసిక్యూట్‌ చేయాలని అదీకృత అధికారి కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను ఉమ్మడి హైకోర్టు తన చివరి పనిదినాన కొట్టివేయడాన్ని సవాల్‌ చేస్తూ.. డిపాజిట్‌ దారుల వివరాలు వెల్లడించాలని కోరుతూ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వం 2022లో ఇంప్లీడ్‌ అయ్యింది. డిపాజిట్‌దారుల వివరాలు వెల్లడించాల్సిందేనని సుప్రీంకోర్టు గత ఏడాది పేర్కొంది. కానీ ఇంతవరకు రామోజీరావు తమ డిపాజిట్‌దారుల వివరాలను వెల్లడించకపోవడం గమనార్హం.  

నల్లధనం దందా వల్లే గప్‌చుప్‌ 
► మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ కార్యాలయాల్లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించిన ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్‌’ ముసుగులో రామోజీరావు భారీగా నల్లధనం దందాను సాగించారు. సీఐడీ సోదాల్లో, ఆదాయ పన్ను శాఖ తనిఖీల్లో ఆ విషయం వెలుగు చూసింది. అందుకే తమ సంస్థలో డిపాజిట్‌దారుల వివరాలను వెల్లడించేందుకు రామోజీరావు ససేమిరా అంటున్నారు. 

► 2006 నాటికే ఏకంగా 32,385 మంది నుంచి రూ.2,600 కోట్ల వరకు అక్రమంగా డిపాజిట్లు సేకరించారని వెల్లడైంది. కానీ వారి పేర్లు, వివరాలను మాత్రం వెల్లడించేందుకు రామోజీరావు ససేమిరా అంటుండటం గమనార్హం. ఎందుకంటే ఆ డిపాజిట్ల ముసుగులో టీడీపీ పెద్దలు భారీగా నల్లధనాన్ని చలామణిలోకి తీసుకువచ్చారు. అందుకే సీఐడీతోపాటు న్యాయస్థానం కోరినప్పటికీ వారి వివరాలను వెల్లడించేందుకు సమ్మతించడం లేదు.  

► కేంద్ర ఆదాయపన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించి నల్లధనం దందా నడిపారు. రూ.20 వేలకు మించిన లావాదేవీలు నగదు రూపంలో తీసుకోకూడదని ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్‌ 269 స్పష్టం చేస్తోంది. కానీ మార్గదర్శి ఫైనాన్సియర్స్‌లో దాదాపు అన్ని డిపాజిట్లు కూడా నగదు రూపంలోనే తీసుకోవడం గమనార్హం. నగదు రూపంలో డిపాజిట్లు స్వీకరించి తమ సిబ్బంది ద్వారా డిమాండ్‌ డ్రాఫ్ట్‌ (డీడీ), పే ఆర్డర్లు(పీఓ)ల రూపంలోకి మార్చినట్టు ఆదాయ పన్ను శాఖ అధికారుల తనిఖీల్లో బయట పడింది. డిపాజిట్‌ చేసిన మొత్తాలు రూ.50 వేలకు మించి ఉన్నప్పటికీ వాటిని రూ.50 వేల కంటే తక్కువ మొత్తాలుగా విభజించి మరీ డీడీలు, పీఓ లుగా మార్చింది.  

► మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ రశీదు రూపంలో సేకరించిన డిపాజిట్ల పత్రాలను పరిశీలిస్తే అదంతా నల్లధనం బాగోతమేనన్నది స్పష్టమవుతోంది. డిపాజిట్‌దారుల పాన్‌ నంబర్లు, పూర్తి చిరునామాలు కూడా లేకుండానే డిపాజిట్లు సేకరించడం గమనార్హం.  

► మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ డిపాజిట్‌దారులకు చెల్లించాల్సిన మొత్తం రూ.2,610.38 కోట్లుగా రామోజీరావు 2006లో తమ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కానీ 2008లో సమర్పించిన అఫిడవిట్‌లో రూ.1,864.10 కోట్లు చెల్లించేశామని తెలిపారు. మరి మిగిలిన రూ.800 కోట్ల డిపాజిట్లు ఏమయ్యాయనే విషయంపై మౌనం వహించారు. గుట్టుచప్పుడు కాకుండా రికార్డుల నుంచి తొలగించిన ఆ రూ.800 కోట్లు రామోజీకి అత్యంత సన్నిహితుడైన పచ్చ బాబు, ఆయన గ్యాంగ్‌వే అని తెలుస్తోంది. పోనీ చెల్లించామని చెబుతున్న రూ.1,864.10 కోట్ల డిపాజిట్లు ఎవరెవరికి చెల్లించారో చెప్పడానికి  రామోజీ ససేమిరా అంటున్నారు.  

Advertisement
Advertisement