యాపిల్‌ ఇండియాకు ఐఫోన్ల జోష్‌ | Sakshi
Sakshi News home page

యాపిల్‌ ఇండియాకు ఐఫోన్ల జోష్‌

Published Sat, Feb 3 2024 4:33 AM

Apple India Dec Qtr Revenue Hits Record High On Strong iPhone Sales - Sakshi

న్యూఢిల్లీ: ఐఫోన్ల దిగ్గజం యాపిల్‌ ఇండియా అక్టోబర్‌–డిసెంబర్‌ కాలానికి టర్నోవర్‌లో సరికొత్త రికార్డ్‌ సాధించింది. 2 శాతం వృద్ధితో 119.6 బిలియన్‌ డాలర్ల ఆదాయం అందుకుంది. ఇందుకు ఐఫోన్‌ విక్రయాల జోరు దోహదపడింది. వెరసి దేశీ అమ్మకాలలో కంపెనీ సరికొత్త రికార్డును నమోదు చేసినట్లు యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ పేర్కొన్నారు. యాక్టివ్‌ డివైస్‌ల సంఖ్య 2.2 బిలియన్‌లకు చేరుకున్నట్లు వెల్లడించారు.

ఇది అన్ని ప్రొడక్టులలోనూ ఇది అత్యధికంకాగా.. ఐఫోన్ల నుంచి ఆదాయం 6 శాతం ఎగసి 69.7 బిలియన్‌ డాలర్లను తాకినట్లు తెలియజేశారు. మలేసియా, మెక్సికో, టర్కీ తదితర వర్ధమాన మార్కెట్లలోనూ కంపెనీ చరిత్రలోనే అత్యధిక అమ్మకాలు అందుకున్నట్లు కుక్‌ పేర్కొన్నారు. మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ వివరాల ప్రకారం తొలిసారి 2023లో యాపిల్‌ అత్యధిక ఆదాయం అందుకోగా.. అమ్మకాల పరిమాణంలో శామ్‌సంగ్‌ ముందుంది.

కోటి యూనిట్ల షిప్‌మెంట్ల ద్వారా యాపిల్‌ ఆదాయంలో టాప్‌ ర్యాంకును కొల్లగొట్టింది. అయితే ప్రస్తుత సమీక్షా కాలంలో ఐప్యాడ్‌ అమ్మకాలు 25 శాతం క్షీణించి 7 బిలియన్‌ డాలర్లకు పరిమితంకాగా.. వేరబుల్, హోమ్, యాక్సెసరీస్‌ విభాగం విక్రయాలు సైతం 11 శాతం నీరసించి 11.95 బిలియన్‌ డాలర్లను తాకాయి. ఇక మ్యాక్‌ పీసీ అమ్మకాలు ఫ్లాట్‌గా 7.7 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. సర్వీసుల ఆదాయం 11 శాతంపైగా పుంజుకుని 23.11 బిలియన్‌ డాలర్లకు చేరింది.

Advertisement
Advertisement