హోమ్‌ రోబోటిక్స్‌ విభాగంలోకి ప్రపంచ నం.1 కంపెనీ..? | Sakshi
Sakshi News home page

హోమ్‌ రోబోటిక్స్‌ విభాగంలోకి ప్రపంచ నం.1 కంపెనీ..?

Published Sat, Apr 6 2024 11:35 AM

Apple Working On Making Personal Robots For People - Sakshi

ప్రపంచ నం.1 కంపెనీ యాపిల్‌ నిత్యం టెక్నాలజీలో మార్పులు చేస్తూ తమ వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తోంది. అందులో భాగంగానే ‘ప్రాజెక్ట్‌ టైటన్‌’తో ఆటో మొబైల్‌ రంగంలో అడుగుపెట్టాలనుకుంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ స్మార్ట్‌ కార్‌ ప్రాజెక్ట్‌ను నిలిపేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది. దాన్ని రద్దుచేసుకున్నట్లు చెప్పిన కొద్ది రోజుల్లోనే మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు తెరతీయనున్నట్లు తెలిసింది. ఈమేరకు హోమ్‌ రోబోటిక్స్‌ విభాగంలో అడుగుపెట్టేందుకు యాపిల్‌ సిద్ధమవుతుందని కొన్ని మీడియా సంస్థల్లో కథనాల ప్రచురితమయ్యాయి.

హోమ్‌ రోబోటిక్స్‌లో భాగంగా యాపిల్‌ తీసుకురానున్న ఈ రోబో ఇంటి యజమానిని అనుసరిస్తూ పనులు చేయడంలో సాయపడుతుంది. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనాల్సి వచ్చినప్పుడు డిస్‌ప్లే చూపిస్తుంది. ఈ రోబో రెండు చేతులు, ఒక డిస్‌ప్లేతో రానున్నట్లు తెలుస్తోంది. యాపిల్‌ హార్డ్‌వేర్‌ ఇంజినీరింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌ విభాగాలు ఈ ప్రాజెక్ట్‌పై పని చేయనున్నాయని సమాచారం. ఈ ప్రాజెక్ట్ ఇంకా ఆరంభ దశలోనే ఉందని, అయితే దీనిపై యాపిల్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదని బ్లూమ్‌బర్గ్‌ నివేదించింది.

ఇదీ చదవండి: మిమిక్రీ టూల్‌ను పరిచయం చేసిన ప్రముఖ ఏఐ సంస్థ

యాపిల్‌ సంస్థ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగానికి భారీగా ఖర్చు చేస్తూ ఉంటుంది.‍ ప్రాజెక్ట్‌ వల్ల భవిష్యత్తులో ఎలాంటి ప్రయోజనాలుండనున్నాయో అంచనా వేస్తుంది. తీరా ప్రాజెక్ట్‌ తుది దశకు చేరినా అవసరం లేదనుకుంటే దాన్ని పూర్తిగా పక్కన పెట్టేస్తుంది. ఈ తరహాలో స్మార్ట్‌ కారు, డిస్‌ప్లే ప్రాజెక్టులను యాపిల్ పక్కనపెట్టిన విషయం తెలిసిందే. ఒకవేళ కంపెనీ నుంచి ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడినా ఏ మేరకు తుదిదశకు చేరుకుని ఉత్పత్తి వరకు చేరుకుంటుందోనని పలువురు టెక్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement
Advertisement