తెలంగాణకు జాతీయ పార్టీల అగ్రనేతల క్యూ
8, 10 తేదీల్లో ప్రధాని మోదీ బహిరంగ సభలు
5న అమిత్ షా, 6న జేపీ నడ్డా రాక
5, 9 తేదీల్లో రాహుల్ గాంధీ పర్యటన
6, 7 తేదీల్లో ప్రియాంకా గాంధీ నేతృత్వంలో సభలు
దూకుడుగా ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక
ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ వ్యూహాలు
ఐదో తేదీ నుంచి దద్దరిల్లనున్న లోక్‌సభ ఎన్నికల ప్రచారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీల ప్రచారం జోరందుకుంది. జాతీయ పార్టీల ఢిల్లీ నేతలు తెలంగాణ గల్లీలకు క్యూ కడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కువ సీట్లు సాధించాలన్న లక్ష్యంతో దూకుడుగా ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలు మార్లు రాష్ట్రంలో పర్యటించిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అగ్రనేతలు ఆదివారం నుంచి విస్తృతంగా పర్యటించేలా ప్రణాళికలు ఖరారయ్యాయి.
బీజేపీ తరఫున ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా.. కాంగ్రెస్ తరఫున రాహుల్ గాందీ, ప్రియాంకా గాందీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితరులు వరుసగా రాష్ట్రంలో పర్యటిస్తారని ఆయా పార్టీల నేతలు తెలిపారు. మరో వైపు రాష్ట్రంలో కీలకమైన బీఆర్‌ఎస్ తరఫున ఆ పార్టీ అధినేత కేసీఆర్ కూడా ప్రచారాన్ని కొనసాగించనున్నారు.
ఆదివారం నుంచి మొదలు..
ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో 400 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ.. అందుకు తగినట్టుగా తెలంగాణలో మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని భావిస్తోంది. బీజేపీ తరఫున ఆ పార్టీ జాతీయ నేతలు గత నెల రోజులుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, ఇతర అగ్రనేతలు పలుమార్లు రాష్ట్రానికి వచ్చారు.
పోలింగ్‌కు ముందు ఓటర్లను ఆకట్టుకునేందుకు మరోమారు ముందుకు వస్తున్నారు. ప్రధాని మోదీ 8, 10 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించి.. బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. ఈ నెల 5న అమిత్‌షా, ఆరో తేదీన జేపీ నడ్డా వస్తున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మల్కాజ్‌గిరిలలో అమిత్ షా... పెద్దపల్లి, భువనగిరి, నల్లగొండల్లో నడ్డా ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నారు.
కాంగ్రెస్ నుంచీ అతిరథ మహారథులు
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ ప్రచార బరిలోకి దిగుతున్నారు. నిజానికి ఈ ఎన్నికల్లో తెలంగాణలో ప్రియాంకా గాంధీ కేంద్రంగా ఎన్నికల ప్రచారం నిర్వహించాలని.. వీలైనన్ని ఎక్కువసార్లు ఆమెను ప్రచారానికి తీసుకురావాలని టీపీసీసీ భావించింది. కానీ ఇతర రాష్ట్రాల ప్రచార షెడ్యూల్ కారణంగా సాధ్యం కాలేదు. అయితే పోలింగ్ సమీపిస్తున్న సమయంలో ఈ నెల 6, 7 తేదీల్లో ఆమె నేతృత్వంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేశారు.
ఈ నెల 6న ఎల్లారెడ్డి, తాండూరు, సికింద్రాబాద్.. 7న నర్సాపూర్, కూకట్‌పల్లిలలో ప్రియాంక ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. మరోవైపు 5వ తేదీన నిర్మల్, గద్వాలల్లో పర్యటించనున్న రాహుల్‌గాందీ.. 9న కరీంనగర్, సరూర్‌నగర్ సభల్లో ప్రసంగించనున్నారు. వీరితోపాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఎన్నికల ప్రచారానికి హాజరవుతారని టీపీసీసీ వర్గాలు తెలిపాయి.
బీఆర్‌ఎస్ షెడ్యూల్ యథాతథం
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ విధించిన 48 గంటల నిషేధం శుక్రవారం రాత్రి 8 గంటలకు ముగియనుంది. దీంతో ఆయన శుక్రవారం రాత్రి నుంచే తిరిగి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నారు. గతంలో రూపొందించిన షెడ్యూల్‌కు అనుగుణంగానే ఈ నెల 10వ తేదీ వరకు కేసీఆర్ బస్సుయాత్ర ఉంటుందని బీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. ఈనెల 10న సిరిసిల్లలో రోడ్ షో, సిద్ధిపేటలో బహిరంగ సభతో ఆయన లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగుస్తుందని వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment