వేమిరెడ్డి శిబిరంలో ఇదీ పరిస్థితి
క్షేత్రస్థాయిలో జనాదరణ కరువు
వెలవెలబోయిన ప్రజాగళం సభలు
డబ్బులకు ఆశపడి సైకిలెక్కిన నేతలు.. తిరిగి సొంతగూటికి
నెల్లూరు లోక్‌సభ పరిధిలో ప్రచారానికి వెళ్లని వైనం
కోవూరు అసెంబ్లీ స్థానంపైనా తగ్గిన ఫోకస్
విజయం మాదేనంటూ నిన్నామొన్నటి వరకు బీరాలు పలికిన వేమిరెడ్డి దంపతులు.. ఇప్పుడు గౌరవ స్థాయిలో ఓట్లు దక్కితే చాలు భగవంతుడాననే స్థితికి వచ్చారు. డబ్బులను వెదజల్లితే ఏదైనా చేసేయొచ్చనే భ్రమలో ఉన్న వీరికి క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు ఇప్పుడిప్పుడే బోధపడుతున్నాయి. తమ ప్రచారాలు.. చంద్రబాబు చేపట్టిన ప్రజాగళం సభలు వెలవెలబోవడం.. నగదు ప్రలోభాలకు గురై సైకిలెక్కిన నేతలు ఒక్కొక్కరూ తిరిగి సొంతగూటికి చేరుకుంటుండటంతో ఏమి చేయాలో పాలుపోక దిక్కుతోచక స్థితిలో వీరు కొట్టుమిట్టాడుతున్నారు. ప్రచారాలను సైతం వీరు తగ్గించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఎన్నికలకు పట్టుమని 12 రోజుల్లేవు. ఈ స్థితిలో ప్రచారాలతో పార్టీలు క్షేత్రస్థాయిలో తమ బలాన్ని చాటుతుంటాయి. అయితే నెల్లూరులో ప్రతిపక్ష టీడీపీ పరిస్థితి దయనీయంగా మారింది. ధనబలంతో ఏదైనా చేయొచ్చనే ధీమాతో ఇప్పటి వరకు ఉన్న వేమిరెడ్డి శిబిరంలో టెన్షన్ మొదలైంది.
బూమరాంగ్..
నిజానికి వేమిరెడ్డి దంపతులకు ప్రత్యక్ష రాజకీయాల్లో ఎలాంటి అనుభవం లేదు. ఈ తరుణంలో వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి నెల్లూరు లోక్‌సభ, ప్రశాంతిరెడ్డికి కోవూరు అసెంబ్లీ టికెట్లను టీడీపీ కేటాయించింది. ఈ క్రమంలో తమ బలాన్ని ప్రదర్శించాలనే భావనతో నగదు ప్రలోభాలకు గురిచేసి పలువురు నేతలను వీరు ఆకర్షించారు. అయితే టీడీపీలో చేరిన నేతల్లో చాలా మంది అక్కడ ఇమడలేక తిరిగి తమ సొంతగూటికి చేరుకుంటుండటంతో వీరి వ్యూహాలు బూమరాంగయ్యాయి. మరోవైపు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కట్టబెట్టిన పదవులను అనుభవిస్తూ.. వీరు పార్టీని మారి తప్పటడుగేశారని ఆయన వర్గీయులే బహిరంగంగా చెప్తుండటం గమనార్హం.
ఏదీ ప్రజాస్పందన..?
ప్రశాంతిరెడ్డి పోటీ చేస్తున్న కోవూరుతో సహా ఏ నియోజకవర్గంలోనూ ఆశించిన స్థాయిలో ప్రజాదరణ టీడీపీకి కనిపించడంలేదు. డబ్బులిచ్చి జనాలను తరలిస్తున్నా, కొద్దిసేపటికే ముఖం చాటేస్తున్నారు. కోవూరులో నిర్వహించిన ఆతీ్మయ సమావేశాల్లో ప్రజాస్పందన కానరాకపోగా, గ్రూపుల మధ్య కీచులాటలు వీరికి వెల్కమ్ పలుకుతున్నాయి. మరోవైపు కావలి, ఉదయగిరిలో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన ప్రజాగళం సభలకు జనం రాకపోవడంతో తమ రాజకీయ భవిష్యత్తుపై వీరికి ఎటూ పాలుపోవడంలేదు. స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులను కొన్నంత సులభంగా ఓట్లు బదిలీ అవుతాయనే వీరి భ్రమ సైతం తొలగిపోయింది.
నిన్ను నమ్మం బాబూ..!
టీడీపీ నిర్వహిస్తున్న ప్రజాగళం సభలకు జనాలు పలుచగా హాజరవుతున్నారు. ఆచరణ సాధ్యం కాని మేనిఫెస్టోను ప్రకటించడంతో చంద్రబాబుపై నమ్మకం మరింత సన్నగిల్లింది. ఈ తరుణంలో వరుస సెగతో ఆ పార్టీ అభ్యర్థులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
ఓటేయాలని అడిగే నాథుడేడీ..?
వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి ఓటేయాలని అడిగే నాథుడే కరువవుతున్నారు. తనకు ఓటేయమని ప్రజలను కోరాలని వేమిరెడ్డి సూచిస్తే.. ఖర్చులకు డబ్బులివ్వందే ప్రచారం చేయలేమని అభ్యర్థులు చెప్పారని సమాచారం. మరోవైపు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఓటును తమకే వేయాలని.. లోక్‌సభకు సంబంధించి మీ ఇష్టమంటూ నారాయణ టీమ్ ప్రచారం చేస్తోంది. కావలి, ఉదయగిరి, ఆత్మకూరు అభ్యర్థుల ప్రచారంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
నామినేషన్లకు ముందే స్పష్టత
వాస్తవానికి క్షేత్రస్థాయిలో టీడీపీకి ప్రజాదరణ లేకపోయినా.. డబ్బు మూటలతో ఓట్లు కొల్లగొట్టొచ్చనే ధీమాతో వేమిరెడ్డి దంపతులు ఉన్నారు. అయితే నామినేషన్లకు ముందే వీరికి తమ భవిష్యత్తుపై ఓ స్పష్టత వచ్చింది. మరోవైపు వేమిరెడ్డి ఆర్థిక బలంతో నెల్లూరు లోక్‌సభ పరిధిలోని టీడీపీ అభ్యర్థులు తాము గెలిచేస్తామని కలలుగన్నారు. అయితే క్షేత్రస్థాయి పరిస్థితులపై వీరికి ఇప్పుడిప్పుడే ఓ క్లారిటీ వస్తోంది. మరోవైపు నగదు ప్రలోభాలతో టీడీపీ మాజీలను వీరు తమవైపు తిప్పుకొన్నా.. ఆ ఆనందం మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలింది.
గ్రూపులతో తలనొప్పి
కోవూరుపై ఇప్పటివరకు దృష్టి సారించిన వేమిరెడ్డి తాజాగా ఆ ఫోకస్‌ను తగ్గించారని తెలుస్తోంది. టీడీపీకి క్షేత్రస్థాయిలో బలం లేకపోవడం.. ప్యాకేజీలు ఇచ్చి తెచ్చుకున్న నేతలతో ఒరిగేదేమీ లేదని గ్రహించారు. నాలుగు గ్రూపులు వేమిరెడ్డి దంపతులకు తలనొప్పిగా పరిణమించాయి. నిన్నామొన్నటి వరకు భారీగా ఖర్చు పెట్టిన వీరు ఇప్పుడు తగ్గించేశారనే టాక్ వినిపిస్తోంది.
సైలెంట్‌గా పక్కకు తోసేశారు
కోవూరు నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలకు వ్యూహకర్త పోలంరెడ్డి దినేష్ రెడ్డేననే ఉద్దేశంతో ఆయన్ను సైలెంట్‌గా సైడ్ చేశారని సమాచారం. ఎన్నికల ఖర్చుల వ్యవహారాలను చూసేందుకు తమ సొంత టీమ్‌ను రంగంలోకి దింపారని తెలుస్తోంది. వేమిరెడ్డి నామినేషన్ సమయంలోనూ దినేష్ ఒకింత అసంతృప్తిగా కనిపించారని ఆ పార్టీ నేతలే పేర్కొంటున్నారు. తొందరపడి నిర్ణయం తీసుకున్నాం.. తిరిగి వెనక్కి వెళ్లలేం.. ఎన్నికల తర్వాత మా వ్యాపారాలు మాకున్నాయంటూ ముఖ్య నేతల వద్ద వేమిరెడ్డి దంపతులు వాపోయారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment