మేయర్ కర్చీకి ఫోర్జరీ బూచి.. | - | Sakshi
Sakshi News home page

మేయర్ కర్చీకి ఫోర్జరీ బూచి..

Published Thu, Jun 27 2024 12:10 AM | Last Updated on Thu, Jun 27 2024 1:20 PM

-

కార్పొరేషన్‌లో పెత్తనం కోసమే టీడీపీ కుట్రలు, కుయుక్తులు

మేయర్‌తో పదవికి రాజీనామా చేయించే దిశగా ప్రయత్నాలు

ఆ సీటు ఖాళీగా ఉంచి డిప్యూటీ మేయర్‌కే అధికారం కట్టబెట్టేందుకు పన్నాగం

అందుకోసమే తెరపైకి ఫోర్జరీ కేసు

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్‌ కుర్చీకి టీడీపీ నేతలు ఎసరు పెట్టారు. వైఎస్సార్‌సీపీ నుంచి మేయర్‌గా ఎన్నికైన ఆ గిరిజన మహిళను ఆ పదవి నుంచి బలవంతంగా రాజీనామా చేయించేందుకు కుట్రలు, కుయుక్తులు ప్రారంభించారు. మేయర్‌ దంపతులను వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసే విధంగా వారిని ఫోర్జరీ బూచితో బెదిరించి.. రెండు వారాలుగా మానసిక క్షోభకు గురి చేస్తున్నారు.

ఈ వ్యవహారంపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో తమకు అనుకూలమైన సోషల్‌ మీడియా ద్వారా మేయర్‌ భర్త పాత్రపై విస్తృత ప్రచారం చేస్తూ పరిస్థితులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఇదంతా కార్పొరేషన్‌లో పెత్తనం కోసమే అనే ప్రచారం జరుగుతోంది.

నెల్లూరు నగరపాలక సంస్థ హోదాను సంతరించుకున్న తర్వాత మొదటి సారిగా ప్రథమ పౌరురాలిగా గిరిజన మహిళకు రిజర్వేషన్‌ కల్పిస్తూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పెద్ద పీట వేసింది. కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి నెల్లూరు 12 డివిజన్‌ కార్పొరేటర్‌గా ఎన్నికై న పోట్లూరి స్రవంతిని మేయర్‌ను చేసింది. అయితే రాష్ట్రం, జిల్లాలో అధికార మార్పిడి జరగడంతో టీడీపీ ప్రభుత్వ నేతలు నగరపాలక సంస్థలో పెత్తనం కోసం రాజకీయ కుట్రకు తెర తీశారు. మేయర్‌ పదవిలో ఉన్న గిరిజన మహిళను టార్గెట్‌ చేసి ఆమె భర్త జయవర్ధన్‌ తన భార్య అధికారాన్ని అడ్డం పెట్టుకుని కార్పొరేషన్‌ కమిషనర్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు తెరపైకి తెచ్చారు.

వైఎస్సార్‌సీపీలో ఉన్న మేయర్‌ దంపతులను టీడీపీలోకి చేర్చుకునేందుకు టీడీపీ నేతలు కుయుక్తులు పన్నడంతో భయపడిపోయిన వారు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మీడియా సముఖంగానే నెల్లూరు రూరల్‌ ప్రజాప్రతినిధిని శరణు వేడుతూ, క్షమాపణలు అడిగారు. దీన్ని బట్టి టీడీపీ నేతలు కుట్రలు, కుతంత్రాలు చేశారని అర్థమవుతోంది. మేయర్‌ దంపతులపై టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారనే ప్రచారం జరగడంతో తాజాగా మరో కొత్త వ్యూహాన్ని రచించారు.

డిప్యూటీ మేయర్‌తోనే..
నగరపాలక సంస్థ కమిషనర్‌ సంతకం ఫోర్జరీ వ్యవహారంలో మేయర్‌ దంపతుల ప్రమేయం ఉందని బూచిగా చూపి ఆమెతో తన పదవికి రాజీనామా చేయించే కుట్రలు పన్నుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోది. రెండు వారాలుగా గిరిజన మహిళను మానసిక క్షోభకు గురి చేస్తున్న టీడీపీ నేతలు త్వరలోనే మేయర్‌ సీటును ఖాళీ చేయించి.. డిప్యూటీ మేయర్‌ను ఇన్‌చార్జి మేయర్‌ స్థానంలో కూర్చొబెట్టి తమ పెత్తనం సాగించే ప్రయత్నాలు మమ్మురం చేశారని కార్పొరేషన్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మేయర్‌ తన పదవికి రాజీనామా చేసే విధంగా విచారణలో ఉన్న ఫోర్జరీ వ్యవహారాన్ని తమకు అనుకూల సోషల్‌ మీడియాలో మేయర్‌ భర్త ప్రమేయం ఉన్నట్లుగా చిలువలు పలువలుగా ప్రచారం చేస్తున్నారు.

గతంలో వైఎస్సార్‌సీపీ నుంచి మేయర్‌గా ఎన్నికై .. ఆ తర్వాత టీడీపీలోకి ఫిరాయించిన అబ్దుల్‌ అజీజ్‌ హయాంలో జరిగిన తప్పులను ప్రస్తుత మేయర్‌ స్రవంతి భర్తకు ముడిపెట్టి భయపట్టే కుట్రలు జరుగుతున్నాయి. నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్ల సంతకాలు ఫోర్జరీ చేసి మార్ట్‌గేజ్‌లో ఉన్న భవనాలను విడుదల చేయించి దాదాపు రూ.15 కోట్ల మేర కార్పొరేషన్‌ ఆదాయానికి గండి కొట్టారనేది ప్రధాన ఆరోపణ.

వాస్తవంగా కార్పొరేషన్‌ పాలన వ్యవహారాలు అన్ని కూడా ఆన్‌లైన్‌లోనే జరుగుతాయి. మార్జ్‌గేజ్‌లో ఉన్న భవనాలను రిలీజ్‌ వ్యవహారం కూడా ఆన్‌లైన్‌ ద్వారానే జరుగుతోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో ఈ విధానం ఎక్కడా మాన్యువల్‌గా జరగలేదు. గతంలో టీడీపీ హయాంలో బీపీఎస్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికే మాన్యువల్‌గా చేశారు. అయితే టీడీపీ అధికారంలోకి రాగానే కార్పొరేషన్‌లో కమిషనర్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు ఏ సంబంధం లేని ఓ న్యాయవాది ద్వారా ఫిర్యాదు చేయించడం, ఆ ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ జరగకుండానే సోషల్‌ మీడియాలో నలుగురు వైఎస్సార్‌సీపీ నేతలకు ఉచ్చు అంటూ పోస్ట్‌లు పెట్టించడం చూస్తే ఇదంతా రాజకీయ కుట్రలో భాగమనే చర్చ జరుగుతోంది.

కేవలం కార్పొరేషన్‌పై పెత్తనం కోసం టీడీపీ ప్రజాప్రతినిధుల మైండ్‌ గేమ్‌తో మేయర్‌ దంపతులతో వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసేలా ప్రయత్నించి సక్సెస్‌ అయ్యారు. ఇదీ చాలదన్నట్లు ఇంకా వారిపై ఒత్తిడి పెంచి మేయర్‌ పదవి నుంచి దించేసే కుట్రలు, కుతంత్రాలు కొనసాగిస్తున్నారు.

నోరు విప్పని మంత్రి నారాయణ..
రాష్ట్ర మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా నారాయణ తన శాఖ పరిధిలో ఉన్న నగరపాలక సంస్థలో రెండు వారాలుగా ఫోర్జరీ వివాదం నడుస్తోంది. ఆ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు నోరు విప్పకపోవడంపై సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. కొందరు టీడీపీ ప్రజాప్రతినిధుల మైండ్‌ గేమ్‌ అర్థం చేసుకున్న నారాయణ ఈ వ్యవహారంలో తలదూర్చడానికి సందేహిస్తున్నారా? లేక ఆ మైండ్‌గేమ్‌లో ఆయన పాత్ర ఉందా? అనే అనుమానాలపై చర్చ నడుస్తోంది.

మీడియా ముందుకు రాని కమిషనర్‌..
రెండు వారాలుగా కార్పొరేషన్‌లో కమిషనర్ల సంతకాలు ఫోర్జరీ చేసి కార్పొరేషన్‌ ఆదాయానికి గండి కొట్టారనే ప్రచారంపై ప్రాథమిక విచారణలో కూడా నిజమేనని తేలింది. ఈ వ్యవహారాన్ని విజిలెన్స్‌కు అప్పగించారు. నలుగురు టౌన్‌ప్లానింగ్‌ అధికారులు, ఉద్యోగులను సస్పెండ్‌ చేశారు. అయితే కార్పొరేషన్‌లో ఏం జరుగుతుందనే విషయంపై కమిషనర్‌ మీడియా ముఖంగా ఎందుకు వెల్లడించలేదనే ప్రశ్నలు, అనుమానాలు తలెత్తుతున్నాయి.

నిజంగా తన సంతకం ఫోర్జరీ జరిగి ఉంటే ఫోరెన్స్‌కు పంపారా? అలా ఎందుకు చేయలేదు. కేవలం అధికారులను బలి చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఫోర్జరీ వ్యవహరం నిజమైతే వాస్తవాలు బయట పెట్టేందుకు కమిషనర్‌ ఎందుకు జంకుతున్నారని రాజకీయ వర్గాలతో పాటు నగర ప్రజలు కూడా నిలదీస్తున్నారు. ఈ వ్యవహారం అంతా రాజకీయ కోణంగా ఉండడంతోనే మీడియా ముందుకు వచ్చే సాహసం చేయలేదనే చర్చ జరుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement