పాట్నా: కూలీకి వెళ్తూ వచ్చే అరకొర డబ్బులతో బతుకు బండిని లాగుతోన్న వ్యక్తికి లక్షలు, కోట్లు అన్న మాట వినటమే గగనం. ఆదాయ పన్ను అంటే ఏంటో తెలిసే అవకాశం చాలా తక్కువ. అలాంటి వ్యక్తికి ఏకంగా రూ.37.5 లక్షలు ఆదాయ పన్ను చెల్లించాలని ఐటీ శాఖ నోటీసులు పంపించింది. ఈ సంఘటన బిహార్‌లోని ఖజారియా జిల్లాలో జరిగింది. జిల్లాలోని మఘౌనా గ్రామానికి చెందిన గిరిష్ యాదవ్ రోజువారీ కూలీ. రోజుకు రూ.500లు సంపాదిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే.. రూ.37.5 లక్షల పన్ను బకాయిలు ఉన్నాయని, వెంటనే చెల్లించాలంటూ ఇటీవలే ఆదాయ పన్ను శాఖ నుంచి నోటీసులు అందటంతో కంగుతిన్నాడు గిరిష్ యాదవ్. ఏం చేయాలో పాలుపోక.. పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు.
‘గిరిష్ ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. ఇది మోసానికి సంబంధించిన కేసుగా అర్ధమవుతోంది. ’ అని అలౌలి పోలీస్ స్టేషన్ ఎస‍్సై పూరేంద్ర కుమార్ తెలిపారు. బాధితుడి పాన్ నెంబర్‌పై జారీ అయిన నోటీసులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. గతంలో గిరిష్ ఢిల్లీలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవించే వాడని, ఆ సమయంలో ఓ మధ్యవర్తి ద్వారా పాన్‌కార్డ్ కోసం ప్రయత్నించినట్లు చెప్పాడని వెల్లడించారు. ఆ తర్వాత ఆ మధ్యవర్తి కనిపించకుండా పోయినట్లు తెలిపాడన్నారు. గిరిష్‌కు వచ్చిన నోటీసులు రాజస్థాన్‌లోని ఓ కంపెనీకి సంబంధించినవిగా గుర్తించారు పోలీసులు. అయితే, తానెప్పుడూ రాజస్థాన్‌కు వెళ్లలేదని గిరిష్ వాపోయాడు.
ఇదీ చదవండి: దళిత యువకుడిపై దాడి.. గ్రామ సర్పంచ్ అరెస్ట్.. వీడియో వైరల్!
Comments
Please login to add a commentAdd a comment