దినసరి కూలీకి ఆదాయపు పన్ను శాఖ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఏకంగా రూ. 14 కోట్లు ట్యాక్స్ చెల్లించాలంటూ ఆ కూలీకి ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ఐతే నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన అధికారులు సైతం అతడి పరిస్థితిని చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. ఈ ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే...బిహార్‌లోని రోహ్తాస్ జిల్లాలోని యాదవ్ అనే దినసరి కూలీకి ఆదాయపు పన్ను శాఖ ఏకంగా రూ. 14 కోట్లు చెల్లించాలంటూ నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న అతడి కుటుంబం ఒక్కసారిగా షాక్‌కి గురయ్యింది. తాను దినసరి కూలీనని, తన ఆస్తి మొత్తాన్ని పలుమార్లు విక్రయించిన కూడా అంత మొత్తం చెల్లించలేనని అధికారులకు తెలియజేశాడు. యాదవ్‌కి నోటీసులు జారీ చేసేందుకు వచ్చిన అధికారులు సైతం అతడి స్థితిని చూసి ఆశ్చర్యపోయారు.
ఐతే యాదవ్ గతంలో ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌లలో వివిధ ప్రదేశాల్లో ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసినట్లు అధికారులకు తెలిపాడు. ఆ తర్వాత 2020లో కోవిడ్ మహమ్మారి కారణంగా బిహార్‌లోని తన ఇంటికి తిరిగి వచ్చేసినట్లు తెలిపాడు. ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో అక్కడ అధికారులు తన ఆధార్, పాన్‌కార్డుల కాపీలను తీసుకున్నట్లు వెల్లడించాడు.
బహుశా వారే ఆదాయపు పన్ను నుంచి తప్పించుకునేందుకు ఇలా తన పేరిట నకిలీ బ్యాంకు ఖాతాలు తెరిచి లావాదేవీలు జరిపి ఉండవచ్చని ఐటీ అధికారులకు వివరించాడు. ఆ దినసరి కూలీ యదవ్‌కి ఆదాయపు పన్ను శాఖ ప్రధాన కార్యాలయం నుంచే నేరుగా నోటీసులు పంపినట్లు ఐటీ అధికారి సత్యభూషణ్ ప్రసాద్ తెలిపారు. ఇదిలా ఉండగా, యాదవ్ సోమవారం తన ఇంటికి తాళం వేసి కుటుంబంతో ఎక్కడికో వెళ్లిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు.
(చదవండి: షాకింగ్ ఘటన:రెస్టారెంట్‌లోకి దూసుకొచ్చిన టెంపో..ముగ్గురికి గాయాలు)
Comments
Please login to add a commentAdd a comment