అక్రమ రుణయాప్‌లు.. యమపాశాలు! ఎలా మోసం చేస్తున్నారో తెలుసా.. | Sakshi
Sakshi News home page

అక్రమ రుణయాప్‌లు.. యమపాశాలు! ఎలా మోసం చేస్తున్నారో తెలుసా..

Published Mon, Feb 26 2024 11:33 AM

Online Lending Apps Trap Borrowers In A Cycle Of Debt - Sakshi

రుణాల కోసం బ్యాంక్‌లను ఆశ్రయించడం ఆనవాయితీగా మారింది. మారుతున్న టెక్నాలజీతో అప్పు కావాలనుకుంటున్నవారు బ్యాంకులకు బదులుగా రుణ యాప్‌లను వినియోగిస్తున్నారు. ఎలాంటి పూచీకత్తు లేకుండా ధ్రువపత్రాలు, గుర్తింపు వివరాలు తెలియజేయకుండా వెంటనే అప్పులిస్తామంటూ ప్రకటించడంతో వాటి వలలో పడుతున్నారు. 

అధిక మొత్తం వడ్డీలు లాగుతున్న రుణయాప్‌ల మూసుగులోని నేరముఠాలు గడువు ముగిసి వసూళ్ల పర్వం ప్రారంభించాక వేధింపులకు దిగుతున్నాయి. అక్రమ రుణయాప్‌లు నిరుద్యోగులు, చిరుద్యోగులు, పేద విద్యార్థులు, వ్యాపారుల ఉసురుతీస్తున్నాయి. ఆ రుణయాప్‌లపై చర్యలు తీసుకునేందుకు రిజర్వ్‌ బ్యాంకుతో కలిసి కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ చేపడుతుందని గడచిన సెప్టెంబరులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. 

అక్రమ రుణయాప్‌లను అరికట్టడానికి ఆర్‌బీఐ, సెబీలతోపాటు రెగ్యులేటరీ సంస్థలు చర్యలు చేపట్టాల్సిందిగా కేంద్రమంత్రి చెప్పారు. దేశంలో నేడు రుణయాప్‌లు వేల సంఖ్యలో విస్తరించాయి. అందులో మోసపూరితమైనవేమిటో తెలియజేయాల్సిన బాధ్యతను, వాటన్నింటినీ నియంత్రించే కార్యాన్ని కేంద్రం రాష్ట్రప్రభుత్వాలకు, పోలీసు విభాగాలకు, రిజర్వ్‌బ్యాంకుకు వదిలేస్తే ఎలా అనే విమర్శలు వస్తున్నాయి. కేంద్ర మంత్రిత్వశాఖలు, టెలికాం సంస్థలు, సెబీ, రాష్ట్రాలు... అన్నీ కలిసికట్టుగా పని చేయాలని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

వేలల్లో రూపాయలు ఎరగా చూపి వాటిని రుణాలిచ్చి లక్షల్లో వసూళ్లకు పాల్పడుతున్న అక్రమ ఆన్‌లైన్‌ రుణదాతలు భారీ మోసాలకు తెరతీస్తున్నట్లు సమాచారం. గతంలో దాదాపు రూ.170 కోట్ల పెట్టుబడితో ఏడాదిలోనే చైనాకు చెందిన ఓ రుణయాప్‌ సంస్థ ఏకంగా రూ.11,700 కోట్లు దండుకున్న ఘటనలు వెలుగుచూశాయి. ఒక్క హైదరాబాద్‌లోనే ఆన్‌లైన్‌ రుణయాప్‌లతో సుమారు రూ.32 వేలకోట్ల లావాదేవీలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ ఆన్‌లైన్‌ రుణాల్లో వడ్డీ, ప్రాసెసింగ్‌ ఫీజు ముందుగానే అప్పులో దాదాపు 35శాతం మేర మినహాయించుకుంటారు. గడువు తీరిన వెంటనే అధిక వడ్డీతో బాకీలు వసూళు చేస్తారు. 

ఇదీ చదవండి: 20 దేశాలను టార్గెట్‌ చేసిన చైనా హ్యాకర్లు..? కీలక పత్రాలు లీక్‌..

డిమాండ్‌ చేసినమేరకు చెల్లించకపోతే రుణ తీసుకున్నపుడు మొబైల్‌లో అన్ని అనుమతులు ఇస్తారు కాబట్టి అప్పు తీసుకున్నవారి కాంటాక్ట్‌ వివరాలు, గ్యాలరీ, హిస్టరీ అన్ని రికార్డవుతాయి. దాంతో మార్ఫింగ్‌ చేసిన కుటుంబ సభ్యుల ఫొటోలు పంపి బ్లాక్‌మెయిల్‌ చేస్తారు. దాంతో బాధితులు తట్టుకోలేక అడిగినంత ముట్టజెపుతారు. ఆన్‌లైన్‌ రుణయాప్‌ల నియంత్రణకు పటిష్ఠ చట్టాలు, చర్యలు తీసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు.

Advertisement
Advertisement