ప్రపంచ పరిణామాలు, క్యూ4 ఆర్థిక ఫలితాలు కీలకం | Sakshi
Sakshi News home page

ప్రపంచ పరిణామాలు, క్యూ4 ఆర్థిక ఫలితాలు కీలకం

Published Mon, Apr 15 2024 6:07 AM

Q4 Results, macro data, Israel-Iran conflict, global cues among key market triggers this week - Sakshi

స్థూల ఆర్థిక గణాంకాలపైనా దృష్టి

సెంటిమెంట్‌ ప్రతికూలం

ఈ వారం మార్కెట్‌పై నిపుణుల అంచనా

శ్రీరామనవమి సందర్భంగా బుధవారం మార్కెట్లకు సెలవు

ముంబై: ఇజ్రాయిల్‌–ఇరాన్‌ యుద్ధ ఉద్రిక్తతలు, స్థూల ఆర్థిక గణాంకాలు, కార్పొరేట్‌ క్యూ4 ఆర్థిక ఫలితాలు ఈ వారం స్టాక్‌ సూచీలకు దిశానిర్దేశం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. డాలర్‌ ఇండెక్స్, యూఎస్‌ బాండ్‌ ఈల్డ్స్, క్రూడాయిల్‌ ధరలు, రూపాయి విలువ తదితర అంశాలూ ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. శ్రీరామనవమి(బుధవారం) సందర్భంగా బుధవారం ఎక్సే్చంజీలకు సెలవు కావడంతో ఈ వారం ట్రేడింగ్‌ నాలుగు రోజులు జరగుతుంది. అయితే ఈ సెలవు రోజులో ఫారెక్స్, కమోడిటీ మార్కెట్లు సాయంత్రం ట్రేడింగ్‌లో యథావిధిగా పనిచేస్తాయి.  

 ‘‘అంతర్జాతీయ నెలకొన్న అస్థిర పరిస్థితులు, దేశీయంగా సార్వత్రిక ఎన్నికల ప్రారంభం(శుక్రవారం) నేపథ్యంలో వచ్చేవారం స్టాక్‌ సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతూ నష్టాల్లో చలించవచ్చు. ప్రస్తుతానికి నిఫ్టీ 22,520 వద్ద కీలక మద్దతు స్థాయిని ఏర్పాటు చేసుకుంది. ఎగువస్థాయిలో 22,750–22,800 శ్రేణిలో పరిక్షీణించవచ్చు’’ అని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్సియల్‌ సరీ్వసెస్‌ రీటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ సిద్దార్థ ఖేమా తెలిపారు.  

గత వారం ప్రథమార్థంలో రికార్డు స్థాయి ర్యాలీ చేసిన సూచీలు అమెరికా ద్రవ్యోల్బణం, క్రూడాయిల్‌ ధరలు పెరుగుదల, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలతో లాభాలన్నీ ఆవిరయ్యాయి. వారం మొత్తంగా సెన్సెక్స్‌ మూడు పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ ఆరు పాయింట్లు లాభపడ్డాయి.

క్యూ4 ఆర్థిక ఫలితాల ప్రభావం  
దేశీయ మార్కెట్‌ ముందుగా గతవారం మార్కెట్‌ ముగింపు తర్వాత వెల్లడైన టీవీఎస్‌ పూర్తి ఆర్థిక సంవత్సరం, జనవరి క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక వారంలో దాదాపు 63 కంపెనీలు తమ క్యూ4 ఫలితాలు ప్రకటించనున్నాయి. ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్‌ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్, హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్, విప్రో, జియో ఫైనాన్సియల్‌ సరీ్వసెస్, ఏంజెల్‌ వన్, ఐసీసీఐ లాంబార్డ్, క్రిసెల్, ఏంజెల్‌ వన్, టాటా కమ్యూనికేషన్స్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, పెర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌ కంపెనీలు ఇందులో ఇన్నాయి. కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమాన్యం అవుట్‌లుక్‌ వ్యాఖ్యలను మార్కెట్‌ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్‌ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది.

స్థూల ఆర్థిక గణాంకాలు
జపాన్‌ మెషిన్‌ టూల్‌ ఆర్డర్స్‌ డేటా, యూరోజోన్‌ ఫిబ్రవరి వాణిజ్య లోటు, పారిశ్రామికోత్పత్తి గణాంకాలతో పాటు దేశీయ హోల్‌సేల్‌ ద్రవ్యోల్బణ డేటా సోమవారం విడుదల కానుంది. చైనా 2024 జనవరి క్వార్టర్‌ జీడీపీ, పారిశ్రామికోత్పత్తి, రిటైల్‌ అమ్మకాలతో పాటు బ్రిటన్‌ ఫిబ్రవరి నిరుద్యోగ రేటు, యూరోజోన్‌ వాణిజ్య లోటు, అమెరికా నూతన గృహ విక్రయాల డేటా మంగళవారం వెల్లడి కానుంది. యూరోజోన్, బ్రిటన్‌ మార్చి ద్రవ్యోల్బణ గణాంకాలు బుధవారం విడుదల
అవుతాయి. ఇక శుక్రవారం జపాన్‌ మార్చి ద్రవ్యోల్బణం, బ్రిటన్‌ డిసెంబర్‌ రిటైల్‌ సేల్స్‌ విడుదల అవుతాయి.

ప్రపంచ పరిణామాలు
తూర్పు దేశాల్లో మళీ యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్‌పై డ్రోన్లు, మిస్సైళ్లతో ఇరాన్‌ దాడులకు పాల్పడింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు రెండు శాతం మేర పెరిగాయి. చమురుని భారీ ఎత్తున దిగుమతి చేసుకుంటున్న భారత్‌పై ప్రతికూల ప్రభావం చూపనుంది. యూఎస్‌ మార్చి ద్రవ్యోల్బణ అంచనాలకు మించి నమోదవడం ‘ఫెడ్‌ వడ్డీ రేట్ల తగ్గింపు వాయిదా’ వాదనలకు బలాన్నివ్వొచ్చు. కావున ప్రపంచ పరిణామాలు ఈక్విటీ మార్కెట్లకు అనుకూలంగా లేవు.

Advertisement
Advertisement