నా భర్త మృతికి కారణం వాళ్లిద్దరే: రవీందర్‌ భార్య | Home Guard Ravinder Wife Sensational Allegations - Sakshi
Sakshi News home page

నా భర్త మృతికి కారణం వాళ్లిద్దరే:హోంగార్డ్‌ రవీందర్‌ భార్య సంచలన ఆరోపణలు

Published Fri, Sep 8 2023 10:29 AM

Home guard Ravinder Wife Sensational Alllegations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హోంగార్డ్‌ రవీందర్‌ సూసైడ్‌ కేసు ఊహించని మలుపు తిరిగింది. చికిత్స పొందుతూ ఆయన కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే అధికారుల వేధింపులూ కూడా తన భర్త మరణానికి కారణమంటూ చెబుతూ వచ్చిన రవీందర్‌ భార్య సంధ్య.. తాజాగా సంచలన ఆరోపణలకు దిగారు. 

‘‘నా భర్తను తగలబెట్టారు.  కానిస్టేబుల్‌చందు, ఏఎస్‌ఐ నర్సింగరావులు కలిసి నా భర్తపై పెట్రోల్‌ పోశారు. కానీ, ఈ ఇద్దరూ ఇప్పటివరకు అరెస్ట్‌ కాలేదు. హోంగార్డ్‌ ఆఫీస్‌ సీసీటీవీ ఫుటేజీ అందుబాటులో లేదు. అది దొరికితే అసలు వాస్తవాలు బయటకు వస్తాయి’’ అని పేర్కొన్నారామె.  తన భర్తను తీవ్రంగా వేధించారన్న ఆమె.. ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయింది.

"నా భర్త ఫోన్‌ అన్‌లాక్‌ చేసి మొత్తం డేటా డిలీట్‌ చేశారు. హమీద్‌ అనే అధికారి నా దగ్గరకు వచ్చి పెట్రోల్‌ బంక్‌లో ప్రమాదం జరిగిందని చెప్పాలన్నారు. అలా అయితేనే బెనిఫిట్స్‌ వస్తాయని చెప్పి.. నన్ను పక్కదారి పట్టించే యత్నం చేశారు" అని సంధ్య ఆరోపించారు. తన భర్తను చంపిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని కన్నీళ్లతో డిమాండ్‌ చేస్తున్నారామె.

జీతం పడకపోవడంతో.. మనస్తాపానికి గురైన రవీందర్‌.. మంగళవారం సాయంత్రం ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు వార్తలు వచ్చాయి. తీవ్ర గాయాలతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రవీందర్‌ మృతి చెందారు.

రవీందర్‌ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం  ఉస్మానియాకు తరలించారు పోలీసులు. ఈ క్రమంలో రవీందర్‌ భార్య కోసం ఎదురు చూస్తున్నారు. ఆమె సంతకం చేస్తేనే మృతదేహానికి పోస్ట్‌మార్టం చేస్తారు వైద్యులు. దీంతో ఉస్మానియా వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు ఆమె ఆరోపణలపై పోలీస్‌ శాఖ స్పందించాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
 
Advertisement