సాక్షి, భువనేశ్వర్: ఒడిశా నూతన ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఉత్కంఠకు తెర దించుతూ బీజేపీ అధిష్ఠానం.. మోహన్ చరణ్ మాఝీని సీఎంగా ప్రకటించింది. బీజేపీ శాసనసభా పక్షం మోహన్ చరణ్ మాఝీని సీఎంగా ఎన్నుకుంది. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మోహన్ మాఝీకి బీజేపీ అధిష్టానం సీఎం పగ్గాలు అప్పగించింది. డిప్యూటీ సీఎంలుగా కనకవర్థన్ సింగ్ దేవ్, ప్రవతి పరిడా ఎన్నికయ్యారు. ఈ భేటీకి బీజేపీ అధిష్ఠానం తరఫున కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, భూపేంద్ర యాదవ్ హాజరయ్యారు.
ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా అధికార బీజేడీ పరాజయం పాలైంది. 24 ఏళ్లుగా ఒడిశా సీఎంగా ఉన్న నవీన్ పట్నాయక్ ప్రతిపక్షానికి పరిమితయ్యారు. ఒడిశా 147 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 78 స్థానాల్ని కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక బీజేడీ 51 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ 14 స్థానాల్లో విజయం సాధించగా, మూడు ఇండిపెండెంట్ అభ్యర్థులకు దక్కాయి. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 21 స్థానాలకు గాను బీజేపీ 20, కాంగ్రెస్ 1 గెలుచుకోవడంతో బీజేడీ ఘోర పరాజయం పాలైంది.
రేపు కొత్త సీఎం ప్రమాణ స్వీకారం
రేపు సాయంత్రం 5 గంటలకు ఒడిశా కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు భువనేశ్వర్ చేరుకుని విమానాశ్రయం నుంచి రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు.అనంతరం సాయంత్రం 5 గంటలకు జనతా మైదాన్‌లో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment