Sakshi News home page

నీరమ్మా... నీరు

Published Mon, Apr 15 2024 4:38 AM

Sakshi Editorial On Drinking Water

ముసిల్దానికి అర్ధరాత్రి దప్పికేసింది. ‘నీల్లు... నీల్లు’... ప్రాణం తుదకొచ్చి అంగలార్చింది. పదేళ్ల మనవరాలు పోలికి దిక్కు తెలియలేదు. బంగారమో, వెండో అయితే ఎవరింటి నుంచైనా దేబిరించి తేవచ్చు. నీళ్లెక్కడవి? అందునా రాళ్లమిట్ట అనే ఈ ఊళ్లో. వానలకు ముఖం వాచిన రాయలసీమ వాకిట్లో! ‘నీల్లే’... ముసల్ది ఆర్తనాదం చేసింది. మనవరాలికి ఉన్నది ఒక్కతే అవ్వ. అవ్వకు మిగిలింది ఒక్కతే మనవరాలు. మనవరాలు అవ్వ దగ్గరికి వచ్చి నిలబడింది. ముసల్దాని కట్టె బిగుసుకుపోతూ ఉంది. ‘తెస్తానుండవ్వా’ సత్తు చెంబు తీసుకొని పరిగెత్తింది. ఎక్కడికి? పక్కింటికా? దాపున ఉన్న బావికా? ఎక్కడా నీళ్లు లేవు. ఊరవతల కోనేటికి వెళ్లాలి.

ఈ రాత్రి... నిర్మానుష్యదారుల్లో. దాహానికి పిడచగట్టిన బాట వెంట. పోలి పరిగెత్తింది. భయంతో పరిగెత్తింది. దడతో పరిగెత్తింది. దప్పికతో పరిగెత్తింది. కోనేరు వచ్చింది. చీకటి పరదాలు కప్పుకుని ఉన్న నీరు. రాత్రయితే దెయ్యాలు తిరుగుతాయని చెప్పుకునే తావు. నుదుటి మీద చెమటతో పోలి కోనేటి మెట్ల మీద నిలుచుంది. వెళ్లిపోదామా? అవ్వ దప్పికతో ఉందే! ధైర్యం చేసి దిగింది. చెంబు ముంచింది. ఎవరో చేయి పట్టి లాగిన భ్రాంతి. ‘ఓలమ్మో’. పోలి నీళ్లలో పడింది. జీవితాన మరలా దప్పికే వేయనంత నీరు తాగుతూ మింగుతూ ఆ చిన్నారి పోలి, పసిపిల్ల పోలి అలా అడుక్కు వెళ్లిపోయింది. రాయలసీమ రచయిత దాదా హయత్‌ రాసిన ‘గుక్కెడు నీళ్లు’ కథ ఇది. 

నీళ్లెప్పుడో తెల్లారి మూడుగంటలకు వస్తాయి. నిద్ర చెడిపోతుంది. పోనీ వచ్చేవి నిండుగా వస్తాయా? రెండు బిందెలు దొరికితే పెన్నిధి. అంత తెల్లవారుజామున మొగుడు లేస్తాడా? పెళ్లామే లేవాలి! దక్కిన నీళ్లను ఇంట్లో మొగుడు సర్దుబాటు చేస్తాడా? పెళ్లామే చేయాలి. అన్నం దగ్గర అందరూ కూచున్నప్పుడు చేయి కడుక్కునే ఉప్పునీళ్ల చెంబు ఒకవైపు, తాగే నీళ్ల చెంబు ఒకవైపు. భూమి బద్దలైపోయినా చెంబులు మారడానికి లేదు. ఆ రోజు ఇంటి పిల్లాడు తాగే నీళ్లతో చేయి కడిగేశాడు పొరపాటున. అంతే! తల్లి భద్రకాళి అయ్యింది. పిల్లాడి వీపు చిట్లగొట్టేసింది. ఆనక వాణ్ణే పట్టుకుని బోరుమని ఏడ్చింది. ఆ కళ్లల్లో వచ్చేన్ని నీళ్లు కుళాయిలో వస్తే ఎంత బాగుండు! బండి నారాయణ స్వామి రాసిన ‘నీళ్లు’ కథ ఇది.

తల్లి ‘ఒక బిందె నీళ్లు తేమ్మా’ అంటే బిందె పట్టుకుని వెళ్లిన కూతురు సాయంత్రమైనా పత్తా లేదు. వయసొచ్చిన కూతురు. షాదీ చేయాల్సిన కూతురు. అందాక రోజూ నీరు మోసి తేవాల్సిన కూతురు.  ‘ఈ నీళ్ల బాధ పడలేనమ్మా. నన్ను నీళ్ల కోసం బయటకు పంపని గోషా పెట్టే ఇంట్లో పెళ్లి చెయ్యి’ అనడిగిందా కూతురు. నీళ్లున్న చోట గోషా కానీ నీళ్లు లేని చోట ఏం గోషా! కూతురైనా, కోడలైనా నీళ్లకు పోవాల్సిందే. ‘నీళ్లు ముందు... మతం తర్వాత తల్లీ!’ అందా తల్లి కూతురితో. పాపం ఏమనుకుందో ఆ కూతురు! నీళ్ల బిందె పట్టుకెళ్లి ఆ తర్వాత ఎవరితోనో వెళ్లిపోయింది. ఎవరు తీసుకెళ్లాడో వాడు ఆమె చేత నీళ్లు మోయించకుండా ఉంటాడా? ఏమో! వేంపల్లి షరీఫ్‌ రాసిన ‘పానీ’ కథ ఇది.

కాళీపట్నం రామారావు ‘జీవధార’ కథ ప్రఖ్యాతమైనది. అందులో బస్తీ ఆడవాళ్లు సంపన్నుల బంగ్లా ముందు నీళ్ల కోసం నిలువుకాళ్ల కొలువు చేస్తుంటారు. ‘వెళ్తారా కుక్కల్ని వదలమంటారా?’ అంటుంటారా బంగ్లావాళ్లు. ‘మీరు కుక్కల్ని వదిలితే మేము అంతకన్నా పెద్దగా మొరిగి తరిమికొడతాం’ అంటారు బస్తీ ఆడవాళ్లు. పాలకుల పుణ్యాన నీళ్లు లేక వారిది కుక్కబతుకైంది మరి. పేదలు తెగబడితే నిలువరించే ఇనుపగేట్లు ఇంకా ఎవరూ కనిపెట్టలేదు. సంపన్నులు తల ఒంచి నీళ్లు ఇవ్వడానికి గేట్లు తెరుస్తారు. 

పెద్దిభొట్ల సుబ్బరామయ్య ‘నీళ్లు’ కథ కూడా విఖ్యాతమైనదే. అందులో రాయలసీమ నుంచి విజయవాడకు ఉద్యోగం కోసం వచ్చిన యువకుడు ఎప్పుడు పడితే అప్పుడు నీళ్లు ముంచుకోదగ్గ కూజాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నానం చేయదగ్గ కృష్ణ ప్రవాహాన్ని చూసి తబ్బిబ్బవుతాడు. ఎన్ని బకెట్లు కావాలంటే అన్ని బకెట్లు పోసుకోదగ్గ బావి గట్టును అతడు వదలడే! ‘మా ఊళ్లో ఇన్ని నీళ్లుంటే ఎంత బాగుండు’ అని నీళ్లకు దీనులయ్యే తల్లినీ, చెల్లినీ అతడు తలుచుకు ఏడ్వని రోజు ఉందా?

ఇదంతా ఒక బాధైతే దళితులది మరో బాధ. అవును. నీటికి కూడా కులం ఉంటుంది. వారు తాగేందుకు వేరే గ్లాసుంటుంది. ఈ బాధ పడలేక ఇంట్లోనే బావి తవ్వించుకోవాలనుకుంటాడో దళిత లెక్చరరు అనంతపురంలో. కాని బండ పడుతుంది. బతుకులో వర్ణాశ్రమబండ... బావిలో రాతి బండ. కాని ఆగకూడదు. ఆగితే ప్రాణం, ఆత్మాభిమానం మిగలదు. ధైర్యం చేసి బండను తూటాలతో పేలుస్తాడు లెక్చరరు. బండ ముక్కలవుతుంది. గంగ పైకి ఎగజిమ్ముతుంది. నేలమ్మకు అంటరానితనం లేదు. అది ప్రతి బిడ్డకు నీళ్లు కుడుపుతుంది. కొలకలూరి ఇనాక్‌ ‘అస్పృశ్య గంగ’ కథ ఇది.

నీరు నాగరికత. నీరు సంస్కృతి. నీరు శుభ్రత. నీరు సిరి. నీరు శాంతి. నీరు గాదె. నీరు బోదె. నేల మీదున్న, నింగి మీదున్న నీటిని ఏ జనవాహినైతే కాపాడుకోగలదో దానిదే భవిష్యత్తు. మండు వేసవిలో నిండు కుండను ఇంట ఉంచగలిగేలా చూసేదే మంచి ప్రభుత. ప్రకృతి ఎన్నో సంకేతాలిస్తోంది. సూచనలు చేస్తోంది. నీళ్లింకిన నగరాలను ఆనవాలు పట్టిస్తోంది. నీళ్లు లేకపోతే ఏమవుతుందో సాహిత్యం కన్నీటి తడితో రాసి చూపింది. మేల్కొనడం మన వంతు!   

Advertisement
Advertisement