‘గంట’కు రూ.100.! | Sakshi
Sakshi News home page

గంటా ప్రచారానికి వస్తే.. గంటకు వంద రూపాయలు...

Published Tue, Apr 30 2024 7:22 AM

TDP Ganta Srinivasa Rao Distributing Money In Bheemili

జనం రాకపోవడంతో     గంటా శ్రీనివాసరావు డబ్బుల ఎర

గంటపాటు వస్తే     రూ.100 ఇస్తామంటూ ప్రలోభాలు

డబ్బులు పంపిణీ చేసేందుకు     ప్రత్యేక బ్యాచ్‌లు

గుడి, బడి అనే తేడా లేకుండా పంపిణీ

ఎన్నికల కమిషన్‌ కేసులు పెడుతున్నా పట్టించుకోని వైనం  

‘రండి బాబూ రండి.. గంటా వారి ప్రచారానికి వస్తే.. గంటకు వంద రూపాయలు. ఆలోచించినా ఆశాభంగం.. వచ్చి.. జై గంటా అంటే చాలు.. మీ చేతిలో వంద నోటు పెడతాం.. రండయ్యా.. ప్లీజ్‌..’  భీమిలిలో గంటా వర్గం తీరిదీ.. 

సాక్షి, విశాఖపట్నం : ఎవరైనా సరే.. ఎలాగైనా సరే.. నోటిస్తే.. ఓటేస్తారు.. ఇదే సిద్ధాంతంతో గత ఎన్నికల్లో మంది రాజకీయాలు చేసిన గంటా శ్రీనివాసరావుకు ఈ సారి భీమిలిలో చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరికీ ఒక రేటు కట్టి గంపగుత్తగా బేరమాడి దిగజారుడు రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన గంటాకు ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రచారానికి ప్రజలే కాదు.. సొంత పార్టీ కార్యకర్తలు.. జతకట్టిన బీజేపీ, జనసేన శ్రేణులు కూడా రాకపోవడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. మరో గంటలో ప్రచారం మొదలు పెట్టాల్సి ఉండగా.. గంటా గ్యాంగ్‌ రోడ్ల వెంబడి తిరుగుతున్నారు.

 ఎవరు కనిపించినా.. బాబూ.. రండి.. గంట సేపు జెండా పట్టుకొని మా ప్రచారంలో నడవండి. గంటకు ఒక్క నిమిషం కూడా ఎక్కువ ఉండొద్దు. గంట కొట్టగానే.. మీ చేతిలో వంద పెడతాం.. మీకు ఇచ్చిన జెండా మా చేతిలో పెడితే చాలూ.. బాబ్బాబూ.. అమ్మా.. రండమ్మా.. అంటూ బతిమాలుకుంటూ తీసుకొస్తున్నారు. గంట సేపు ప్రచారం మరో పావుగంటలో ముగుస్తుందనగా.. సెకండ్‌ బ్యాచ్‌ కోసం వెతుకులాటలు ప్రారంభిస్తున్నారు. ఇలా ప్రతి రోజూ జరుగుతుండటంతో గంటా గ్యాంగ్‌కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. వచ్చిన వారితో గంపగుత్త బేరాలు కూడా మాట్లాడుకుంటున్నారు. చెప్పిన టైమ్‌కి ప్రతి రోజూ వస్తే.. రోజూ డబ్బులిస్తామని బతిమాలుకుంటున్నారు.

నోటు చూపిస్తే.. వాళ్లే వస్తారులే.. 
ప్రచారానికి జనం దొరకడం లేదనీ.. గంటా శ్రీనివాసరావు ప్రచారానికంటే మేము రామంటే రామని తెగేసి చెబుతున్నారని గ్యాంగ్‌ లీడర్లు.. గంటా దగ్గర మొరపెట్టుకుంటున్నారు. ‘ఎందుకు రారు.. నోట్లు చూపించండి.. వాళ్లే.. తోకలూపుతూ వచ్చేస్తారు. గంటకు వంద కాకపోతే.. మరో యాభై కలపండి.. అప్పటికీ కాదంటే.. ఇంకో వంద ఇస్తామని చెప్పండి.. గెలిచిన తర్వాత.. భీమిలి మొత్తం మనదే కదా.. ఇచ్చిన వందకు వందరెట్లు లాగేద్దామని’ తన అనుచరులతో గంటా చెబుతున్నట్లు తెలుస్తోంది. డబ్బులు ఎరవేస్తున్నా ప్రచారానికి రాకపోవడంతో గంటా ప్రలోభాలు మితిమీరేలా చేస్తున్నాడు.

కేసులు నమోదవుతున్నా... 
మరోవైపు ప్రచారానికి జనం రాకపోవడంతో కొడుకు, తన గ్యాంగ్‌ను వివిధ ప్రాంతాలకు పంపించి ప్రచారం చేయిస్తున్నారు. జనం తనతో కలిసి నడవకపోవడంతో దేవాలయాలు, మసీదుల దగ్గరికి వెళ్లి నిబంధనలకు విరుద్ధంగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. రోడ్లను బ్లాక్‌ చేసి దారినపోతున్న ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ విషయాలపై సీరియస్‌ అయిన ఎన్నికల కమిషన్‌.. గంటా వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసులు నమోదు చేస్తున్నా.. పదే పదే కోడ్‌ ఉల్లంఘిస్తూ.. ప్రజల్ని మభ్య పెట్టేందుకు అడ్డమైన వ్యవహారాలు నడిపిస్తున్నారు. గెలుపు కష్టమని తెలిసినా.. ఇలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న గంటా ప్రలోభాల పర్వంపై భీమిలి ప్రజలు అసహ్యించుకుంటున్నారు.  
 

Advertisement

తప్పక చదవండి

Advertisement