కదిరి: టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ పేరు వినగానే కదిరి నియోజకవర్గ ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఆయన కన్ను పడితే విలువైన స్థలాలు, పొలాలు కబ్జా కావాల్సిందేనన్న విమర్శలు ఉన్నాయి. బాధితుల్లో ఎంతోమంది ముస్లింలు, ఇతర సామాజిక వర్గం వారు ఉన్నారు. కబ్జాలను ఎవరైనా ప్రశ్నిస్తే అనుచరులతో దాడులు, దౌర్జన్యాలు చేయించడం ఆయన నైజంగా ఉంది. ప్రజాకంఠకుడిగా ఉన్న ఈయనకే ప్రతి ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తుండటం చర్చనీయాంశంగా మారుతోంది. మీడియా ముందు మాత్రం కందికుంట నీతి సూక్తులు చెబుతుండడం చూసి ప్రజలు చీదరించుకుంటున్నారు.
బొరుగులమ్మి సంపాదించిన స్థలం..
కదిరి పట్టణంలోని జామియా మసీదు వీధికి చెందిన పి.ఖాజామోద్దీన్ అలియాస్ బొరుగుల ఖాజా కొన్నేళ్ల క్రితం ఊరూరా తిరిగి బొరుగులు అమ్మేవాడు. ఈ వ్యాపారంలో సంపాదించిన డబ్బుతో కదిరి–హిందూపురం రోడ్‌లో అప్పట్లో సర్వే నంబరు 70/3–3లో 4.50 ఎకరాల పొలం కొన్నాడు. కుటుంబ అవసరాల కోసం అందులో 1.50 ఎకరాలు అమ్మేయగా.. మూడెకరాలు అలానే ఉంది. ఖాజామోద్దీన్‌కు ఐదుగురు సంతానం. ఆయన మరణానంతరం ఆ పొలాన్ని కుటుంబ సభ్యులు కొన్నేళ్లుగా సాగుచేస్తూ వచ్చారు. ఆడ పిల్లలందరూ పెళ్లీడుకు రావడంతో వారికి పెళ్లి చేసేందుకు ఆ మూడెకరాల భూమిని అమ్మాలని కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు.
డబ్బు చెల్లించకుండానే ఇతరులకు రిజిస్ట్రేషన్
ఆ భూమిని అమ్ముతారనే విషయం తన అనుచరుల ద్వారా కందికుంటకు తెలిసింది. వెంటనే వారిని పిలిపించి సెంటు రూ.80 వేల చొప్పున బేరం కుదుర్చుకొని వెంటనే రూ.లక్ష అడ్వాన్స్‌గా ఇచ్చారు. తర్వాత ఆ మిగిలిన డబ్బు ఇచ్చి భూమి రిజి్రస్టేషన్ చేయించుకోండని ఖాజామోద్దీన్ కుటుంబ సభ్యులు కందికుంట ఇంటి దగ్గర వేచి ఉండటం దినచర్యగా మారింది. కొన్ని రోజులు గడిచాక ఓ రోజు ‘ఆ భూమితో మీకు ఎలాంటి సంబంధమూ లేదు. ఆ భూమి మాది. ఇదిగో మా బంధువుల పేరు మీద ఆ భూమికి సంబంధించి కదిరి రెవెన్యూ వారు మంజూరు చేసిన పట్టాదారు పాసుపుస్తకం’ అంటూ కందికుంట తెలపడంతో వారికి గుండె ఆగినంత పనైంది. ప్రశ్నించే ధైర్యం లేక, తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఇంటి దారి పట్టక తప్పలేదు. ప్రస్తుతం ఆ భూమి విలువ రూ.20 కోట్లు చేస్తుంది.
బాధిత యువకుడిపై హత్యాయత్నం
ఖాజామోద్దీన్ మనవడు అమీర్‌ఖాన్ 2018 జూలై 14న జేసీబీని తీసుకెళ్లి పొలం చదును చేయిస్తున్నాడు. ఈ విషయం కందికుంటకు తెలిసి వెంటనే తన అనుచరులను అక్కడికి పంపి ఆ యువకుడిపై రాళ్ల దాడి చేయించాడు. గుండెలపై బండ రాళ్లతో కొట్టి చంపడానికి కూడా ప్రయత్నించారు. ఈలోగా వారి కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి ఏడుస్తుంటే జనం పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని బాధితుడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఆరోజు నుంచి ఈరోజు వరకు ఆ స్థలం వైపు బాధితులు కన్నెత్తి చూడటానికి కూడా భయపడుతున్నారు. కందికుంట మాత్రం ఆ స్థలం తమదేనని బుకాయించడంతో పాటు మీడియా ముందు తాను సచీ్చలుడినంటూ నీతి సూక్తులు వల్లిస్తున్నాడు.
చిత్తుగా ఓడించండి
అమాయక ప్రజల భూమిని ఆక్రమించి, దానికి తప్పుడు పత్రాలు సృష్టించి ఆ స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించి అందులోకి ఇతరులెవ్వరూ ప్రవేశించకుండా కందికుంట ప్రస్తుతం దానికి పెద్ద గేట్ కూడా ఏర్పాటు చేయించాడు. ఆ స్థలం యజమానులు, వారి కుటుంబ సభ్యులు, బంధువులే కాకుండా ఆ దారిగుండా వెళ్లే ప్రతి ఒక్కరూ కందికుంటకు శాపనార్థాలు పెడుతున్నారు. ఇలాంటి వ్యక్తికి చంద్రబాబు ప్రతిసారీ ఎందుకు టికెట్ ఇస్తున్నాడో అర్థం కావడం లేదని జనం తప్పుబడుతున్నారు. పేదల స్థలాలు కబ్జా చేసే కందికుంటను ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment