షేక్‌స్పియరే తన పవర్‌ | Sakshi
Sakshi News home page

షేక్‌స్పియరే తన పవర్‌

Published Fri, Nov 3 2023 12:46 AM

Author Nandini Das is winner of 2023 British Academy Book Prize - Sakshi

‘ఏ యుద్ధం ఎందుకు జరిగెనో? ఏ రాజ్యం ఎన్నాళ్లుందో?  తారీఖులు, దస్తావేజులు... ఇవి కావోయ్‌ చరిత్రకర్థం’... మహాకవి మాట తిరుగులేని సత్యం అయినప్పటికీ కొన్నిసార్లు యుద్ధాలు, తారీఖులు, ప్రేమ పురాణాలు, ముట్టడికైన ఖర్చులు... చారిత్రక పరిశోధనకు అవసరం. ఏ సమాచారమూ వృథా పోదు.

వర్తమానంలో ఉండి ఆనాటి మొగల్, బ్రిటిష్‌ ఇండియాలోకి వెళ్లడం అంత తేలిక కాదు. అలుపెరగని పరిశోధన కావాలి. అంతకుముందు కనిపించని ప్రత్యేక వెలుగు ఏదో ఆ పరిశోధనలో ప్రతిఫలించాలి. అందమైన శైలికి అద్భుతమైన పరిశోధన తోడైతే...అదే ‘కోర్టింగ్‌ ఇండియా’ పుస్తకం.

ఫ్రొఫెసర్‌ నందిని దాస్‌ రాసిన ‘కోర్టింగ్‌ ఇండియా: ఇంగ్లాండ్, మొఘల్‌ ఇండియా అండ్‌ ది ఆరిజిన్స్‌ ఆఫ్‌ ఎంపైర్‌’ పుస్తకం ప్రతిష్ఠాత్మకమైన బ్రిటిష్‌ అకాడమీ బుక్‌ ప్రైజ్‌–2023 గెలుచుకుంది...


ఇంట్లో, తరగతి గదిలో, పుస్తకాల్లో, టీవీల్లో విన్న కథల ద్వారా నందిని దాస్‌కు షేక్‌స్పియర్‌ ఇష్టమైన రచయితగా మారాడు. ఆ మహా రచయితపై ఇష్టం ఆంగ్ల సాహిత్యంపై ఇష్టంగా మారింది. ఆయన పుస్తకాలు తన మనోఫలకంపై ముద్రించుకుపోయాయి.
అలనాటి ప్రయాణ సాహిత్యం నుంచి భిన్న సంస్కృతుల మధ్య వైరు«ధ్యాల వరకు నందినికి ఎన్నో అంశాలు ఆసక్తికరంగా మారాయి. పరిశోధిస్తూ, రాసే క్రమంలో తన మానసిక ప్రపంచం విశాలం అవుతూ వచ్చింది.

యూనివర్శిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్‌లో నందిని దాస్‌ ప్రొఫెసర్‌. షేక్‌స్పియర్‌ సాహిత్యం ఆమెకు కొట్టిన పిండి. ఆమె పేరు పక్కన కనిపించే విశేషణం...‘స్పెషలిస్ట్‌ ఇన్‌ షేక్‌స్పియర్‌ స్టడీస్‌’
కోల్‌కతాలోని జాదవ్‌పూర్‌ యూనివర్శిటీలో బీఏ ఇంగ్లీష్‌ చేసింది నందిని. ఆ తరువాత స్కాలర్‌షిప్‌పై యూనివర్శిటీ కాలేజి, ఆక్స్‌ఫర్డ్‌లో చేరింది. కేంబ్రిడ్జీ, ట్రినిటీ కాలేజిలో ఎంఫిల్, పీహెచ్‌డీ చేసింది. ఒక ప్రచురణ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామర్‌గా పని చేసిన నందిని సంవత్సరం తరువాత మళ్లీ అకాడమిక్‌ రిసెర్చ్‌లోకి వచ్చింది.

ఇక తాజా విషయానికి వస్తే... ‘ది పవర్‌ ఆఫ్‌ గుడ్‌ రైటింగ్‌’గా విశ్లేషకులు కీర్తించిన ‘కోర్టింగ్‌ ఇండియా’ యూరోపియన్‌ల హింసా ధోరణి గురించి చెప్పింది. రాయబార కార్యాలయాల అసమర్థతను ఎత్తి చూపింది. మొఘల్‌ రాజకీయాలను ఆవిష్కరించింది.
‘ ఆనాటి బ్రిటన్, ఇండియాలకు సంబంధించి వాస్తవిక చిత్రాన్ని ఆవిష్కరించింది నందిని. మొగల్‌ రాజుల ఒడిదొడుకుల నుంచి బ్రిటీష్‌ వైఖరి వరకు ఈ పుస్తకంలో ఎన్నో కనిపిస్తాయి’ అంటాడు బ్రిటీష్‌ అకాడమీ బుక్‌ప్రైజ్‌– ఛైర్‌ ఆఫ్‌ ది జ్యూరీ ప్రొఫెసర్‌ చార్లెస్‌ ట్రిప్‌.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement