స్వభావం | Sakshi
Sakshi News home page

స్వభావం

Published Mon, Nov 6 2023 3:28 AM

Good character can be developed by doing good deeds - Sakshi

‘‘బట్టతలకి స్వభావానికి మందు లేదు.’’ అన్న మాట అందరికీ తెలిసినదే. స్వభావం అంటే ఏమిటి? ‘స్వ’ అంటే తన యొక్క ‘భావం’ అంటే సహజ లక్షణం, లేదా సహజ గుణం.
‘సహ’ అంటే కలిసి ‘జ’ అంటే పుట్టినది. అంటే, ఒక వ్యక్తితో పాటు పుట్టేది అని అర్థం.  

ఒక గురువుగారు శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. దారిలో ఒక ఏరు దాటవలసి వచ్చింది. ప్రవాహం మధ్యలో ఒక తేలు నీటిలో కొట్టుకుపోతూ కనిపించింది. ఒక ఆకు మీద దానిని ఎక్కించారు. పట్టుకోగానే అది కుట్టింది. బాధగా వేలిని రుద్దుకున్నారు. కొద్దిసేపటికి అది మళ్ళీ నీళ్ళలో పడిపోయింది. తిరిగి అదే పని చేశారు. అది కూడా తన పని తాను చేసింది. చేతిని గట్టిగా విదిలించారు. మూడోసారి మళ్ళీ నీళ్ళలో పడిపోయింది. ఈలోపు గట్టు వచ్చింది.

తేలుని పట్టుకుని నేల మీద వదిలారు. మళ్ళీ ముద్దు పెట్టుకుంది. ఒక శిష్యుడికి సందేహం కలిగింది. గురువుగారు మేధావి కదా! ఇంత తెలివితక్కువగా ఎందుకు ప్రవర్తించారు? అని. ‘‘రెండుమార్లు కుట్టినా మూడోమారు కూడా ఎందుకు కాపాడారు?’’ అని అడిగాడు. ‘‘కుట్టటం దాని స్వభావం. దానిని తేలు మార్చుకోలేదు. కాపాడటం అనే నా స్వభావాన్ని నేను ఎందుకు మార్చుకోవాలి?’’ అని సమాధానం చెప్పారు.

స్వభావం అంటే తన యొక్క, ‘భావం’ తత్త్వం. తనతనం. అది పుట్టుకతో వస్తుంది. ‘‘పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతోనే’’ అనే సామెత తెలుసు కదా! అంటే మారదు అని అర్థం. దీనిని వంకగా పెట్టుకుని తమలో ఉన్న చెడు స్వభావాన్ని మార్చుకునే ప్రయత్నం చేయరు చాలా మంది. ఇదే మనిషి పురోభివృద్ధిని నిర్ణయించే ప్రధాన అంశం.

సుమారుగా అందరికీ చాలా విషయాలు తెలుసు. ఏది మంచి ఏది చెడు అన్నదీ తెలుసు. తెలిసిన దానిని ఎంత వరకు ఆచరణలో పెట్టారు? అన్న దాని వల్ల పురోభివృద్ధిలో వ్యత్యాసం వస్తుంది. దానికి కారణం స్వభావం. స్వభావం సరిదిద్దుకో వలసినది అయితే చాలా ప్రయత్నం చేయ వలసి ఉంటుంది. ముందుగా మార్చుకోవాలి అనే సంకల్పం ఉండాలి. క్రమంగా, నిలకడగా ప్రయత్నం చేయాలి.

మూతిని కట్టేసినా మాట్లాడకుండా ఉండలేని వారి చేత పాఠాలని చదివించిన ఉపాధ్యాయులని చూశాం. పెరిగాక వారిని యాంకర్లుగా చేస్తే సరి. పాఠం చదవటం వల్ల ఉచ్ఛారణ స్పష్టంగా ఉంటుంది. ఆగకుండా మాట్లాడి మంచి పేరు తెచ్చుకుంటారు. స్వభావాన్ని అనుకూలంగా ఉపయోగించుకునే మార్గం ఇది. అదేవిధంగా అబద్ధాలు ఆడే పిల్లవాడు ఉంటే, వాడి చేత కథలు రాయిస్తే వాడి సృజనాత్మకత అంతా అక్కడ చూపించటం జరుగుతుంది. నోరు విప్పని వారు ఉంటారు కొందరు. వారు రహస్యసమాచార శాఖలలో రాణిస్తారు. వ్యక్తి స్వభావాన్ని అనుసరించి తగినమార్గంలో పెడితే ఉన్నతస్థితికి చేరుకుంటారు. ఏదీ పనికి రానిది అని చెప్పటానికి వీలు లేదు.
‘స్వభావో దురతిక్రమః’’ మారదు కనుక మలచుకోవచ్చు. 

మంచి పనులు చేయటం ద్వారా మంచి స్వభావాన్ని పెంపొందించుకోవచ్చు. కనీసం మంచికి, మందికి ఉపయోగ పడవచ్చు. ఉదాహరణకి దేనిని చూసినా సొంతం చేసుకోవాలనే గుణం ఉంది అనుకుందాం. తప్పు అని తెలిసినా మనసు అదుపులో ఉండదు. అటువంటి వారిలో దొంగతనం అనే రోగం పోగొట్టటం ఎట్లా? వారి చేత ఇతరులకి ఇప్పిస్తూ ఉండాలి. అది తనదే కానక్కర లేదు. తీసుకున్న వారి ముఖంలో కనపడే ఆనందం చూసి ‘సెరిటోనిన్‌’ అనే హార్మోను విడుదల అయి వారికి ఆనందం కలిగిస్తుంది. అప్పుడు ఇతరుల వస్తువులని తీసుకోవాలనే స్వభావం క్రమక్రమంగా దూరమవుతుంది. కనీసం ఆలోచన ఆచరణ రూపం ధరించదు.

– డా. ఎన్‌. అనంతలక్ష్మి  

Advertisement
Advertisement