రంగులు చల్లుకోని హోలీ గురించి తెలుసా? | Sakshi
Sakshi News home page

రంగులు చల్లుకోని హోలీ గురించి తెలుసా?

Published Mon, Mar 25 2024 10:25 AM

Holi 2024: What is Holi And Its Significance And Why Is It celebrated - Sakshi

ప్రకృతిలో సరికొత్త సొగసు కనుల విందు చేస్తుందంటే అది వసంత రుతువు ఆగమనానికి గుర్తింపు మాత్రమే కాదు.. మనుషుల్లో ఉత్సాహానికి కారణం కూడా. ఎందుకంటే..? ఆ రుతువులోనే ఎండిన చెట్లు, కొమ్మలు, రెమ్మలు చిగురిస్తాయి. అంతేనా ఆ కొమ్మలపైన కుహు.. కుహు.. అంటూ మనసు పులకరించేలా కోయిలమ్మ మధురగానాలతో వీనుల విందు చేస్తుంది. మరోవైపు ఆ పచ్చదనపు ప్రకృతి సోయగాలు పుష్ప పరిమళ వికాసాలు అన్నీ ఏకమై ఆవిష్కృతమవుతాయి. ఆ ఆనందభరిత సమయాన చిన్న, పెద్ద, ఆడ, మగ తేడాలు లేకుండా కులమతాలకు అతీతంగా దేశ వ్యాప్తంగా జరుపుకునే తొలి వేడుక హోలీ. హోలీ పండుగ రంగుల పండుగ.. అదో ఆనంద కేళీ… ప్రజలు ఎంతో ఇష్టంగా పాల్గొనే పండుగ. వసంతాగమనంలో వస్తుంది ఈ రంగుల హోలీ.

గజగజా వణికించిన చలికి టాటా చెబుతూ.. వేసవి వెచ్చదనంలోకి అడుగుపెడుతున్న వేళ హోలీ వస్తుంది. భారతీయ పండుగల్లో హోలీ మరీ ప్రత్యేకం. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు హోలీని ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు. సంవత్సరంలో కేవలం ఒక్క సారి మాత్రమే ఘనంగా జరుపుకునే పండుగలలో హోలీ పండుగ ఒకటి. ఈ పండుగను సత్య యుగం నుంచి జరుగుతున్నట్లుగా హిందూ పురాణాలు తెలియజేస్తున్నాయి. హోళి అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. ఈ హోళిని హోలికా పూర్ణిమ అని కూడా అంటారు. పురాణాల ప్రకారం చూస్తే విష్ణు భక్తుడు ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశ్యపుడు. ప్రహ్లాదుడిని చంపడానికి రాక్షసి హోలికా ప్రయత్నిస్తుంది. ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు కావడం, తనని మాత్రమే పూజించాలన్నా.. తన మాట వినకపోవడంతో హిరణ్యకశ్యపుడే తన కొడుకు ప్రహ్లాదుడిని చంపాలని హోలికాకి ఆదేశాలు ఇచ్చాడు.

ఎందువల్ల ఇలా చేస్తాడంటే..రాక్షస రాజు.. హిరణ్యకశ్యపుడు .. కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తూ ఉంటాడు.. అది హిరణ్యకశ్యపుడికి నచ్చదు దీంతో భక్త ప్రహ్లాదుని చంపేయాలి అనుకుంటాడు. తన సోదరి అయిన హోలికను పిలుస్తారు. ఆమెకు ఉన్న శక్తితో ప్రహ్లాదుని మంటలలో ఆహుతి చేయమని ఆమెను కోరతాడు. దీంతో ఆమె ప్రహ్లాదుని ఒడిలో కూర్చోబెట్టుకొని, మంటల్లోకి దూకుతుంది. విష్ణు మాయతో ప్రహ్లాదుడు బయటపడతాడు. హోలిక రాక్షసి మాత్రం ఆ మంటల్లో చిక్కుకొని చనిపోతుందట. మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. సతీవియోగంతో తపస్సులో ఉన్న శివునికి హిమవంతుని కుమార్తె అయిన పార్వతిని ఇచ్చి దేవతలు వివాహం చేయాలనుకుంటారు. కానీ తపస్సులో ఉన్న శివునికి ఎలా తపో భంగం కలిగించాలోనని ఆలోచించి మన్మథున్ని శివుని మీదకు పంపుతారు. కామదేవుడు శివుని తపస్సును భగ్నం చేసేందుకు పూల బాణాలు వదలడంతో శివుని మనస్సు పెండ్లి వైపు మరలిస్తాడు.

దీంతో పార్వతీ పరమేశ్వరుల వివాహం జరుగుతుంది. మన్మథ బాణం ప్రభావం తగ్గగానే శివుడు తనకు మన్మథుడి వల్ల తపో భంగం కలిగిందని తన మూడో నేత్రంతో కామదేవుడిని భస్మం చేస్తాడు. పతీ వియోగంతో కామదేవుడి భార్య రతీదేవి శివునితో తన భర్త కామదేవున్ని బతికించమని వేడుకుంటుంది. శివుడు అనుగ్రహించి శరీరం లేకుండా మానసికంగా బతికే వరాన్ని ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున ప్రసాదిస్తాడు. కాముడు తిరిగి బతికిన రోజు కావడంతో కాముని పున్నమిగా పిలుస్తారు. పూర్వం ఈ పండుగ రోజున రకరకాల పూలను ఒకరిపై ఒకరు చల్లుకుని.. అలా వారి సంతోషాన్ని వ్యక్తపరిచేవారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో పూల స్థానంలో రకరకాల రంగులు వచ్చాయి. ఈ రంగులను నీళ్ళలో కలుపుకొని ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ప్రేమ తోపాటు, సౌభాగ్యాలు వెల్లి విరుస్తాయి అని అందరూ భావిస్తారు.

హోలీ ఎలా వచ్చిందంటే..
ఇక మరో కథనం ప్రకారం.. అప్పట్లో శ్రీకృష్ణుడు గోపికలతో కలసి బృందావనంలో పువ్వులు, రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకునేవారు. ఇలా చేయడం ద్వారా ప్రేమ సౌభాగ్యాలు కలుగుతాయని నమ్మకం. పురాణ కథల ప్రకారంగా.. కృష్ణుడు ముదురు రంగులో ఉంటాడు. రాధ చాలా అందంగా ఉంటుంది. ఓ రోజు కృష్ణుడు తల్లి యశోద వద్దకు వెళ్లి రాధ గురించి చెబుతాడు. రాధ మేని మెరుపు తన ఒంటి ఛాయ పూర్తి విరుద్ధంగా ఉంది, ఆమె నా ప్రేమను అంగీకరిస్తుందా అని అడుగుతాడు. అప్పుడు యశోద బదులిస్తూ, రాధ ముఖానికి కూడా నీకు నచ్చిన రంగు పూయమని సరదాగా అంటుంది. దీంతో తల్లి యశోద సలహాను అనుసరించి, శ్రీకృష్ణుడు రాధ ముఖానికి రంగులు పూస్తాడు. అలా హోలీ మొదలైంది ఈ దినాన రాక్షస పీడ పోయే౦దుకు "హోళికా" అనే ఒక విధమైన శక్తిని ఆరాధిస్తారు.

ఈ రోజునే మహాలక్ష్మీ ఆవిర్భావం..
ఆమె ప్రీతి కోస౦ అ౦దరూ కలిసి గానాలు చేయడ౦, పరిహాసాలాడడ౦ చేస్తారు. హోలికాగ్నిని రగిల్చి ఆరాధి౦చే స౦ప్రదాయ౦ ఇప్పుడు తగ్గిపోయి పరిహాసాది క్రియలే మిగిలాయి. శ్రీమహాలక్ష్మి క్షీరసాగర౦ ను౦డి ఆవిర్భవి౦చి౦దని పురాణ కథ. ఈ ఏడాది పూర్ణిమ, ఉత్తర ఫల్గుణి కలిసి వచ్చాయి. కనుక ఈ దినాన భక్తి శ్రధ్ధలతో మహాలక్ష్మిని షోడశోపచారములతో చక్కగా ఆరాధి౦చి లక్ష్మీ అష్టోత్తర శతనామాలు, కనకధారాస్తోత్ర౦, వ౦టివి పారాయణ చేయడ౦ మ౦చిది. ఈరోజున లక్ష్మిని శ్రద్ధగా అర్చి౦చే వారికి సమస్త ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.

ఈరోజుననే శ్రీకృష్ణుని ఉయ్యాలలో వేసి ఆరాధి౦చాలి. దీని ’డోలోత్సవ౦’ అని అ౦టారు. ఒరిస్సావ౦టి ప్రా౦తాలలో డోలా పూర్ణిమ పేరుతో ఇప్పటికీ దీనిని ఆచరిస్తారు. నరాడోలాగత౦ దృష్ట్వా గోవి౦ద౦ పురుషోత్తమ౦! ఫాల్గుణ్యా౦ ప్రయతో భూత్వా గోవి౦దస్య పుర౦వ్రజేత్!! ఉయ్యాలలో అర్చి౦పబడిన పురుషోత్తముడైన గోవి౦దుని ఈరోజున దర్శి౦చిన వారికి వైకు౦ఠలోక౦ ప్రాప్తిస్తు౦దని ధర్మశాస్త్రాల వాక్య౦. 

(చదవండి: జీవితం వర్ణమయం)

Advertisement
Advertisement