Sakshi Guest Column Special Story On BSNL Network - Sakshi
Sakshi News home page

BSNL: కావాలనే దివాలా తీయిస్తున్నారు! 

Published Fri, Jun 23 2023 9:09 AM

Sakshi Guest Column On BSNL Network

ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ) లను దివాళా తీయించి కార్పొరేట్‌ సంస్థలకు లాభార్జనలో అడ్డులేకుండా చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం చేయదగినదంతా చేస్తోంది. దీనికి భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానం నిలువెత్తు నిదర్శనం. ఈ సంస్థకు ఒకవైపు నష్టాలు వచ్చేలా పరిస్థి తులను సృష్టిస్తున్నది ప్రభుత్వమే. అదే సమయంలో  నష్టాల నుంచి బయట పడేయడానికి పున రుద్ధరణ (రివైవల్‌) ప్యాకేజీలు పేరిట మాయ చేస్తున్నదీ ప్రభుత్వమే. 

ప్రభుత్వం కీలక అనుమతులు ఇచ్చే క్రమంలో ముందు తన సంస్థలకు ఇచ్చి, తర్వాత ప్రైవేటు సంస్థలకు ఇవ్వడం సహజం. కాదంటే ఎటువంటి వివక్షా లేకుండా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు రెండింటికీ అనుమతులు జారీ చేయాలి. కానీ కేంద్ర ప్రభుత్వం బీఎస్‌ఎన్‌ఎల్‌కు 3జీ సర్వీ సులు ఇవ్వడానికి కావాల్సిన స్పెక్ట్రమ్‌ ఇచ్చే సమయంలో కానీ, 4జీ సర్వీసులు ఇవ్వడానికి కావాల్సిన స్పెక్ట్రమ్‌ ఇచ్చేందుకు కానీ అనేక అడ్డంకులు సృష్టించింది. కానీ ఇదే సమయంలో ప్రయివేటు టెలికాం కంపెనీలకు 4జీ సేవల అనుమతుల విషయంలో ఉదారంగా వ్యవహరించింది. 

ప్రపంచ వ్యాప్తంగా టెలికాం సాంకేతిక పరిజ్ఞానం ఎగుమతి చేసే దేశాలు నాలుగు మాత్రమే ఉన్నాయి. భారత దేశానికి మూడేళ్ళ వరకు ఆ పరిజ్ఞానం లేదు. చాలామంది పెట్టుబడి దారుల ఒత్తిడితో భారత ప్రభుత్వం బీఎస్‌ఎన్‌ఎల్‌  కేవలం మన దేశంలో తయారైన 4జీ సాంకేతిక పరిజ్ఞానాన్ని మాత్రమే వాడుకుని 4జీ సర్వీసులు ఇవ్వాలని నిబంధనలు పెట్టింది. అంటే విదేశాల నుంచి ఈ టెక్నాలజీని ఇది దిగుమతి చేసుకోకూడదన్నమాట. అయితే ప్రైవేటు టెలికాం కంపెనీ లకు మాత్రం ఈ నిబంధన విధించలేదు. 

దీంతో ప్రైవేట్‌ సంస్థలు 4జీ సేవలు అందిస్తూ మార్కెట్‌లో దూసుకుపోతుంటే.. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం కోసం మూడేళ్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎదురు చూడాల్సి వచ్చింది. ఈలోపు దాని ఖాతాదారులు చేజారిపోయారన్న సంగతి వేరే చెప్పనవసరం లేదు. ఇక నష్టాలు వచ్చాయంటే రావా? చివరకు 4జీ సర్వీ సులు ప్రారంభించడానికి అయ్యే ఖర్చులు, బీఎస్‌ఎన్‌ ఎల్‌కు ఉన్న అప్పులు, నష్టాలు, ఉద్యోగుల కోసం అయ్యే ఖర్చులు పరిశీలించి మొదటి రివైవల్‌ ప్యాకేజీని సెప్టెంబర్‌ 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 

ఈ ప్యాకేజీలో 90,000 మంది ఉద్యోగుల వాలంటరీ రిటైర్మెంట్‌ పథకం అమలైతే చెల్లించాల్సిన డబ్బూ భాగమన్న విషయం గుర్తుంచుకోవాలి. దాదాపు 74,000 కోట్ల రివైవల్‌ ప్యాకేజీని సెప్టెంబర్‌ 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 20,140 కోట్లు 4జీ స్పెక్ట్రమ్‌ కోసం కాగా, రూ. 3,674 కోట్లు బీఎస్‌ ఎన్‌ఎల్‌ కేంద్రానికి చెల్లించాల్సిన జీఎస్టీ చార్జీలు. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల వాలంటరీ రిటైర్మెంట్‌ పథకం ఖర్చు దాదాపు రూ. 29,935 కోట్లు. ఈ వీఆర్‌ఎస్‌ పథకంలో ఉద్యోగులకు రిటైర్మెంట్‌ రోజు ఇవ్వాల్సిన గ్రాట్యుటీ, కమ్యూటేషన్‌ లాంటి ఆర్థిక ప్రయోజనాలను వాయిదా వేసి, ప్రభుత్వం మోసం చేసిందనుకోండి. బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ స్పెక్ట్రమ్‌పై చెల్లించాల్సిన రూ. 3,674 కోట్ల జీఎస్టీపై కూడా ఎలాంటి వెసులుబాటు ఇవ్వలేదు.    

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఏర్పాటు సమయంలో ఆ సంస్థ గ్రామీణ ప్రాంతాల్లో చేస్తున్న సేవలకు గాను కొంత నగదు తిరిగి చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాగా 2010 వరకు మాత్రమే ఈ రకమైన చెల్లింపు చేసి ఆ తర్వాత ఈ వెసులుబాటును ఆపేసింది. భారత దేశంలో తయారైన సాంకే తిక పరిజ్ఞానం వాడుకుని 4జీ సేవలు ప్రారంభించడానికి అయ్యే ఖర్చును ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ ప్రోగ్రాంలో భాగంగా భరిస్తామని పేర్కొని, తర్వాత దాన్ని క్యాపిటల్‌ ఇన్ఫ్యూజన్, ఈక్విటీ ఇన్ఫ్యూజన్‌గా సర్దుబాటు చేసింది ప్రభుత్వం. ఇన్ఫ్యూజన్‌ అంటే నికరంగా నగదు రూపంలో ఇవ్వకుండా పెట్టుబడులు లేదా షేర్ల రూపంలో లేదా ఇతర మార్గాలలో సర్దుబాటు చేసి చూపడం. 

నిజానికి ప్రయివేటు టెలికం కంపెనీలు గత నాలు గేళ్లుగా వాణిజ్య పరంగా లాభాలు వచ్చే పట్టణ ప్రాంతా ల్లోనే 4జీ సర్వీసులు ఇస్తున్నాయి. అంతగా ఆదాయం లేని గ్రామీణ ప్రాంతాల్లో 4జీ సర్వీసులు ఇవ్వాలంటే బీఎస్‌ ఎన్‌ఎల్‌ అవసరం. ఇందుకోసం గ్రామీణ ప్రాంతాల్లో 5 లక్షల కిలో మీటర్ల ఓఎఫ్‌సీ కేబుల్‌ కలిగిన ‘భారత్‌ బ్రాడ్‌ బాండ్‌ నెట్‌వర్క్‌ లిమిటెడ్‌’ (బీబీఎన్‌ఎల్‌)ను బీఎస్‌ ఎన్‌ఎల్‌లో కేంద్ర ప్రభుత్వం విలీనం చేసింది. తాజాగా ఈ జూన్‌లో మూడవ రివైవల్‌ ప్యాకేజీగా రూ. 89,047 కోట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఇందులో 4జీ/5జీ స్పెక్ట్రమ్‌ కోసం 46,339 కోట్లు కేటా యించారు. మిగతాది అప్పులు తీర్చడం కోసం ఇచ్చారు. అయితే నికరంగా ఈ ప్యాకేజీలో నగదు సర్దు బాటు చేసింది రూ. 531 కోట్లు మాత్రమే. మొత్తంగా బీఎస్‌ఎన్‌ఎల్‌కు మూడు విడతల్లో ప్రకటించిన రూ. 3.23 లక్షల కోట్ల ప్యాకేజీలో నికరంగా నగదు రూపంలో 15,000 కోట్లు మాత్రమే సర్దుబాటు చేశారు. అది కూడా దశాబ్దాల తర్వాత పునరుద్ధరణ చేసిన గ్రామీణ సేవల సర్వీసులకు చేసిన చెల్లింపుగానే దీన్ని ఇచ్చారు. బుక్‌లో సర్దుబాటు చేసే మొత్తానికి ప్యాకేజీ అనే పేరు పెట్టడం వెసులుబాటు ఎలా అవుతుంది?. టెలికాం రంగంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ లాంటి ప్రజా సేవలు అందించే సంస్థ లేకపోతే ప్రయివేటు టెలికాం కంపెనీలు ప్రజ లను టారిఫ్‌ల పేరుతో దోచుకుంటాయని గమనించాలి.


తారానాథ్‌ మురాల, వ్యాసకర్త టెలికాం రంగ నిపుణులు
 

Advertisement
Advertisement