ఇది భద్రలోక్‌ బడ్జెట్‌ | Sakshi Guest Column Special Article On FM Nirmala Sitharaman Budget 2024 In Telugu - Sakshi
Sakshi News home page

Interim Budget 2024: ఇది భద్రలోక్‌ బడ్జెట్‌

Published Fri, Feb 2 2024 12:23 AM

Sakshi Guest Column On Nirmala Sitharaman Budget 2024

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2024 – 2025 ఆర్థిక సంవత్సరానికి గాను తాత్కాలిక (ఓట్‌ ఆన్‌ అకౌంట్‌) బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్‌ లక్ష్యం నాలుగు విభాగాల ప్రజలకు – పేదలు, యువకులు, రైతులు, మహిళలకు మేలు చేయడమేనని ఆమె పేర్కొన్నారు. ఈ నాలుగు వర్గాలకు బీజేపీ ప్రభుత్వం గత పదేళ్లలో ఏ విధమైన మేలు చేసిందన్నది ఇక్కడి ప్రశ్న? 2014 వరకూ,అంటే తాము అధికారంలోకి వచ్చే ముందర అంతా చిందరవందరే అన్నట్లు ‘మా ఆర్థిక నిర్వహణ ద్వారా 2014 ముందరి అన్ని ఆర్థిక సవాళ్ళనూ నేడు అధిగ మించాం’ అంటూ నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ఉప న్యాసంలో వ్యాఖ్యానించారు. ఇందులో ఎంత వాస్తవం ఉందో చూద్దాం.

కాంగ్రెస్‌ హయాంలో నాటి అత్యధిక పతన స్థాయి అయిన డాలర్‌తో పోలిస్తే 65 రూపాయలుగా రూపాయి విలువ ఉంది. నేడు రూపాయి విలువ డాల ర్‌తో పోలిస్తే మరింత దారు ణంగా దిగజారి 84 రూపా యల పరిధిలో ఉంది. ఇక, నిరుద్యోగం 2014లో 5.4 శాతంగా ఉండగా 2023 డిసెంబర్‌ నాటికి 8.7 శాతా నికి పెరిగిపోయింది. 2013లో దేశంలో ధరలు భారీగా పెరిగిపోవడం (ద్రవ్యోల్బణం) కూడా 2014 ఎన్ని కలలో కాంగ్రెస్‌ ఓటమికి కారణం. కాగా, 2022 నుంచీ మొదలుకొని దేశంలో ధరలు అడ్డూ ఆపూ లేకుండా పెరిగిపోతున్నాయి.

ఇక స్థూల జాతీయో త్పత్తి విషయంలో కూడా మన పరిస్థితి కేవలం ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే, గుడ్డి వాళ్ళ రాజ్యంలో... ఒంటి కన్ను రాజులా (రఘురాం రాజన్‌ వ్యాఖ్యానించినట్లు) మాత్రమే ఉందన్నది నిజం. యూపీఏ హయాంలో జీడీపీ సాలీనా సగటున  8.1 శాతం మేర పెరగగా... ప్రస్తుత బీజేపీ హయాంలో (2014 నుంచి 2023 వరకు) అది సాలీన సగటున 5.4 శాతం మేరనే పెరిగింది. కోవిడ్‌ కాలంలోని ఆర్థిక పతన స్థితిని కాసేపు పక్కన పెట్టినా మొత్తంగా బీజేపీ పాలనలో జీడీపీ పెరుగుదల పరిస్థితి గొప్పగా ఏమీ లేదు. 

అవినీతిని నిర్మూలించామంటూ ఆర్థిక మంత్రి తన బడ్జెట్‌ ఉపన్యాసంలో చెప్పుకున్నారు. వాస్తవానికి అంతర్జాతీయ ‘అవినీతి సూచి’లో భారత్‌ ర్యాంకు మొత్తం 180 దేశాలలో 2022 సంవత్సరంలో 85వ స్థానంలో ఉండగా 2023లో 93వ స్థానానికి దిగజారింది. ఇక అసమానతల విషయంలో నిత్య జీవితంలో దిగజారిపోతోన్న సామాన్య జనం జీవన ప్రమాణాలు ఒక ప్రక్కనా... పెరిగి పోతోన్న కార్పొరేట్లూ, ధనవంతుల సంపద రాసులు మరో పక్కనా కనపడుతూనే ఉన్నాయి. 

ఈ స్థితిలో ప్రస్తుత బడ్జెట్‌ ఈ సమస్యలు వేటికీ జవాబు ఇవ్వలేదు. ఇది కేవలం తాత్కాలిక బడ్జెట్‌ మాత్రమేనంటూ సమస్యల పరిష్కారాల నుంచి తప్పించుకునే ధోరణి... ద్రవ్యలోటు తగ్గింపు పేరిట ప్రజా సంక్షేమం కోసం... వారి సమస్యల పరిష్కారం కోసం కొత్తగా ఏ వ్యయాలు చేయలేని దుఃస్థితి తాలూకు ఇరకాటం ఈ బడ్జెట్‌ రూప కల్పనలో దాగి వున్న అసలు నిజాలు. 

 ఒక పక్కన ప్రభుత్వ లెక్కల ప్రకారమే ప్రత్యక్ష పన్నుల వసూళ్ళు మూడు రెట్లు పెరిగాయి. అలాగే పరోక్ష పన్నుల ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. అలాగే, మానిటైజే షన్‌ ద్వారానూ, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ ద్వారానూ కూడా  కేంద్ర  ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరుతోంది. మరో పక్కన కొన్ని లెక్కల ప్రకారం దేశీయ అప్పులు 200 లక్షల కోట్ల రూపాయలను దాటిపోయాయి. ఇంత పెద్ద ఎత్తున సమకూరిన వనరుల ఫలం, ఫలితం మాత్రం ప్రజలకు దక్కడం లేదు. అంటే, బడ్జెట్‌ల క్రమంలో జరుగుతోంది పేదలను కొట్టి పెద్దలకు పెట్టడమే అనేది నిర్వివాదాంశం. పెరుగుతోన్న బిలి యనీర్లు, ప్రపంచ ధనవంతుల జాబితాలో పైకి పాకు తోన్న వారి ర్యాంకులే దీనికి తార్కాణం! 

ఇక ప్రస్తుత బడ్జెట్‌ కూడా ఈ య«థాతథ స్థితికి మినహాయింపేమీ కాదు. ప్రస్తుత బడ్జెట్‌ అనంతరం జాతినుద్దేశించి తన సందేశంలో ప్రధాని మోదీ ఇది చరిత్రాత్మక బడ్జెట్‌ అన్నారు. ఇది కేవలం మాటల గారడీ. బడ్జెట్‌కు కొద్ది రోజుల ముందర ఈ బడ్జెట్‌ నుంచి ఏ సంచలనాలనూ ఆశించొద్దని ఆర్థిక మంత్రి చెప్పారు. బడ్జెట్‌ ప్రసంగంలోనూ ఆమె ఈ ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ పరిమితిని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని చెబుతోన్న చరిత్రాత్మక కేవలం...  ధనవంతుల సేవలో తరిస్తోన్న బడ్జెట్‌ల పరంపరలో పదవ మైలు రాయిని చేరుకోవడం తాలూకూది మాత్రమే కావచ్చు!!
డి. పాపారావు 
వ్యాసకర్త సామాజిక, ఆర్థిక రంగాల విశ్లేషకులు
మొబైల్‌: 9866179615 

Advertisement
 
Advertisement
 
Advertisement